
హైదరాబాద్: రెండు రోజుల్లో జరగనున్న ఎన్నికలకు ప్రధాన పార్టీల పోల్ మేనేజ్‌మెంట్ తుది దశకు చేరింది. వివిధ రకాల ప్రలోభాలతో ఓటర్లను ఆకట్టుకొనేందుకు అభ్యర్థులు, వారి అనుచరులు తాయిలాలకు తెరలేపారు. అదే సమయంలో మద్యం, నగదు పంపిణీలో పలుచోట్ల కింది స్థాయి నాయకులు, కార్యకర్తల మధ్య ఘర్షణలు, ఆందోళనలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల ఒక్కో ఓటర్‌కు రూ.3000 నుంచి రూ.5000 వరకు నగదు, రెండు మద్యం బాటిళ్ల చొప్పున అభ్యర్థుల నుంచి వసూలు చేసిన డివిజన్ స్థాయి నాయకులు అందులో సగం కూడా ఓటర్లకు ఇవ్వడం లేదని, దీంతో తాము పోల్‌మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఓటర్లను కలవలేకపోతున్నామని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్ధులుఇచ్చిన డబ్బులో ద్వితీయశ్రేణి, డివిజన్ స్థాయి నాయకులే పెద్ద మొత్తంలో మింగేస్తున్నారని, దీంతో తాము ఓటర్లకు సమాధానం చెప్పకోలేని పరిస్థితి
నెలకొందంటున్నారు.
48 గంటలే కీలకం..
గురువారం జరగనున్న ఎన్నికల దృష్ట్యా పోల్ మేనేజ్‌మెంట్‌కు మంగళ, బుధవారాలే ఎంతో కీలకం కానున్నాయి. మంగళవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం రాత్రి వరకు ఓటర్లకు డబ్బు, మద్యం, కానుకలు పంపిణీ చేసేందుకు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు దృష్టి సారించారు. కిందిస్థాయిలో పంపకాల్లో గందరగోళం నెలకొంది. కాలనీలు, అపార్ట్‌మెంట్‌లు, బస్తీల్లో ఉండే వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులతో నిరంతరం సంబంధాలు కొనసాగించే తాము చివరకు పంపకాల వద్ద ముఖం చాటేయాల్సి రావడం ఇబ్బందిగా ఉందని కొందరు కార్యకర్తలు చెబుతున్నారు.
సగానికి తగ్గించి ఇస్తున్నారు..
‘ప్రతిపక్షాల వాళ్లు పెద్ద మొత్తంలో పంపిణీ చేస్తున్నారంటూ అభ్యర్థుల నుంచి వారి ప్రధాన అనుచరుల నుంచి భారీగా రాబట్టుకుంటున్నారు. కానీ ఏవో ఒకటి, రెండు కాలనీల్లో పంపిణీ చేసి మిగతా కాలనీలకు మొండి చేయి చూపుతున్నారు’ అని మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన ఒక ప్రధాన పార్టీ కార్యకర్త చెప్పారు. తాము తిరిగి ప్రచారం చేసిన కాలనీల్లో పంపిణీ చేయాల్సిన ఓటర్ల జాబితాను రూపొందించుకొని డివిజన్ స్థాయి నాయకుల వద్దకు వెళితే సగానికి సగం తగ్గించి ఇస్తున్నారని, దీంతో జాబితాలోని పేర్ల ప్రకారం డబ్బులు అందజేయలేకపోతున్నట్లు చెప్పారు. చివరకు కొన్ని చోట్ల రూ.1000 నుంచి రూ.2000 వరకు పంపిణీ చేస్తున్నారు. కానీ అభ్యర్థుల నుంచి మాత్రం అంతకు రెట్టింపు మొత్తంలోనే వసూలు చేస్తున్నారు.
‘పార్టీ’ల్లోనూ అంతే..
ఎన్నికల ఘట్టం తుది దశకు చేరిన ప్రస్తుత తరుణంలో ఓటర్లకు మరింత చేరువయ్యేందుకు మద్యం పంపిణీ కూడా అనివార్యంగా మారింది. ఈ క్రమంలో కాలనీలు, అపార్ట్‌మెంట్ల వారీగా రాత్రి పూట మందు పార్టీలను ఏర్పాటు చేస్తున్నారు. కానీ చాలామంది ఓటర్లు ఇలాంటి పారీ్టలకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. ఆయా పార్టీలకు చెందిన వ్యక్తులుగా ముద్ర పడకుండా ఉండేందుకు ఓటర్లు జాగ్రత్తలు పాటిస్తుండగా అనుచరగణాలు దాన్ని అవకాశంగా తీసుకుంటున్నాయని, కార్యకర్తలకు మాత్రమే ప్రచారం అనంతరం ‘పార్టీ’లను ఏర్పాటు చేసి ఓటర్ల కోసం కేటాయించిన మద్యం బాటిళ్లను తమ అవసరాలకు వినియోగించుకుంటున్నారని పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు అక్కడక్కడా భగ్గుమంటున్నారు. పోల్ మేనేజ్‌మెంట్‌కు మరో రెండు రోజులు ఉన్న దృష్ట్యా ఈ రెండు రోజుల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment