అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు గడువు దగ్గర పడుతుండడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని పరిగెత్తిస్తున్నాయి. ఎన్నికల్లో ప్రధాన ఘట్టానికి రెండు వారాలే మిగిలి ఉండడంతో ఇప్పటికే ప్రచారం కొనసాగిస్తున్న అన్ని పార్టీలు మరింత జోరు పెంచనున్నాయి. ముఖ్య నాయకుల రాకతో ప్రచారం తారస్థాయికి చేరనుంది. – సాక్షి ప్రతినిధి, నల్లగొండ
ప్రచారంలో కొంత ముందున్న బీఆర్‌ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించింది. మరో రెండు నియోజకవర్గాల్లో సభల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పాల్గొంటున్నారు. సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి, ఆలేరు, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్, భువనగిరి, మునుగోడు ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం పాల్గొన్నారు.
పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు సంక్షేమ పథకాల అమలు, అవి ప్రజలకు అందుతున్న తీరు, ధరణి ప్రయోజనాలు, 24 గంటల విద్యుత్‌పై ప్రజలకు వివరిస్తున్నారు. ఈ నెల 20న నకిరేకల్, నల్లగొండలో నిర్వహించే సభల్లో, 21వ తేదీన రెండోసారి సూర్యాపేటలో నిర్వహించే సభలో కేసీఆర్ పాల్గొంటారు.
ఇటీవల నకిరేకల్ నియోజకవర్గం చిట్యాలపట్టణంలో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామరావు 20వ తేదీన ఆలేరు, మిర్యాలగూడలో, 22వ తేదీన కోదాడ పట్టణంలో రోడ్ షోలలో పాల్గొననున్నారు.
రేపు అమిత్‌షా పర్యటన
బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు బీజేపీ జాతీయ నేతలు రంగంలోకి దిగారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు శోభ కరంద్లాజే, అనురాగ్ ఠాకూర్, రాజీవ్ చంద్రశేఖర్‌లు ఉమ్మడి జిల్లాలో పర్యటించారు. ఈ నెల 18న మధ్యాహ్నం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నల్లగొండలో నిర్వహించే సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇతర కేంద్ర మంత్రులను కూడా రంగంలోకి దింపేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది.
గడపగడపకూ..
ముఖ్యనాయకుల సభలతోనే కాకుండా.. మిగతా రోజుల్లో అభ్యర్థులు వారి నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో సభలు, సమావేశాలతో పాటు కుల సంఘాలు, యువతతో ప్రత్యేక సమావేశాలు, సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. గడపగడపకూ తిరుగుతూ, అన్నా ఎట్లున్నవు... చెల్లె, అక్కా బాగున్నవా.. అమ్మా ఓటెయ్యాలే.. అంటూ ప్రచారం చేస్తున్నారు.
రాహుల్, ప్రియాంక సభలకు కసరత్తు
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రచారానికి జాతీయ స్థాయి నేతలు రంగంలోకి దిగనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచగా, కోదాడ, హుజూర్‌నగర్‌లో కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ మంత్రి రఘువీరారెడ్డి రోడ్‌షోలలో పాల్గొన్నారు.
రాహుల్‌గాంధీ 17వ తేదీన ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆ తరువాత రోజుల్లో నల్లగొండ జిల్లాలోనూ ఆయన పర్యటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయనతోపాటు ప్రియాంకగాంధీ సభలను కూడా కాంగ్రెస్ నాయకులు ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment