Vithalacharya
-
మోదీ నోట.. కూరెళ్ల మాట
రామన్నపేట/సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం దేశప్రజలను ఉద్దేశించి చేసిన ‘మన్‌కీబాత్’ప్రసంగంలో రాష్ట్రానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య పేరును ప్రస్తావించడం సాహిత్య ప్రియుల్లో ఆనందం నింపింది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన సాహితీవేత్త, దాశరథి పురస్కార గ్రహీత కూరెళ్ల విఠలాచార్య స్వగ్రామంలో తన ఇంటిని గ్రంథాలయంగా మలచి అద్భుతంగా నిర్వహిస్తుండడాన్ని ప్రధాని ప్రశంసించారు. డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య తమ ఇంట్లో 2013లో 70 వేల పుస్తకాలతో గ్రంథాలయం ప్రారంభించారు. అనంతరం ఆచార్య కూరెళ్ల ట్రస్ట్ ఏర్పాటు చేసి తన కుమార్తెలు, దాతల సహకారంతో పాత ఇంటిస్థానంలో సుమారు రూ.50 లక్షల వ్యయంతో అధునాతన భవనం నిర్మించారు. ప్రస్తుతం ఈ గ్రంథాలయంలోని పుస్తకాల సంఖ్య రెండు లక్షలకు చేరింది. సాహితీవేత్తలు, ఉన్నత విద్యనభ్యసించే వారితో పాటు పరిశోధక విద్యార్థులకు ఈ గ్రంథాలయం ఎంతగానో ఉపయోగపడుతోంది. ఎంతో మందికి స్ఫూర్తిని కలిగించే కూరెళ్ల విఠలాచార్య సేవాతత్పరత గురించి ప్రధానమంత్రి మాటల్లోనే .. నా ప్రియమైన దేశ ప్రజలారా.. మన భారతదేశం చాలా అసాధారణమైన ప్రతిభావంతులతో సుసంపన్నమైనది. ఆ ప్రతిభామూర్తుల సృజనాత్మకత ఇతరులకు ఎంతో ప్రేరణ ఇస్తుంది. అలాంటి వారిలో తెలంగాణకు చెందిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య ఒకరు. ఆయన వయసు 84 సంవత్సరాలు. మీ కలలను నెరవేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదనడానికి కూరెళ్ల విఠలాచార్య ఒక ఉదాహరణ. పెద్ద గ్రంథాలయాన్ని తెరవాలనే కోరిక విఠలాచార్యగారికి చిన్నప్పటి నుంచి ఉండేది. దేశానికి అప్పటికి ఇంకా స్వాతంత్య్రం రాలేదు. కొన్ని పరిస్థితుల వల్ల కూరెళ్ల చిన్ననాటి కల కలగానే మిగిలిపోయింది. తర్వాత విఠలాచార్య తెలుగు అధ్యాపకుడు అయ్యారు. అనేక సృజనాత్మక రచనలు చేశారు. ఆరేడు సంవత్సరాల క్రితం ఆయన తన కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. తన స్వంత పుస్తకాలతో గ్రంథాలయం ప్రారంభించారు. తన జీవితకాల సంపాదనను ఇందులో పెట్టారు. క్రమంగా ప్రజలు సహకరించటం ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకిలో గల ఈ గ్రంథాలయంలో దాదాపు రెండు లక్షల పుస్తకాలు ఉన్నాయి. ఆయన కృషితో స్ఫూర్తి పొంది ఇతర గ్రామాల ప్రజలు కూడా గ్రంథాలయాలను రూపొందించే పనిలో ఉన్నారు. ప్రధాని ప్రశంస మధురానుభూతి పల్లెపట్టులను అక్షరాలకు ఆటపట్టు చేయాలనే సంకల్పంతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాను. ఇంటిని ఆచార్య కూరెళ్ల గ్రంథాలయంగా మార్చాను. కవులు, రచయితలు వివిధ సంస్థల సహకారంతో 2 లక్షల పుస్తకాలను అందుబాటులోకి తీసుకువచ్చాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్‌కీబాత్‌లో నా ప్రయత్నాన్ని ప్రశంసించడం నా పూర్వజన్మ సుకృతం. నా జీవితంలో మరచిపోలేని మధురానుభూతిగా నిలుస్తుంది. – డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య -
విఠలాచార్యపై పుస్తకం తీసుకురావడం సంతోషంగా ఉంది
‘‘నేను స్టూడెంట్‌గా ఉన్న రోజుల్లో విఠలాచార్యగారి సినిమాలు చాలా చూశాను. ఆయన దర్శకత్వంలో నేను చేసిన ఒకే ఒక సినిమా ‘ఇద్దరు మొనగాళ్లు’ హిట్ అయ్యింది. గొప్ప దర్శకుడు, సక్సెస్ఫుల్ నిర్మాత అయిన ఆయనపై పుస్తకం తీసుకురావడం సంతోషంగా ఉంది’’ అని సూపర్‌స్టార్ కృష్ణ అన్నారు. ప్రముఖ దర్శకుడు విఠలాచార్య సినిమా స్టైల్ ఆఫ్ మేకింగ్, ఆయన సినీ ప్రయాణం నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్, రచయిత పులగం చిన్నారాయణ రాసిన ‘జై విఠలాచార్య’ పుస్తకం ఫస్ట్ లుక్‌ని కృష్ణ విడుదల చేశారు. ‘‘సినిమా నిర్మాణంలో విఠలాచార్యగారు పెద్ద బాలశిక్ష లాంటివారు. కరోనా సమయంలో విఠలాచార్య శత జయంతి సందర్భంగా ఈ పుస్తకానికి అంకురార్పణ చేసి, త్వరగా రాశాను. రచయితగా నా తొమ్మిదవ పుస్తకమిది’’ అని పులగం చిన్నారాయణ అన్నారు. ‘‘జై విఠలాచార్య’ను మా తొలి పుస్తకంగా పబ్లిష్ చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని ‘మూవీ వాల్యూమ్’ షేక్ జిలాన్ బాషా అన్నారు. -
జ్ఞానాన్ని పంచుతూ.. పఠనాసక్తిని పెంచుతూ..!
రామన్నపేట(నకిరేకల్): జ్ఞానాన్ని పంచడం, శక్తిమేర దానిని పెంచడం ఆయన సంకల్పం. 35 ఏళ్లుగా అదే ఆయన వ్యాపకం. దాని కోసం తన సంపదను ధారాదత్తం చేశారు. జ్ఞానాన్ని నిలబెట్టడానికి తన ఇంటిని సైతం పడగొట్టారు. అక్కడ గ్రంథాలయాన్ని నిర్మించారు. పల్లె పట్టున పెద్దపెట్టున గ్రంథపరిమళం వెదజల్లుతున్నారు. ఆయనే యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు, దాశరథి పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య. పల్లెనే నమ్ముకొని సాహిత్య పరిమళాలను వెదజల్లుతున్నారు. ఆయన 35 ఏళ్లు ఉపాధ్యాయుడిగా, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశారు. తాను పనిచేసిన చోటల్లా విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచడానికి కృషిచేశారు. పాఠశాలల్లో గ్రంథాలయం కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేయించారు. ఉద్యోగ విరమణ అనంతరం స్వగ్రామంలోని తన ఇంటిని గ్రంథాలయంగా మార్చి ‘కూరెళ్ల గ్రంథాలయం’గా నామకరణం చేశారు. తనకున్న ఆరు ఎకరాల వ్యవసాయ భూమిని బలహీనవర్గాల ఇళ్లస్థలాలుగా పంపిణీ చేయడానికి ప్రభుత్వానికి అందజేశారు. ఆ కాలనీకి తన తల్లి స్మారకార్థం లక్ష్మీనగర్‌గా నామకరణం చేశారు. విఠలాచార్య 2014 ఫిభ్రవరి 13న వెల్లంకి గ్రామంలోని తన ఇంట్లో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరిజిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలోని కూరెళ్ల గ్రంథాలయం గ్రంథాలయ నిర్వహణ కోసం ఆచార్య కూరెళ్ల ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. తన పెన్షన్ డబ్బులను కూడా గ్రంథాలయ నిర్వహణకే ఖర్చు చేస్తున్నారు. ఇక్కడ ఏళ్లనాటి వార్తాపత్రికలతోపాటు పద్య, గద్య గ్రంథాలు, ప్రత్యేక సంచికలు, వ్యక్తిత్వ వికాసం, ప్రాచీన గ్రంథాలు, బాలసాహిత్యం, విద్య, వైద్యం చరిత్ర, రామాయణం, మహాభారతంతోపాటు పోటీపరీక్షలకు ఉపయోగపడే గ్రంథాలున్నాయి. అధునాతన వసతులతో నూతన భవనం ప్రస్తుతం గ్రంథాలయంలోని పుస్తకాల సంఖ్య రెండు లక్షలకు చేరింది. విఠలాచార్య తన కుటుంబ సభ్యులు, దాతల సహకారం మేరకు సుమారు రూ.50 లక్షల వ్యయంతో అధునాతన గ్రంథాలయ భవనం నిర్మించారు. విశాలమైన హాలు, పుస్తకాలు అమర్చడానికి సెల్ఫ్‌లు, రీడింగ్హాల్, వెయింటింగ్ రూం, డిజిటల్ గదిని ఏర్పాటు చేశారు. పరిశోధక విద్యార్థులు, ఇతర సందర్శకులు బస చేయడానికి వీలుగా ప్రత్యేకగది కూడా నిర్మించారు. ముప్పైకి పైగా రచనలు డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యను అభినవ పోతన, మధురకవిగా సాహితీప్రియులు పిలుస్తారు. ఆయన ఇప్పటివరకు ముప్ఫైకిపైగా పుస్తకాలు రాశారు. వాటిలో విఠలేశ్వర శతకం, కాన్ఫిన్షియల్ రిపోర్ట్, గొలుసుకట్టు నవలలు గుర్తింపు తెచ్చాయి. మరికొన్ని గ్రంథాలు అముద్రితాలుగా మిగిలాయి. కూరెళ్ల సాహిత్యప్రతిభకు గుర్తింపుగా అనేక పురస్కారాలు, జీవనసాఫల్య విశిష్ట పురస్కారాలు అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాశరథి పురస్కారం 2019లో ఆయనను వరించింది. ప్రజల్లో పఠనాసక్తి పెంపొందాలి ప్రజల్లో పఠనాసక్తిని పెంచడం ద్వారా వారిలో విజ్ఞానం పెంచాలన్నది నా సంకల్పం. నేను ఉపాధ్యాయుడిగా పనిచేసిన చోటల్లా పగలు పిల్లలకు, సాయంకాలం తల్లిదండ్రులకు చదువు నేర్పాను. పల్లెల్లోని కవులు, కళాకారులు, వాగ్గేయకారులను ప్రోత్సహించాను. నాకు ఆస్తుల మీద మమకారం లేదు. వ్యవసాయ భూమిని పేదల ఇళ్ల స్థలాల కోసం ఇచ్చాను. ఇంటిని గ్రంథాలయానికి అంకితం చేశాను. నా పెన్షన్ డబ్బులను గ్రంథాలయ నిర్వహణకు ఉపయోగిస్తున్నా. విద్యార్థులు, పరిశోధకులు, ఆధ్యాత్మికులకు అందరికీ ఉపయోగపడేలా కూరెళ్ల గ్రంథాలయాన్ని తీర్చిదిద్దాలన్నది