కారులోనే భోజనం చేస్తున్న మంత్రి
‘ప్రజల సంక్షేమం, అభివృద్ధి బీఆర్‌ఎస్‌తోనే సాధ్యం. పదేళ్ల పాలనా కాలంలో అన్నిరంగాలను అభివృద్ధి చేసి చూపించాం. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేసిందేమీ లేదు. వారి మాయమాటలు నమ్మి మోసపోతే గోసపడతాం. ప్రజలు బీఆర్‌ఎస్ వైపే ఉన్నారు. బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ గెలుపు ఖాయం’ అని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ సూర్యాపేట అభ్యర్థి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
ప్రతి ఒక్కరికీ రాజ్యాంగ ఫలాలు అందాలన్న ధ్యేయంతో పని చేస్తున్నాం. ఈ పదేళ్ల కాలంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగింది. ఈ కాలంలో ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల తీసుకొచ్చా. ఉమ్మడి జిల్లాకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను అందించి బీడు భూములను సస్యశ్యామలం చేశాం. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే రూ.7500 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించాం.
సూర్యాపేటకు మూసీ మురికినీళ్ల నుంచి విముక్తి కల్పించి మిషన్ భగీరథతో కడుపు నింపుతున్నాం. మునుగోడు, దేవరకొండలో ఇప్పుడు ఫ్లోరోసిస్ సమస్య లేదు. రూ.30 వేల కోట్ల విద్యుత్ థర్మల్ ప్లాంట్ తీసుకొచ్చాం. అన్ని నియోజకవర్గాల్లో మినీట్యాంక్ బండ్‌లు, సమీకృత మార్కెట్‌లు ఏర్పాటు చేశాం. యాదాద్రి ఆలయ పునః నిర్మాణం చేసుకున్నాం.
బీఆర్‌ఎస్ పాలనలో గ్రామాల రూపురేఖలు మారాయి. కాంగ్రెస్ నాయ కులు నోట్ల కట్టలతో వస్తున్నారు. ఆ పార్టీకి ఉమ్మడి జిల్లాలోనే ముగ్గురు సీఎం అభ్యర్థులు ఉన్నారు. వారిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.
సూర్యాపేట రూపురేఖలు మారాయి
సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ వచ్చాకే అభివృద్ధి జరిగింది. నా హయాంలో రూ.వేల కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేశా. సూర్యాపేట గతంలో ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఎంత అభివృద్ధి జరిగిందో తెలుస్తుంది. పట్టణంలో హిందూ శ్మశాన వాటిక ఒకప్పుడు ఎలా ఉంది.. ఇప్పుడు మహాప్రస్థానంగా ప్రక్షాళన చేశాం. సద్దుల చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చి బోటింగ్ సౌకర్యం తీసుకొచ్చాం.
పుల్లారెడ్డి చెరువును కూడా మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుతున్నాం. మెడికల్ కళాశాల, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్, లింకురోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాం. ఐటీహబ్, బస్తీ దవాఖానాలు ఏర్పాటయ్యాయి. సూర్యాపేట పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. కళాభారతి, స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణానికి రూ.25 కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయి.
2014 ముందు సూర్యాపేట పట్టణ ప్రజలు మూసీ మురికి నీటిని తాగారు. ప్రపంచంలో ఒక నగరంలో వదిలిన నీటిని.. మరో పట్టణంలో ప్రజలు తాగడం ఎంత దురదృష్టకరమైన విషయమో జలసాధన సమితి నేత దుశ్చర్ల సత్యనారాయణే వెల్లడించారు. ప్రస్తుతం మిషన్ భగీరథతో కృష్ణా జలాలు ఆస్వాదిస్తున్నారు. ఇలా చెబుతూ పోతే లెక్కలేనంత అభివృద్ధి జరిగింది. నన్ను మరోమారు ఆశీర్వదించి గెలిపిస్తే సూర్యాపేట ఆర్థిక ముఖచిత్రమే మారుస్తా.
వచ్చే ప్రభుత్వంలోనూ..
రాష్ట్రంలో మూడవసారి కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వమే వస్తుంది. సూర్యాపేట మున్సిపాలిటీలో కూడా మా పాలకవర్గమే ఉంది. మధ్యలో కీలకమైన ఇరుసులాంటి శాసనసభ్యుడు లేకపోతే పైనుంచి కిందకు నిధులు ఏవిధంగా వస్తాయి..? నిధులు రావాలంటే ప్రభుత్వంలో కీలకంగా ఉండాలి. వచ్చే బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మళ్లీ ఉన్నత స్థానంలో ఉంటా. ఇప్పుడు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశా.. రేపు రూ.10 వేల కోట్లపైనే తీసుకురాగలుగుతా.
పేట అభివృద్ధికి మరిన్ని ప్రణాళికలు
దేశంలోనే ఆదర్శ పట్టణంగా సూర్యాపేటను అభివృద్ధి చేస్తా. మరో రూ.10 వేల కోట్లతో అభివృద్ధి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. ఐటీ హబ్ ఏర్పాటుతో వేలాది మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి దొరుకుతుంది. యువత ఇంట్లోనే ఉండి ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. డ్రైపోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పా టు చేసి పట్టణంలో వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతా.
లింగమంతుల స్వామి, ఉర్లుగొండ గుట్టల మధ్య రోప్‌వే ఏర్పాటుతో వల్లభాపురం, గుంపుల తిరుమలగిరి, గుంజలూరు గ్రామాలు నూతన శోభ సంతరించుకోనున్నాయి. ఫణిగిరి, పిల్లలమర్రి శివాలయాలు, ఉర్లుగొండను టూరిస్ట్ హబ్‌గా తీర్చిదిద్దుతా. నల్లచెరువును నక్లెస్ రోడ్డుగా ఏర్పాటు చేసుకుందాం. చైనాలోని చాంజింగ్.. కెనడాలోని వాంకోవర్ సరసన సూర్యాపేట పట్టణాన్ని నిలబెట్టాలన్నదే నా కల.
నాకు జన్మనిచ్చింది మా అమ్మ. జనం కోసమే నా జన్మ.. జనం కోసం బతకాలనుకున్నప్పుడు నేను తినే ఆ నాలుగు మెతుకులు ఇంట్లో కుటుంబ సభ్యులతోనే కలిసి తినాలనేమీ లేదు. అది గుడిలో కావచ్చు.. బడిలో కావచ్చు.. నన్ను గమ్యస్థానానికి చేర్చే నా ప్రచార వాహనమే కావచ్చు.. నా లక్ష్యం ఒక్కటే ప్రజా సేవ. నా ఆశయం ఒక్కటే.. అదే జన హితం. – బీఆర్‌ఎస్ సూర్యాపేట అభ్యర్థి, మంత్రి జగదీష్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment