భూసమస్యల పరిష్కారానికి శిక్షణ
Published Wed, Sep 4 2013 3:28 AM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM
పీవో వీరపాండియన్ :భద్రాచలం, న్యూస్‌లైన్: వివిధ రకాలైన భూ సమస్యల పరిష్కారం కోసం ఇందిరా క్రాంతి పధం ఏర్పాటు చేసిన ‘మన భూమి, మన హక్కు’ అనే శిక్షణ గిరిజన రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఐటీడీఏ పీఓ వీరపాండియన్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ గిరిజన చిన్న, సన్నకారు రైతులకు భూ హక్కులు కల్పించినప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని అధిగమించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని అన్నారు. భూమిసబ్ కమిటీ సభ్యులుగా మండల సమాఖ్య ఉన్నందున వారికి అవగాహన కల్పిస్తున్నామని, తద్వారా వారు గిరిజనులను చైతన్యపరుస్తారని పేర్కొన్నారు. పలు సంవత్సరాలుగా చిన్న సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోక ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు న్యాయం చేసేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వారికి సరైన న్యాయం జరగాలంటే సరైన శిక్షణ అవసరమని, అందుకే ఐకేపీ ద్వారా ఈ శిక్షణ ఇస్తున్నామని అన్నారు.
భూమి అనేది నిరుపేదలకు ఒక హోదాను కల్పిస్తుందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎల్‌టీఆర్, రిజర్వ్ ఫారెస్టు భూములపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పహాణీలు తమ పేరు మీద ఉన్నా పాస్‌పుస్తకం, టైటిల్ డీడ్ లేని వారు చాలా మంది ఉన్నారని, అటువంటి సమస్యలను పరిష్కరించటానికి కృషి చేయాలని మహిళా సమాఖ్యలకు సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్‌గుప్తా, అధికారులు ఎంవీ రామారావు, జయశ్రీ పాల్గొన్నారు.
‘క్వెస్ట్’ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అందిస్తున్న క్వెస్ట్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలని ఐటీడీఏ పీఓ వీరపాండియన్ సూచించారు. ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులకు స్థానిక బీఈడీ కళాశాలలో జరుగుతున్న క్వెస్ట్ రెండో రోజు శిక్షణ కార్యక్రమానికి పీఓ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. విద్యార్ధులకు గుణాత్మకమైన విద్యను అందించటం కోసమే క్వెస్ట్ అని తెలిపారు.
కార్పోరేట్ విద్యసంస్థలకు పోటీగా విద్యార్థులను తీర్చిదిద్దే విధంగా ఉపాధ్యాయులకు ఈ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులకు తరచూ ఇటువంటి కార్యక్రమాలు రూపొందించడం వల్ల వారిలో బోధనా సామర్ధ్యం మెరుగవుతుందని అన్నారు. దీని వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుందని అన్నారు. నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు అందించే సూచనలు, సలహాలను స్వీకరిస్తారని అన్నారు. శిక్షణ అనంతరం ఉపాధ్యాయులు మెరుగైన తీరుతో భోధనను సాగించాలని పీవో అన్నారు. అనంతరం పీవో ఉపాధ్యాయులతో కలిసి సహపంక్తి భో జనం చేశారు. కార్యక్రమంలో ఏజెన్సీ డీఈవో ఎన్ రాజేష్, ఏటీఓ ఏవీ రామారావు, ప్రిన్సిపాల్ వి రామ్మోహన్, రిసోర్స్‌పర్సన్స్ నాగమణి, వీరభద్రం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement