మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలను గజమాలతో సన్మానిస్తున్న కాంగ్రెస్ శ్రేణులు
జగిత్యాల/పెద్దపల్లి: ప్రస్తుతం సర్కారు ఖజానాలో పైసల్లేవని, క్రమశిక్షణతో ఆదాయం పెంచుకుంటామని ఐటీ, పరిశ్రమలు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం పది రోజుల్లో మరో రెండు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. మంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన శ్రీధర్‌బాబు ఆదివారం జిల్లాలో పర్యటించారు. తొలుత సుల్తానాబాద్ మండలానికి చేరుకున్న ఆయన.. పెద్దపల్లి, కమాన్‌పూర్, సెంటినరీకాలనీ మీదుగా మంథని చేరుకున్నారు. అడుగడగునా ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ మక్కాన్‌సింగ్ మంత్రి వెంట ఉన్నారు.
యువతకు ఉద్యోగాలు ఇస్తాం!
జిల్లా కేంద్రంగా మారిన పెద్దపల్లి రూపురేఖలు మార్చుతామని, అభివృద్ధిలో ముందు వరుసలో నిలుపుదామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. జిల్లాలో పరిశ్రమలు ఉన్న రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అవసరం మేరకు మరిన్ని పరిశ్రమలు స్థాపిస్తామని హామీ ఇచ్చారు.
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ, నియోజకవర్గానికి మంత్రి శ్రీధర్‌బాబు అండదండలు ఉండాలన్నారు. గతంలోనూ తనకెంతో సహకారం అందించారని గుర్తుచేశారు. స్పందించిన మంత్రి శ్రీధర్‌బాబు.. సీఎం రేవంత్‌రెడి ఎమ్మెల్యే విజ్జన్నకు అత్యంత సన్నిహితులన్నారు. తామంతా కలిసే జిల్లా అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు. జిల్లాతో తనకెంతో అనుబంధం ఉందని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మంత్రి ఆదేశాలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు.
ఆరు గ్యాంరెటీలు అమలు చేస్తాం!
ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని, మరో 15 రోజుల్లో ఇంకో రెండు అమలు చేస్తామన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ , పెద్దపల్లికి బైపాస్ రోడ్డు, బస్ డిపో, జిల్లా కోర్టు, 50 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మంజూరు చేయిస్తామన్నారు. కాగా, సుల్తానాబాద్ ర్యాలీలో పలువురు దొంగలు చేతివాటం ప్రదర్శిస్తూ నాయకులు, ప్రజాప్రతినిధుల పర్సులు చోరీచేశారు.
ప్రజలు శాంతి కోరుకున్నారు..
కమాన్‌పూర్ మండలం గొల్లపల్లె వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రికి ఘనస్వాగతం పలికారు. కమాన్‌పూర్ ఎక్స్ రోడ్డు మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో మంథని నియోజకవర్గంలో రౌడీయిజం రాజ్యామేలిందన్నారు. ప్రజలు శాంతియుత వాతావరణం కోరుకుని కాంగ్రెస్‌కు ఓట్లేసి గెలిపించారని అన్నారు. నాయకులు వైనాల రాజు, ఇనగంటి భాస్కర్‌రావు, కోలేటి మారుతి, తొట్ల తిరుపతియాదవ్, ఆకుల ఓదెలు, కట్కం రవీందర్, తొగరి అన్నపూర్ణ పాల్గొన్నారు.
ఇవి చదవండి: అడవిబిడ్డకు అపూర్వ స్వాగతం.. మల్లంపల్లిలో మాట్లాడుతున్న సీతక్క!
Comments
Please login to add a commentAdd a comment