Indira Kranti
-
ధాన్యం కొనుగోలుకు 93 కేంద్రాలు
=ఐకేపీ మహిళా గ్రూపుల ఆధ్వర్యంలో 42 =పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 51 =జేసీ ఉషాకుమారి వెల్లడి కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : జిల్లాలో 93 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి జాయింట్ కలెక్టర్ పి.ఉషాకుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2013-14 ఖరీఫ్ సీజన్లో రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి మద్దతు ధర లభించేలా, దళారుల బారినపడకుండా ప్రభుత్వం తీసుకునే చర్యల్లో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. ఇందిరా క్రాంతిపథం మహిళా గ్రూపుల నిర్వహణలో 42 కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల నిర్వహణలో 51 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఒక్కొక్క కొనుగోలు కేంద్రానికి వాటి పరిధిలో ఉన్న రైస్‌మిల్లులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద నుంచి సేకరించిన ధాన్యానికి కేటాయించిన బిల్లులకు రవాణా అనుమతులు ఇచ్చినట్లు వివరించారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సిబ్బందిని నియమించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. కేంద్రాల పర్యవేక్షకులుగా పౌరసరఫరాల డీటీలను నియమించినట్లు చెప్పారు. -
భూసమస్యల పరిష్కారానికి శిక్షణ
పీవో వీరపాండియన్ :భద్రాచలం, న్యూస్‌లైన్: వివిధ రకాలైన భూ సమస్యల పరిష్కారం కోసం ఇందిరా క్రాంతి పధం ఏర్పాటు చేసిన ‘మన భూమి, మన హక్కు’ అనే శిక్షణ గిరిజన రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఐటీడీఏ పీఓ వీరపాండియన్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ గిరిజన చిన్న, సన్నకారు రైతులకు భూ హక్కులు కల్పించినప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని అధిగమించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని అన్నారు. భూమిసబ్ కమిటీ సభ్యులుగా మండల సమాఖ్య ఉన్నందున వారికి అవగాహన కల్పిస్తున్నామని, తద్వారా వారు గిరిజనులను చైతన్యపరుస్తారని పేర్కొన్నారు. పలు సంవత్సరాలుగా చిన్న సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోక ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు న్యాయం చేసేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వారికి సరైన న్యాయం జరగాలంటే సరైన శిక్షణ అవసరమని, అందుకే ఐకేపీ ద్వారా ఈ శిక్షణ ఇస్తున్నామని అన్నారు. భూమి అనేది నిరుపేదలకు ఒక హోదాను కల్పిస్తుందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎల్టీఆర్, రిజర్వ్ ఫారెస్టు భూములపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పహాణీలు తమ పేరు మీద ఉన్నా పాస్‌పుస్తకం, టైటిల్ డీడ్ లేని వారు చాలా మంది ఉన్నారని, అటువంటి సమస్యలను పరిష్కరించటానికి కృషి చేయాలని మహిళా సమాఖ్యలకు సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్‌గుప్తా, అధికారులు ఎంవీ రామారావు, జయశ్రీ పాల్గొన్నారు. ‘క్వెస్ట్’ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అందిస్తున్న క్వెస్ట్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలని ఐటీడీఏ పీఓ వీరపాండియన్ సూచించారు. ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులకు స్థానిక బీఈడీ కళాశాలలో జరుగుతున్న క్వెస్ట్ రెండో రోజు శిక్షణ కార్యక్రమానికి పీఓ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. విద్యార్ధులకు గుణాత్మకమైన విద్యను అందించటం కోసమే క్వెస్ట్ అని తెలిపారు. కార్పోరేట్ విద్యసంస్థలకు పోటీగా విద్యార్థులను తీర్చిదిద్దే విధంగా ఉపాధ్యాయులకు ఈ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులకు తరచూ ఇటువంటి కార్యక్రమాలు రూపొందించడం వల్ల వారిలో బోధనా సామర్ధ్యం మెరుగవుతుందని అన్నారు. దీని వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుందని అన్నారు. నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు అందించే సూచనలు, సలహాలను స్వీకరిస్తారని అన్నారు. శిక్షణ అనంతరం ఉపాధ్యాయులు మెరుగైన తీరుతో భోధనను సాగించాలని పీవో అన్నారు. అనంతరం పీవో ఉపాధ్యాయులతో కలిసి సహపంక్తి భో జనం చేశారు. కార్యక్రమంలో ఏజెన్సీ డీఈవో ఎన్ రాజేష్, ఏటీఓ ఏవీ రామారావు, ప్రిన్సిపాల్ వి రామ్మోహన్, రిసోర్స్‌పర్సన్స్ నాగమణి, వీరభద్రం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
స్కాలర్షిప్ పంచాయితీ
ఉట్నూర్, న్యూస్‌లైన్ : ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) ద్వారా స్వయం సహాయక సంఘాల్లోని మహిళల పిల్లలకు మంజూరైన స్కాలర్షిప్ జాబితాలో కొందరి పేర్లే ఉండడం వివాదానికి దారితీసింది. ఈ విషయమై స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఉప సర్పంచ్ కొండెరి రాజేశ్వర్ శాంతినగర్ వీవో అధ్యక్షురాలు రాణి, ఐకేపీ ఏపీఎంలను నిలదీయడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్, ఐటీఐ విద్యార్థులకు రూ.1200 నుంచి రూ.600 వరకు ఉపకార వేతనాలు మంజూరవుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఉట్నూర్ పంచాయతీ పరిధిలో 296 మంది విద్యార్థులకు రూ.3,52,800 మంజూరయ్యాయి. వీటిని పంచాయతీ పరిధిలోని ఉన్న పది వీవోల్లో వీవోల వారీగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయకుండా.. వీవోల తీర్మానంతో తాజ్‌మహల్ వీవోకు చెందిన ఏపీఆర్‌ఐజీపీ ఖాతాలో ఈ నెల 12న జమ చేశామని అధికారులు చెబుతున్నారు. ఖాతాల నుంచి ఉపకార వేతనాలు తీసి ఇవ్వాల్సి ఉండగా.. ఆ మొత్తాన్ని తిరిగి అధికారులు శాంతినగర్ వీవో పరిధిలో అత్యధికంగా 197 మంది లబ్ధిదారులు ఉన్నారంటూ ఈ నెల 13న శాంతినగర్ వీవో ఖాతాలోకి మళ్లించారు. 296 మంది జాబితా పంచాయతీ గోడలపై అతికించాల్సి ఉండగా 148 పేర్లతో జాబితా అతికించారు. ఈ విషయమై ఉప సర్పంచ్ కొండెరి రాజేశ్వర్ ఐకేపీ ఏపీఎం గంగాధర్, శాంతినగర్ వీవో అధ్యక్షురాలు రాణిని నిలదీశారు. మిగతా వారి జాబితా అతికించడం మర్చిపోయామని సమాధానం చెప్పడంతో ఆయన మండిపడ్డారు. మిగతా 148 మంది ఉపకార వేతనాలు కాజేయ్యాలని చూశారని ఆరోపించారు. కాగా, ఈ విషయమై ఐకేపీ మండల ఏపీఎం గంగాధర్ స్పందిస్తూ వీవోల తీర్మానంతో తాజ్‌మహల్ వీవో ఖాతాలో జమ చేశామని, ఆ తర్వాత అత్యధికంగా ఉన్న శాంతినగర్ వీవో ఖాతాలోకి మళ్లించామని పేర్కొన్నారు. కొందరి పేర్లతో జాబితా అతికించడంపై తనకు సంబంధం లేదని తెలిపారు.