సాక్షి, అమరావతి : పాలనా రాజధానిగా సర్వ హంగులూ సమకూర్చుకుంటున్న విశాఖ ముఖచిత్రం మారుతోంది. ఐటీ రంగంలో ఇప్పటివరకూ బిజినెస్ ప్రాసెసింగ్ ఔట్‌సోర్సింగ్(బీపీవో) కార్యకలాపాలకు ప్రధాన వేదికగా నిలిచిన ఈ నగరం.. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సెంటర్స్(డీసీ)ను ఆకర్షిస్తోంది. ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ రాష్ట్రంలో తొలి డెవలప్‌మెంట్ సెంటర్‌ను విశాఖలో ఏర్పాటుచేయడంతో.. అదే బాటలో మరికొన్ని సంస్థలు ఆసక్తిచూపుతున్నాయి.
ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేశాక ఎప్పటి నుంచో విశాఖ కేంద్రంగా బీపీవో సర్వీసులు నడిపిస్తున్న విప్రో కూడా డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. లావండర్ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ డెవలప్‌మెంట్ సెంటర్‌లో విశాఖ కేంద్రంగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న ఉద్యోగుల నుంచి వివరాలు సేకరిస్తోంది. ఇంతకాలం విశాఖ అనగానే పల్సస్ గ్రూపు, డబ్ల్యూఎన్‌ఎస్, టెక్ మహీంద్రా, విప్రో వంటి బీపీవో కార్యకలాపాలే కనిపించేవి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బీచ్ ఐటీ డెస్టినీ పేరుతో విశాఖకు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఆకర్షించేందుకు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి.
అదానీ డేటా సెంటర్‌తో పాటు మరికొన్ని..
ఇప్పటివరకు బీపీవోల కేంద్రంగా ముద్ర ఉన్న విశాఖకు ఇన్ఫోసిస్ రాకతో ఆ ముద్ర చెరిగి.. డెవలప్‌మెంట్ సెంటర్ల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోందని ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ(అపిటా) గ్రూప్ సీఈవో ఎస్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే అమెజాన్, భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ సంస్థలు డెవలప్‌మెంట్ సెంటర్లను నెలకొల్పగా, తాజాగా ఇన్ఫోసిస్ 1,000 సీటింగ్ సామర్థ్యంతో క్యాంపస్‌ను ఏర్పాటుచేసింది. రానున్న కాలంలో దీన్ని మరింత విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా విప్రో కూడా అదే బాటలో అడుగులు వేస్తోంది.
అలాగే, అదానీ డేటా సెంటర్ కూడా ఏర్పాటుకానుండటం.. సింగపూర్ నుంచి సముద్రమార్గం ద్వారా ఫైబర్‌నెట్ కనెక్షన్ ఏర్పాటవుతుండటం.. పారిశ్రామిక రంగంలో నాలుగో తరం ఆవిష్కరణలను ప్రోత్సహించేలా దేశంలోనే తొలి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ.. కల్పతరువు పేరిట విశాఖలో ఏర్పాటుచేయడం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రొబోటెక్స్, డేటా ఎనలిటిక్స్ వంటి వాటిపై పరిశోధనలను ప్రోత్సహించేలా ఆంధ్రా వర్సిటీలో మరో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ ఏర్పాటుకావడంతో పలు ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను విశాఖలో ప్రారంభించేందుకు ఆసక్తిచూపుతున్నాయి.
అతి తక్కువ వ్యయంతో పుష్కలమైన మానవ వనరులున్న నగరాల్లో విశాఖ ముందంజలో ఉందని తాజాగా నాస్కామ్–డెలాయిట్ విడుదల చేసిన నివేదికలో పేర్కొనడం కూడా విశాఖకు కలిసివస్తోంది. నైపుణ్యం కలిగిన మానవ వనరులు పుష్కలంగా ఉండటంతో విశాఖలో డెవలప్‌మెంట్ సెంటర్ల ఏర్పాటుకు పలు సంస్థలు చర్చలు జరుపుతున్నాయని, వీటిలో చాలా సంస్థలు స్టాక్‌ఎక్సే్ఛంజ్‌లలో నమోదు కావడం వల్ల వాటి వివరాలను అప్పుడే చెప్పలేమని ఎస్‌టీపీఐ విశాఖ అడిషనల్ డైరెక్టర్ సురేష్ చెప్పారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం, త్వరలో మెట్రో రైలు పనులు ప్రారంభం కానుండటం, రహేజా గ్రూపు ఇన్‌ఆర్బిట్ మాల్‌ను ఏర్పాటుచేస్తుండటంతో విశాఖ త్వరలోనే పూర్తిస్థాయి కాస్మోపాలిటన్ నగరంగా మారనుంది. దీంతో ఐటీ నిపుణులు పనిచేసేందుకు విశాఖను ఎంచుకునే అవకాశాలు పెరుగుతాయని పల్సస్ గ్రూపు సీఈవో గేదెల శ్రీనుబాబు వివరించారు.
బీచ్ ఐటీ డెస్టినీగా విశాఖ..
విశాఖను బీచ్ ఐటీ డెస్టినీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో.. ఇన్ఫోసిస్ వంటి ఐటీ దిగ్గజ సంస్థ విశాఖ రావడం వలన మరిన్ని ఐటీ పరిశ్రమలు ఇక్కడకు వచ్చే అవకాశముందని పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. యాక్సెంచర్, సీడాక్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు రాష్ట్రంలో కార్యాలయాల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయని ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పలు ఐటీ సంస్థలు రాష్ట్రంలో శాఖల ఏర్పాటుకు ముందుకొచ్చాయని, ఈ పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తేవడంతో పాటు, ప్రస్తుత ఐటీ కంపెనీల అవసరాలు తీర్చడంపై దృష్టిసారించినట్టు శశిధర్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment