వయోధిక పాత్రికేయ ప్యాకెట్ డైరీని ఆవిష్కరిస్తున్న అల్లం నారాయణ తదితరులు
పంజగుట్ట: వయోధిక పాత్రికేయుల అత్యవసర నిధి ఏర్పాటుకు తన వంతుగా రూ. లక్ష ప్రకటిస్తున్నట్లు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వయోధిక పాత్రికేయ సంఘం ఆధ్వర్యంలో వయోధిక పాత్రికేయ ప్యాకెట్ డైరీ ఆవిష్కరణ, ఇటీవల మృతి చెందిన సీనియర్ పాత్రికేయులు వి.పాండురంగారావు సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్బంగా సీనియర్ పాత్రికేయులు మధు వాకాటి వయోధిక పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అల్లం నారాయణ మాట్లాడుతూ పాత్రికేయులు వయస్సు పెరుగుతున్నా రచనలు మానకూడదన్నారు. ఏ.బీ.కే లాంటి వారు ఇంకా రాస్తున్నారని ఇప్పటికీ వారి అక్షరాల్లో పదును తగ్గలేదని, ఆయన భావాలు మారలేదన్నారు. పాత్రికేయరంగంలో ఉన్న వారిలో కొందరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అత్యవసర పరిస్థితుల్లో వారిని ఆదుకునేందుకు వయోధిక అత్యవసర నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఆ నిధికి మొదటగా తానే రూ. లక్ష ఇస్తున్నట్లు తెలిపారు.
అక్రిడిటేషన్ సమస్య కూడా తమ దృష్టికి తెచ్చారని 60 సంవత్సరాలు దాటిన పాత్రికేయునికి ఎలాంటి పత్రాలు లేకున్నా, గతంలో పనిచేసిన ఆనవాళ్లు ఉంటే తప్పకుండా అక్రిడిటేషన్ కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికీ ఎవరికైనా లేకపోతే తనను సంప్రదిస్తే వెంటనే వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టు హెల్త్ స్కీం ఎంతో అద్భుతమైనదని గతంలో అపోలో, యశోదా ఆసుపత్రుల్లోనూ కొనసాగేదని, కాని ప్రస్తుతం కేవలం నిమ్స్‌లో మాత్రమే నడుస్తుందన్నారు.
వయోధిక పాత్రికేయులకు ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే, అత్యవసర పరిస్థితుల్లో కార్పోరేట్ ఆసుపత్రికి వెళితే తాను మాట్లాడి హెల్త్‌కార్డుల ద్వారా చికిత్స అందేలా చూస్తానన్నారు. నిమ్స్‌లోనూ వయోధిక పాత్రికేయులకు వెంటనే చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని నిమ్స్ డైరెక్టర్‌కు చెబుతానన్నారు. మీడియా అకాడమీలో యూనియన్ కార్యాలయాలకు గదులు ఇవ్వరని కానీ వయోధిక పాత్రికేయుల కార్యాలయం ఏర్పాటుకు గదిని కేటాయిస్తానని హామీ ఇచ్చారు.
వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షులు దాసు కేషవరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వయోధిక పాత్రికేయ ప్యాకెట్ డైరీ రూపకర్త ఎన్.శ్రీనివాస్ రెడ్డి, సంఘం ఉపాధ్యక్షులు టి.ఉడయవరులు, సెక్రటరీ లక్ష్మణ్‌రావు, జాయింట్ సెక్రటరీ రాజేశ్వరరావు, రామమూర్తి, సభ్యులు ఎ.జీ.ప్రసాద్, జి.భగీరధ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment