కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి తొలిసంతకం దీనిపైనే.. | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి తొలిసంతకం దీనిపైనే..

Published Sun, Nov 26 2023 12:08 AM | Last Updated on Sun, Nov 26 2023 7:44 AM

- - Sakshi

ఆరు గ్యారంటీ పథకాలను చిన్నారి చెబుతుండడంతో ఆసక్తిగా వింటున్న రాహుల్‌ గాంధీ

సాక్షి, ఆదిలాబాద్‌: ‘బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే.. ఈ రెండు పార్టీలకు మూడో దోస్తు ఎంఐఎం.. ఈ ఎన్ని కల్లో ఆ పార్టీలను ఓడించాలని..’ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీల స్కీంలపైనే తొలిసంతకం పెట్టడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్‌లో శనివా రం నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభకు ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి ఎందుకు తీసుకురావాలో వివరించారు.

ఆరు గ్యారంటీ పథకాలను ప్రధానంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏ ఆశయాలతో తెలంగాణ ఏర్పడిందో ఆ స్వప్నాన్ని నాశనం చేశారంటూ బీఆర్‌ఎస్‌పై ధ్వజమెత్తారు. దొరల తెలంగాణను పారదోలి ప్రజల తెలంగాణను ఏర్పా టు చేసుకుందామని పిలుపునిచ్చారు. అలాగే కేంద్రంలోని మోదీప్రభుత్వం సైతం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ప్రజల ఆశయాలను కాంగ్రెస్‌ నెరవేరుస్తుందని భరోసా ఇచ్చారు. పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం రాహుల్‌ను పలువురు సన్మానించారు.

భారీగా జన సమీకరణ..
ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో కాంగ్రెస్‌ విజయభేరి సభ శనివారం నిర్వహించారు. మధ్యాహ్నం 1.40 గంటల సమయంలో రాహుల్‌ గాంధీ ఆదిలాబాద్‌ చేరుకున్నారు. నియోజకవర్గం నుంచి భారీగా జనంతరలివచ్చారు. హెలీ ప్యాడ్‌ నుంచి నేరుగా బహిరంగ సభస్థలికి వాహనంలో చేరుకున్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకులు ఎమ్మెల్సీ రాథోడ్‌ ప్రకాశ్‌, ఆదిలా బాద్‌ అభ్యర్థి కంది శ్రీనివాస్‌రెడ్డి, బోథ్‌ అభ్యర్థి ఆడె గజేందర్‌, సీనియర్‌ నేతలు గోవర్ధన్‌రెడ్డి, నరేశ్‌ జాదవ్‌, భరత్‌వాఘ్మారే, సైద్‌కాన్‌, శ్రీధర్‌ భూపెల్లి, సంతోశ్‌రావు, రూపేశ్‌రెడ్డి, జెడ్పీటీసీ గణేశ్‌ రెడ్డి, ఎస్టీ సెల్‌ పార్లమెంట్‌ కార్యదర్శి శాంతకుమారి, డేర కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుమారు గంట పాటు సభలో ఉన్న రాహుల్‌ ప్రసంగం తర్వాత బయల్దేరి వెళ్లారు.

మహిళ, చిన్నారిని వేదికపైకి పిలిచి..
రాహుల్‌ తన ప్రసంగం మధ్యలో ఆరు గ్యారంటీ ల స్కీంలపై ప్రస్తావిస్తూ సభలో ఉన్న ఓ మహిళ, చిన్నారిని వేదికపైకి రావాలనిఆహ్వానించారు. ఆ చిన్నారితో కార్డులోని ఆరు గ్యారంటీ స్కీంలను చదివిస్తూ వాటి అమలు ద్వారా తెలంగాణ ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని వివరించా రు. గృహజ్యోతి, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, యువవికాసం పథకాల ప్రాధాన్యతను వివరించారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఈ పథకాలను తీసుకొస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి తొలిసంతకం దీనిపైనే ఉంటుందని వివరించారు. రాహుల్‌ సభ సక్సెస్‌తో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement