ఉమ్మడి జిల్లా నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికీ బీజేపీ బోణీ కొట్టలేదు. ప్రతి ఎన్నికల్లో పోటీచేస్తున్నా గెలుపు దరికి చేరుకోవడం లేదు. పీడీఎఫ్ నుంచి గెలిచిన అభ్యర్థులను పక్కన పెడితే.. సీపీఐకి మూడు నియోజకవర్గాల్లోనే ప్రాతినిధ్యం దక్కింది(1962 ఎన్నికల వరకు సీపీఐ, సీపీఎం కలిసే ఉన్నాయి). సీపీఎం ఇప్పటివరకు ఏడు నియోజకవర్గాల్లో ఒక్కసారి కూడా గెలుపొంద లేదు. ఈ ఎన్నికల్లోనైనా బీజేపీ బోణీ కొడుతుందా?, సీపీఎం ఏ మేరకు పట్టు సాధిస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈసారి కాంగ్రెస్‌తో పొత్తు కారణంగా ఉమ్మడి జిల్లాలో సీపీఐ పోటీలో లేదు. – సాక్షి ప్రతినిధి, నల్లగొండ
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 నియోజక వర్గాలున్నాయి. అయితే ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచి జిల్లాలో ఒక్కసారి కూడా ఏ ఒక్క నియోజకవర్గం నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం దక్కలేదు. 2004 ఎన్నికల్లో రామన్నపేట నియోజకవర్గంలో బీజేపీ నుంచి పోటీలో ఉన్నడి. మల్లేశం, 2022లో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో ఆ పార్టీ తరఫున బరిలో నిలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాత్రమే రెండో స్థానంలో నిలిచారు.
మిగతా ఎవ్వరూ రెండో స్థానంలో కూడా నిలవలేదు. ఈసారి బీజేపీ అభ్యర్థులు 11 నియోజకవర్గాల్లో పోటీలో ఉన్నా గెలుస్తామా లేదా? అన్న ఆందోళన ఆ పార్టీలో నెలకొంది. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇందులో బీజేపీ కూడా తమ అభ్యర్థులను ఎలాగైనా గెలిపించుకోవాలన్న లక్ష్యంతో జాతీయ నాయకులను రంగంలోకి దింపింది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జిల్లాలో ప్రచార సభలు, సమావేశాలు, రోడ్‌షోలలో పాల్గొంటున్నారు. ఈసారైనా ఉమ్మడి జిల్లాలో బీజేపీ బోణీ చేస్తుందా.. గెలుపు కలగానే మిగులుతుందా? అన్నది త్వరలోనే తేలనుంది.
ఐదు చోట్ల గెలిచిన సీపీఎం..
జిల్లాలోని 12 నియోజకవర్గాలకు గాను ఏడు చోట్ల సీపీఎం అభ్యర్థులు ఒక్కసారి కూడా గెలువలేదు. మిగతా ఐదు నియోజకర్గాల్లో మాత్రమే సీపీఎం అభ్యర్థులు పలుమార్లు గెలుపొందారు. వాటిల్లో కొన్నిసార్లు పొత్తుల్లో భాగంగా, మరికొన్నిసార్లు ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో ఆపార్టీ అభ్యర్థులు ఒంటరిగా బరిలో నిలిచారు.
ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీగా..
ఇక సీపీఐ(ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీగా ఉన్నప్పుడు)కి మూడు నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం దక్కలేదు. 1962 ఎన్నికల వరకు సీపీఐ, సీపీఎంలు (సీపీఐగా) కలిసే ఉన్నాయి. సీపీఐగానే ఎన్నికల బరిలో నిలిచాయి. ఉమ్మడిగా ఉన్న సమయంలో తొమ్మిది నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. కమ్యూనిస్టు పార్టీలు (సీపీఐ, సీపీఎంగా) విడిపోయాక 1967 నుంచి జరిగిన ఎన్నికల్లో సీపీఐకి మూడు చోట్ల ప్రాతినిధ్యం దక్కింది. తొమ్మిది చోట్ల ఆ పార్టీ గెలుపొందలేదు.
నియోజకవర్గాల వారీగా ఇదీ పరిస్థితి..
నల్లగొండ నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన 16 ఎన్నికల్లో బీజేపీ ఒక్కసారి కూడా గెలువలేదు. నకిరేకల్ నియోజక వర్గంలో 14 సార్లు జరిగిన ఎన్నికల్లో ఒక్కసారి కూడా బీజేపీ, టీడీపీకి ప్రాతినిధ్యం లభించలేదు. మునుగోడులో బీజేపీ, టీడీపీ, సీపీఎం ఒక్కసారి కూడా గెలువలేదు. దేవరకొండ నుంచి బీజేపీ, సీపీఎం, టీడీపీకి ఒక్కసారి కూడా విజయం దరిచేరలేదు.
నాగార్జునసాగర్ (పాత చలకుర్తి)లో సీపీఎం, బీజేపీలకు ఒక్కసారి కూడా ప్రాతినిధ్యం దక్కలేదు. మిర్యాలగూడలో బీజేపీ, టీడీపీ గెలువలేదు. సూర్యాపేట నియోజకవర్గంలో 15సార్లు ఎన్నికలు జరిగినా బీజేపీకి ఒక్కసారి కూడా విజయం వరించలేదు. తుంగతుర్తి నియోజకవర్గంలోనూ 13 సార్లు ఎన్నికలు జరగ్గా సీపీఐ, బీజేపీకి గెలిచే అవకాశం రాలేదు. హుజూర్‌నగర్‌లో పదిసార్లు జరిగిన ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ, బీజేపీ, టీడీపీ ఒక్కసారి కూడా గెలుపొందలేదు.
కోదాడలో పది సార్లు ఎన్నికలు జరగగా.. బీజేపీ, సీపీఎం, సీపీఐ ఒక్కసారి కూడా గెలుపొందలేదు. ఆలేరులో 16 సార్లు ఎన్నికలు జరగగా.. సీపీఎం, బీజేపీలకు ప్రాతినిధ్యం లభించలేదు. భువనగిరి నియోజకవర్గంలో ఉప ఎన్నికలు సహా 17 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో సీపీఎం, బీజేపీ ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయాయి.
ఇది చదవండి: Telangana Assembly Elections: ఓటరు పరిశీలనలో ఏజెంట్లే కీలకం
Comments
Please login to add a commentAdd a comment