కూరెళ్ల గ్రంథాలయంలో పుస్తకాలను చూపిస్తున్న ఆచార్య కూరెళ్ల విఠలాచార్య
రామన్నపేట(నకిరేకల్): జ్ఞానాన్ని పంచడం, శక్తిమేర దానిని పెంచడం ఆయన సంకల్పం. 35 ఏళ్లుగా అదే ఆయన వ్యాపకం. దాని కోసం తన సంపదను ధారాదత్తం చేశారు. జ్ఞానాన్ని నిలబెట్టడానికి తన ఇంటిని సైతం పడగొట్టారు. అక్కడ గ్రంథాలయాన్ని నిర్మించారు. పల్లె పట్టున పెద్దపెట్టున గ్రంథపరిమళం వెదజల్లుతున్నారు. ఆయనే యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు, దాశరథి పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య. పల్లెనే నమ్ముకొని సాహిత్య పరిమళాలను వెదజల్లుతున్నారు. ఆయన 35 ఏళ్లు ఉపాధ్యాయుడిగా, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశారు.
తాను పనిచేసిన చోటల్లా విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచడానికి కృషిచేశారు. పాఠశాలల్లో గ్రంథాలయం కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేయించారు. ఉద్యోగ విరమణ అనంతరం స్వగ్రామంలోని తన ఇంటిని గ్రంథాలయంగా మార్చి ‘కూరెళ్ల గ్రంథాలయం’గా నామకరణం చేశారు. తనకున్న ఆరు ఎకరాల వ్యవసాయ భూమిని బలహీనవర్గాల ఇళ్లస్థలాలుగా పంపిణీ చేయడానికి ప్రభుత్వానికి అందజేశారు. ఆ కాలనీకి తన తల్లి స్మారకార్థం లక్ష్మీనగర్‌గా నామకరణం చేశారు. విఠలాచార్య 2014 ఫిభ్రవరి 13న వెల్లంకి గ్రామంలోని తన ఇంట్లో గ్రంథాలయం ఏర్పాటు చేశారు.
యాదాద్రి భువనగిరిజిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలోని కూరెళ్ల గ్రంథాలయం
గ్రంథాలయ నిర్వహణ కోసం ఆచార్య కూరెళ్ల ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. తన పెన్షన్ డబ్బులను కూడా గ్రంథాలయ నిర్వహణకే ఖర్చు చేస్తున్నారు. ఇక్కడ ఏళ్లనాటి వార్తాపత్రికలతోపాటు పద్య, గద్య గ్రంథాలు, ప్రత్యేక సంచికలు, వ్యక్తిత్వ వికాసం, ప్రాచీన గ్రంథాలు, బాలసాహిత్యం, విద్య, వైద్యం చరిత్ర, రామాయణం, మహాభారతంతోపాటు పోటీపరీక్షలకు ఉపయోగపడే గ్రంథాలున్నాయి.
అధునాతన వసతులతో నూతన భవనం
ప్రస్తుతం గ్రంథాలయంలోని పుస్తకాల సంఖ్య రెండు లక్షలకు చేరింది. విఠలాచార్య తన కుటుంబ సభ్యులు, దాతల సహకారం మేరకు సుమారు రూ.50 లక్షల వ్యయంతో అధునాతన గ్రంథాలయ భవనం నిర్మించారు. విశాలమైన హాలు, పుస్తకాలు అమర్చడానికి సెల్ఫ్‌లు, రీడింగ్‌హాల్, వెయింటింగ్ రూం, డిజిటల్ గదిని ఏర్పాటు చేశారు. పరిశోధక విద్యార్థులు, ఇతర సందర్శకులు బస చేయడానికి వీలుగా ప్రత్యేకగది కూడా నిర్మించారు.
ముప్పైకి పైగా రచనలు
డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యను అభినవ పోతన, మధురకవిగా సాహితీప్రియులు పిలుస్తారు. ఆయన ఇప్పటివరకు ముప్ఫైకిపైగా పుస్తకాలు రాశారు. వాటిలో విఠలేశ్వర శతకం, కాన్ఫిన్షియల్ రిపోర్ట్, గొలుసుకట్టు నవలలు గుర్తింపు తెచ్చాయి. మరికొన్ని గ్రంథాలు అముద్రితాలుగా మిగిలాయి. కూరెళ్ల సాహిత్యప్రతిభకు గుర్తింపుగా అనేక పురస్కారాలు, జీవనసాఫల్య విశిష్ట పురస్కారాలు అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాశరథి పురస్కారం 2019లో ఆయనను వరించింది.
ప్రజల్లో పఠనాసక్తి పెంపొందాలి
ప్రజల్లో పఠనాసక్తిని పెంచడం ద్వారా వారిలో విజ్ఞానం పెంచాలన్నది నా సంకల్పం. నేను ఉపాధ్యాయుడిగా పనిచేసిన చోటల్లా పగలు పిల్లలకు, సాయంకాలం తల్లిదండ్రులకు చదువు నేర్పాను. పల్లెల్లోని కవులు, కళాకారులు, వాగ్గేయకారులను ప్రోత్సహించాను. నాకు ఆస్తుల మీద మమకారం లేదు. వ్యవసాయ భూమిని పేదల ఇళ్ల స్థలాల కోసం ఇచ్చాను. ఇంటిని గ్రంథాలయానికి అంకితం చేశాను. నా పెన్షన్ డబ్బులను గ్రంథాలయ నిర్వహణకు ఉపయోగిస్తున్నా. విద్యార్థులు, పరిశోధకులు, ఆధ్యాత్మికులకు అందరికీ ఉపయోగపడేలా కూరెళ్ల గ్రంథాలయాన్ని తీర్చిదిద్దాలన్నది నా జీవితాశయం. ఈ ఆశయసాధనలో నా కుమార్తెలతోపాటు ఎంతోమంది నాకు సహకరిస్తున్నారు.
– డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య
గ్రామానికి గర్వకారణం
కూరెళ్ల విఠలాచార్య మా గ్రామానికి మార్గదర్శకులు. గ్రామంలో చేపట్టే ప్రతీపనికి ఆయన ఆశీస్సులు తీసుకుంటాం. నిస్వార్థంగా గ్రామానికి చేస్తున్న సేవలు చిరస్మరణీయం. దాశరథి పురస్కారం పొందడం మా గ్రామానికి గర్వకారణం. ఆయన ఇంటిని గ్రంథాలయంగా మార్చడం గొప్ప విషయం. చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయంగా నిలుస్తుంది. భవిష్యత్తులో గ్రంథాలయ నిర్వహణకు మా వంతు సహకారం అందిస్తాం.
– ఎడ్ల మహేందర్‌రెడ్డి, సర్పంచ్, వెల్లంకి
Comments
Please login to add a commentAdd a comment