నా జీవితాశయం. ఈ ఆశయసాధనలో నా కుమార్తెలతోపాటు ఎంతోమంది నాకు సహకరిస్తున్నారు. – డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గ్రామానికి గర్వకారణం కూరెళ్ల విఠలాచార్య మా గ్రామానికి మార్గదర్శకులు. గ్రామంలో చేపట్టే ప్రతీపనికి ఆయన ఆశీస్సులు తీసుకుంటాం. నిస్వార్థంగా గ్రామానికి చేస్తున్న సేవలు చిరస్మరణీయం. దాశరథి పురస్కారం పొందడం మా గ్రామానికి గర్వకారణం. ఆయన ఇంటిని గ్రంథాలయంగా మార్చడం గొప్ప విషయం. చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయంగా నిలుస్తుంది. భవిష్యత్తులో గ్రంథాలయ నిర్వహణకు మా వంతు సహకారం అందిస్తాం. – ఎడ్ల మహేందర్‌రెడ్డి, సర్పంచ్, వెల్లంకి -
తల్లి–తనయుడు–ఇద్దరు మనవళ్లు.. ఓ సినిమా
విఠలాచార్య.. తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఇప్పుడున్న టెక్నాలజీ లేని ఆ రోజుల్లోనే జానపద చిత్రాలు తీసి, ప్రేక్షకుల చేత ఔరా అనిపించారాయన. అటువంటి గొప్ప దర్శకుడి పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. ‘నందిని నర్సింగ్ హోమ్’ ఫేమ్ నవీన్ విజయ కృష్ణ, అనీషా ఆంబ్రోస్ జంటగా, నరేశ్, ఇంద్రజ కీలక పాత్రల్లో సుహాస్ మీరా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విఠలాచార్య’ గురువారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటి–దర్శకురాలు విజయనిర్మల కెమెరా స్విచ్చాన్ చేయగా సూపర్‌స్టార్ కృష్ణ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. సినిమా బ్రోచర్స్‌ను మరో దర్శకుడు కోదండ రామిరెడ్డి విడుదల చేసి, కృష్ణకు అందించారు. కృష్ణ మాట్లాడుతూ– ‘‘విఠలాచార్యతో ‘ఇద్దరు మొనగాళ్లు’ సినిమాకు పనిచేశా. ఆయన ఎన్నో హిట్ చిత్రాలు తీశారు. నరేశ్, నవీన్ కలిసి చేస్తున్న ఈ సినిమా కోసం నేనూ వెయిట్ చేస్తున్నా’’ అన్నారు.‘‘మా తరతరాలు నటీనటులుగా కొనసాగుతారు. మా పెద్ద మనవడితో పాటు చిన్న మనవడు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నాడు’’ అన్నారు విజయనిర్మల. ‘‘పరుచూరి వెంకటేశ్వరరావుగారి దగ్గర రచనలోనూ, దర్శకుడు గుణశేఖర్‌గారి వద్ద టెక్నికల్ విభాగాల్లోనూ పనిచేశా. డైరెక్టర్‌గా చాన్స్ ఇచ్చిన నిర్మాతలకు Sథ్యాంక్స్’’ అన్నారు సుహాస్ మీరా. నరేశ్ మాట్లాడుతూ– ‘‘మాస్, ఫ్యామిలీ, యూత్ కాన్సెప్ట్ చిత్రమిది. ఇందులో నా ఇద్దరు కుమారులతో పాటు మా అమ్మగారు (విజయ నిర్మల) నటిస్తున్నారు’’ అన్నారు. రచయితలు పరుచూరి బ్రదర్స్, నిర్మాత మల్కాపురం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: సత్య కశ్యప్, నిర్మాతలు: ఎస్.కె.విశ్వేశ్‌బాబు, కె.ఎస్.టి.యువరాజ్, యం.వి.కె.రెడ్డి.