సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/స్టేషన్ మహబూబ్‌నగర్/దేవరకద్ర/నారాయణపేట: ‘జిల్లా అభివృద్ధి బాట పట్టాలన్నా.. సాగునీటి ప్రాజెక్టులతోపాటు జిల్లాలోని వేలాదిమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాలన్నా ఇందిరమ్మ రాజ్యం రావాలి’ అని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఉమ్మడి జిల్లా పరిధిలోని నారాయణపేట, దేవరకద్ర విజయభేరి సభలు, మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలో క్లాక్‌టవర్ సెంటర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు.
ఉమ్మడి పాలమూరువ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని, ఆదర్శ జిల్లాగా మార్చే బాధ్యత తనదేనన్నారు. పాలమూరును పసిడి పంటలతో కళకళలాడేలా చేస్తామని, నిరుద్యోగ సమస్యను నిర్మూలించి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ వస్తే డీడీలు కట్టిన యాదవులకు గొర్రెలు ఇవ్వదని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్‌ఎస్ కన్నా మరిన్ని మంచి పథకాలు అమలు చేస్తామన్నారు.
హామీలు విస్మరించి మోసం..
కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని రేవంత్ ధ్వజమెత్తారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, నియోజకవర్గానికి సుమారు లక్ష ఎకరాలకు సాగు నీరు, వంద పడకల ఆస్పత్రి ఇచ్చిండా.. మైనార్టీలు, గిరిజనులకు 12 శాతం చొప్పున రిజర్వేషన్, వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాడా, మొదటి ఎమ్మెల్సీ ఇచ్చాడా.. నారాయణపేట– కొడంగల్ పథకం పని మొదలు పెడతానని పెట్టిండా.. కృష్ణా– వికారాబాద్ రైల్వే లేన్ తెచ్చిండా అని ప్రశ్నించాడు. ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు.
పక్కాగా 6 గ్యారంటీల అమలు..
దేశం నుంచి నరేంద్రమోదీని పారదోలేందుకు రాహుల్‌గాంధీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించారని రేవంత్ గుర్తు చేశారు. తాను పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గానికి రాహుల్‌గాంధీ ఇప్పటికే చేరుకున్నారని.. అయినా ఇక్కడున్న అరాచక శక్తులను వంద మీటర్ల గోతి తీసి పాతిపెడతానని చెప్పడానికి పాలమూరు గడియారం చౌరస్తాకు వచ్చానన్నారు.
ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అధికారం మన చేతిలో ఉండాలని.. నిధుల కేటాయింపు మన చేతిలో ఉండాలని.. మనం సంతకం చేస్తే మన జిల్లాకు వేల కోట్లు వరదలై పారాలని.. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ పూర్తి కావాలన్నారు. వడ్డించే వాడు మన వాడు అయితే ఏ పార్టీ ఉన్నా మనకు ఇంత బువ్వ దొరుకుతుందన్నారు. ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేసి, అన్ని వర్గాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
ప్రజా సమస్యలను పట్టించుకోని బీఆర్‌ఎస్: మధుసూదన్‌రెడ్డి
దేవరకద్ర ప్రజల సమస్యల గురించి బీఆర్‌ఎస్ వాళ్లు పట్టించుకోవడం లేదని నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యరి్థ, డీసీసీ అధ్యక్షుడు జి.మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. మండల కేంద్రాల్లో మెరుగైన ఆస్పత్రులు, కళాశాలలు లేవన్నారు. నియోజకవర్గ కేంద్రంలో సోయి లేకుండా ఆర్వోబీ నిర్మాణం చేసి పట్టణాన్ని రెండుగా విడగొట్టారని ధ్వజమెత్తారు.
దీంతో పెద్ద వ్యాపార కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతం రూపురేఖలు కోల్పోయిందన్నారు. కనీసం అండర్‌పాస్ బ్రిడ్జి కట్టించాలనే ఆలోచన కూడా వారికి లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి మండలంలో 30 పడకలు, నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల ఆస్పత్రితో పాటు డిగ్రీ కళాశాల, అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
కోయిల్‌సాగర్ నీటిని మండలంలోని అన్ని గ్రామాలకు అందిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి, అరవింద్‌రెడ్డి, విజయసారథిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, నాగిరెడ్డి, శెట్టిశేఖర్, యుగంధర్‌గౌడ్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ విగ్యారంటీ మాటలు.. యెన్నం
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని ఆ పార్టీ మహబూబ్‌నగర్ నియోజకవర్గ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ చెప్పేవి గ్యారంటీ మాటలని, సంక్షేమ పథకాల అమలు తమతోనే సాధ్యమన్నారు. ఉమ్మడి పాలమూరులో 14 స్థానాల్లో పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ రాధా అమర్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు వినోద్‌కుమార్, సంజీవ్ ముదిరాజ్, నాయకులు ఎన్‌పీ వెంకటే ష్, సురేందర్‌రెడ్డి, ఆనంద్‌గౌడ్, రాఘవేందర్‌రాజు, మధుసూదన్‌రెడ్డి, సీజే బెనహర్ తదితరులు పాల్గొన్నారు.
ఇది చదవండి: TS Elections 2023: ఈసారైనా ‘కమలం’ వికసిస్తుందా.. సీపీఎంకు అవకాశం వస్తుందా?
Comments
Please login to add a commentAdd a comment