నల్లగొండ టౌన్: పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. అందివచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదలకుండా ఓట్ల వేటలో పడ్డారు. ఈ నేపథ్యంలో బతుకుదెరువు కోసం వలసపోయిన వారి ఓట్లపై దృష్టి సారించారు. నల్లగొండ నియోజకవర్గ పరిధిలోని నల్లగొండ, తిప్పర్తి, కనగల్ ప్రాంతాలకు చెందిన వేలాది మంది ఓటర్లు హైదరాబాద్, ముంబయి, ఇతర పట్టణాలకు పోయి అక్కడ వివిధ రకాల ఉద్యోగాలు చేస్తున్నారు.
వారితోపాటుగా ఉన్నత చదువుల కోసం వెళ్లిన వారు కూడా ఉన్నారు. వారందరూ అక్కడ ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ ఓట్లు మాత్రం వారివారి స్వగ్రామాల్లోనే ఉన్నాయి. దీంతో వారందరినీ పోలింగ్ రోజు రప్పించేందుకు కొందరు నేతలకు బాధ్యతలు అప్పగించారు.
కొనసాగుతున్న సంప్రదింపులు
వివిధ పార్టీల నాయకులు వలస ఓటర్ల అడ్రస్‌లను సేకరించి తమ పార్టీకే ఓటు వేయాలని సంప్రదింపులు జరుపుతున్నారు. అన్ని పార్టీల నాయకులు వారితో ఫోన్‌లో మాట్లాడుతూ తమ పార్టీకే ఓటు వేయాలని కోరుతున్నారు. నల్లగొండ పట్టణం, అర్బన్ ప్రాంతాలతోపాటు తిప్పర్తి, కనగల్ మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన సుమారు ఐదు వేల మంది ఓటర్లు ఆయా ప్రాంతాలకు ఉపాధి కోసం వలస వెళ్లినట్లు సమాచారం.
ఓటుకు భలే డిమాండ్
పోటాపోటీగా ప్రచారాలు, ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటున్న అభ్యర్థులు వలస ఓటర్లపై దృష్టి పెట్టడంతో ఓటుకు మరింత డిమాండ్ పెరిగిపోయింది. ఒక్కో ఓటుకు రూ.2 వేల నుంచి రూ.5 వేలు ఆఫర్ చేస్తున్నట్లు తెలిసింది. రవాణా ఖర్చులు అదనంగా ఇస్తామని చెబుతున్నట్లు సమాచారం. మరికొందరు అభ్యర్థులు తాము గెలిస్తే డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ఇంటి స్థలాలు, బీసీ , దళిత బంధు వంటివి ఇప్పిస్తామని ఆశ పెటుతున్నారని తెలిసింది.
ఇది చదవండి: ఓటర్లకు గాలం.. అయినా గెలుస్తామ్మన్న ధీమా తక్కువే
Comments
Please login to add a commentAdd a comment