నర్సాపూర్: ఈ ఎన్నికలలో గెలిచి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే మెదక్ జిల్లాను సిరిసిల్ల జోన్ నుంచి చార్మినార్ జోన్‌లో కలుపుతామని, ఐటీ హబ్ ఏర్పాటు చేస్తామని నర్సాపూర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి వాకిటి సునీతారెడ్డి హామీ ఇచ్చారు. తాము ప్రచారంలో భాగంగా ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు తమకు అండగా ఉంటామని, పూర్తి మద్దతు తెలుపుతున్నారని ఆమె చెపుతున్నారు. మరింత మెరుగైన విద్య, వైద్యం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆమె అంటున్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడారు.
ప్రచారం ఎలా సాగుతోంది? ప్రజల నుంచి స్పందన ఏమిటి?
ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో పాటు ఆయా మండలాల నాయకులు, గ్రామ నాయకులతో కలిసి గ్రామాల్లో ప్రచారం కోసం వెళితే ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పడుతున్నారు. నాకు అండగా ఉంటామని హామీ ఇవ్వడంతో పాటు నాకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు.
ప్రజలు ఏయే సమస్యలను చెబుతున్నారు?
చాలా గ్రామాల్లో పేదలు సొంత ఇళ్లు కావాలని అడిగారు. ఇప్పటికే మూడు వేలగృహలక్ష్మి ఇళ్లు మంజూరు అయ్యాయి. ఇటీవల సీఎం కేసీఆర్ నర్సాపూర్‌కు వచ్చినప్పుడు నియోజకవర్గానికి మరో ఐదు వేల ఇళ్లు కావాలని వి/్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఎన్నికల అనంతరం పేదలందరికీ గృహలక్ష్మి ఇళ్లు మంజూరు చేస్తాం.
పార్టీ మేనిఫెస్టోపై ప్రజల స్పందన ఎలా ఉంది?
సీఎం కేసీఆర్ రూపొందించిన మేనిఫెస్టోను ప్రజలు బాగా స్వాగతిస్తున్నారు. అన్ని పథకాలకు స్పందన బాగుంది. సౌభాగ్యలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.3 వేలు, రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ, రైతుబంధు, రూ.4 వందలకే గ్యాస్ సిలిండర్, అసైన్డ్ భూములకు, పోడు భూములకు పట్టాలు అందజేసి సర్వ హక్కులు కల్పించే పథకాలతో పాటు ఇతర పథకాలను ప్రజలు ఆదరిస్తున్నారు.
మీ విజయానికి ఏయే అంశాలు దోహదపడతాయని భావిస్తున్నారు?
సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు నియోజకవర్గంలోని అర్హులందరికీ అందాయి. లబ్ధిదారులంతా తమ పార్టీకి అండగా నిలిచారు. కొన్ని పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా ఉన్నాయి. ఆసరా పింఛన్లు, రైతుబంధు, మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ నల్లాల ద్వారా నీరు అందించాం. దీంతో తాగునీటి ఇబ్బందులు తొలిగిపోవడంతో మహిళల అండ మాకుంది. అలాగే ఆరోగ్య శ్రీ పథకం లాంటి పథకాలు నా విజయానికి దోహదపడతాయి. ఆ పథకాలే రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను మూడోసారి అధికారంలోకి తేగలవు.
మీకు ఏ పార్టీతో గట్టి పోటీ ఉంది?
మాకు కాంగ్రెస్‌తోనే గట్టి పోటీ ఉంది. అయితే ప్రజల ఆశీర్వాదం, మా పార్టీ నాయకులు, కార్యకర్తల కృషితో నేనే తప్పక గెలుస్తాను. అసైన్డ్ భూములను బీఆర్‌ఎస్ ప్రభుత్వం గుంజుకుంటుందని కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ కుట్రలను ప్రజలు గుర్తించి ఆ తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొడుతున్నారు. తమ ప్రభుత్వం ఇచ్చేదే తప్ప తీసుకునేది కాదని వారికి తెలుసు.
ప్రజలకు మీరిచ్చే హామీలు?
నేను గెలువగానే సీఎం కేసీఆర్, మంత్రులు సహకారంతో జిల్లాను సిరిసిల్లజోన్ నుంచి చార్మినార్ జోన్‌లో కలుపుతా. అలాగే నియోజకవర్గంలో ఐటీ హబ్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాను. నర్సాపూర్‌లోని ఉస్మానియా పీజీ కాలేజీకి, ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మిస్తాం. అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ భవనాలు పూర్తి చేయడానికి, మైనారిటీ, బాలికల గురుకులాలకు సొంత భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాను. ప్రభుత్వ ఆసుపత్రులలో మరింత మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తాను. గ్రామాలలో అభివృద్ధి పనులను గుర్తించి ప్రాధాన్యత ప్రకారం ప్రణాళికబద్ధంగా చేపడతాం. పర్యాటకంగా కూడా అభివృద్ధి చేస్తాం.
Comments
Please login to add a commentAdd a comment