సాక్షిప్రతినిధి, వరంగల్: సార్వత్రిక ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఎన్నికల నోటిఫికేషన్‌నుంచే అభ్యర్థులు ప్రచారం చేస్తున్నా.. ఈ నెల 15న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ప్రచారం ఊపందుకుంది. 20వ తేదీ నుంచి ఉమ్మడి వరంగల్‌కు అగ్రనేతలు వరుసకట్టడంతో ప్రచారం పతాకస్థాయికి చేరింది. అభ్యర్థుల గెలుపు కోసం ప్రధాన పార్టీల క్యాంపెయినర్లు, అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. విజయమే లక్ష్యంగా అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు చెమటోడ్చారు.
రోజూ నేతల రోడ్‌షోలు, సమావేశాలు, మైక్‌ల మోతలతో ఉమ్మడి జిల్లా హోరెత్తింది. ప్రచారం ముగింపునకు ఒక్కరోజు ముందుగానే అగ్రనేతలు పోటెత్తారు. సోమవారం భారత ప్రధాని నరేంద్రమోదీ మహబూబాబాద్‌లో, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ పరకాలలో, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, డోర్నకల్ నియోజకవర్గంలో, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఏటూరు నాగారంలో రోడ్‌షోలు, సభలు నిర్వహించారు. ప్రముఖుల రాకతో ఉమ్మడి జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది. సుమారు 13 రోజులపాటు ఉధృతంగా సాగిన ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు పరిసమాప్తం కానుంది.
చివరి రోజు మంగళవారంన ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగసభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఉమ్మడి వరంగల్‌లోని 12 నియోజకవర్గాల్లో ప్రచారం ముగింపు తర్వాత ప్రధాన పార్టీల అభ్యర్థులు, నాయకులు వ్యూహరచనలో నిమగ్నం కానున్నారు. నోటిఫికేషన్ తర్వాత విస్తృతంగా నియోజకవర్గాల్లో పర్యటించినప్పటికీ ప్రతికూల పరిస్థితులున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పోల్ మేనేజ్‌మెంట్‌పై నజర్ పెట్టిన ప్రధాన పార్టీలు ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాలు అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
మద్యం షాపులు మూడు రోజులు బంద్!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజులు మద్యం షాపులు బంద్ చేయనున్నట్లు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం సాయంత్రం 5 నుంచి గురువారం సాయంత్రం 5 గంటల వరకు మద్యం షాపులు బంద్ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మద్యం అక్రమంగా విక్రయిస్తే చర్యలు తీసుంటామని హెచ్చరించారు.
ఇవి చదవండి: ఎన్నికలకు 2 రోజుల ముందు నుంచే బల్క్ మెసేజ్‌లు బంద్! : రాజర్షిషా
Comments
Please login to add a commentAdd a comment