స్కాలర్‌షిప్ పంచాయితీ
Published Thu, Aug 29 2013 3:36 AM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM
ఉట్నూర్, న్యూస్‌లైన్ : ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) ద్వారా స్వయం సహాయక సంఘాల్లోని మహిళల పిల్లలకు మంజూరైన స్కాలర్‌షిప్ జాబితాలో కొందరి పేర్లే ఉండడం వివాదానికి దారితీసింది. ఈ విషయమై స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఉప సర్పంచ్ కొండెరి రాజేశ్వర్ శాంతినగర్ వీవో అధ్యక్షురాలు రాణి, ఐకేపీ ఏపీఎంలను నిలదీయడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్, ఐటీఐ విద్యార్థులకు రూ.1200 నుంచి రూ.600 వరకు ఉపకార వేతనాలు మంజూరవుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఉట్నూర్ పంచాయతీ పరిధిలో 296 మంది విద్యార్థులకు రూ.3,52,800 మంజూరయ్యాయి.
వీటిని పంచాయతీ పరిధిలోని ఉన్న పది వీవోల్లో వీవోల వారీగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయకుండా.. వీవోల తీర్మానంతో తాజ్‌మహల్ వీవోకు చెందిన ఏపీఆర్‌ఐజీపీ ఖాతాలో ఈ నెల 12న జమ చేశామని అధికారులు చెబుతున్నారు. ఖాతాల నుంచి ఉపకార వేతనాలు తీసి ఇవ్వాల్సి ఉండగా.. ఆ మొత్తాన్ని తిరిగి అధికారులు శాంతినగర్ వీవో పరిధిలో అత్యధికంగా 197 మంది లబ్ధిదారులు ఉన్నారంటూ ఈ నెల 13న శాంతినగర్ వీవో ఖాతాలోకి మళ్లించారు. 296 మంది జాబితా పంచాయతీ గోడలపై అతికించాల్సి ఉండగా 148 పేర్లతో జాబితా అతికించారు.
ఈ విషయమై ఉప సర్పంచ్ కొండెరి రాజేశ్వర్ ఐకేపీ ఏపీఎం గంగాధర్, శాంతినగర్ వీవో అధ్యక్షురాలు రాణిని నిలదీశారు. మిగతా వారి జాబితా అతికించడం మర్చిపోయామని సమాధానం చెప్పడంతో ఆయన మండిపడ్డారు. మిగతా 148 మంది ఉపకార వేతనాలు కాజేయ్యాలని చూశారని ఆరోపించారు. కాగా, ఈ విషయమై ఐకేపీ మండల ఏపీఎం గంగాధర్ స్పందిస్తూ వీవోల తీర్మానంతో తాజ్‌మహల్ వీవో ఖాతాలో జమ చేశామని, ఆ తర్వాత అత్యధికంగా ఉన్న శాంతినగర్ వీవో ఖాతాలోకి మళ్లించామని పేర్కొన్నారు. కొందరి పేర్లతో జాబితా అతికించడంపై తనకు సంబంధం లేదని తెలిపారు.
Advertisement