నేడు విజయవాడలో 206 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ
విగ్రహాలు జాతి జీవన వికాస చారిత్రక ప్రతిబింబాలు. సమాజాన్ని చైతన్యపరచే విగ్రహాలు మౌన సందేశాలకు ప్రతిరూపాలు. భారతదేశం మినహా ప్రపంచదేశాల్లో ఇప్పటికి లక్షకు పైగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలు ఉన్నాయని అధికారిక అంచనా. ప్రపంచ దేశాలు అంబేడ్కర్ జ్ఞాన సంపదకూ, సమసమాజ నిర్మాణ రచనా చాతుర్యానికీ, సమయస్ఫూర్తి గల వాగ్ధాటికీ ముగ్ధులై నిత్య నీరాజనాలు పలుకుతున్నాయంటే అది భారతదేశానికి గర్వకారణం. అంబేడ్కర్ సమాజం కోసం జీవించాడు. సమాజ పురోగతి కోసం నిరంతర పోరాటం జరిపిన అసమాన ప్రతిభావంతుడు. తాను నేర్చిన విద్య, విజ్ఞాన సంపద అంతా సమాజం కోసమే వినియోగించాడు. దీన్నే ‘పేబాక్ టు ది సొసైటీ’ అంటారు. అందుకే ఆయన విధానాలను పలు దేశాలు అనుసరిస్తున్నాయి. ‘నా జీవన పోరాటమే నా సందేశం’ (మేరా జీవన్ సంఘర్ష్ హీ మేరా సందేశ్) అని చెప్పిన మాటలే విశ్వ సందేశంగా వినువీధుల్లో వినిపిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అంబేడ్కర్ విగ్రహాలు నెలకొల్పి తమకున్న గౌరవాన్ని చాటుకున్నాయి. అమెరికాలో మిచిగన్ విశ్వవిద్యాలయం (1993)లో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 2023 అక్టోబరు 14న మేరీలాండ్‌లో ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ అనే పేర 19 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని నిలిపారు. 1996లో టొరంటో విశ్వవిద్యాలయం (కెనడా) కూడా అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొంది. ఇక బ్రిటన్‌లో చాలానే ఉన్నాయి. లండన్, బర్మింగ్ హామ్, మాంచిస్టర్‌లలో పలు విగ్రహాలను నెలకొల్పారు. అలాగే అంబేడ్కర్ చదివిన ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్’ ముఖద్వారంలో 2000లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. జర్మనీలోని బెర్లిన్, మ్యూనిక్, ఫ్రాంక్ ఫర్ట్‌లలో; జపాన్‌లోని టోక్యో, ఒకాసా, కొయెటోలల్లో; దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్ బర్గ్, కేప్‌టౌన్, డర్బన్‌లలో; ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్, బ్రిస్బెయిన్ వంటి నగరాల్లో; న్యూజిలాండ్‌లోని ఆక్లండ్ తదితర ప్రాంతాల్లో, మారిషస్ (2018), శ్రీలంక (కొలంబో). నేపాల్ (ఖాట్మండు 2019), బంగ్లాదేశ్ (ఢాకా 2021), దుబాయ్‌తో సహా మరెన్నో దేశాల్లో అంబేడ్కర్ విగ్రహాలు నెల కొన్నాయి.
తెలంగాణలో గతేడాది ఏప్రిల్ 14న అంబేడ్కర్ ముని మనుమడు ప్రకాష్ అంబేడ్కర్‌చే 125 అడుగుల ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించబడింది. లక్నోలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పార్క్‌కు ‘డాక్టర్ భీమ్‌రావ్ సామాజిక్ పరిపర్తన్ స్థల్’గా నామకరణం చేసి అక్కడ ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ప్రదేశంలోనే జ్యోతిరావ్ ఫూలే, నారాయణగురు, బిశ్రా ముండా, శాయాజి మహరాజ్, కాన్షీ రామ్ విగ్రహాలున్నాయి. ఇక్కడే 124 ఏనుగుల విగ్రహాలు కొలువుదీరి సందర్శకులకు ఆహ్లాదం కలుగచేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో లెక్కకు మించిన అంబేడ్కర్ విగ్రహాలున్నాయి. వీటికి తోడు విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూ. 400 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించిన 206 అడుగుల విగ్రహాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరిస్తున్నారు. ఈ విగ్రహపీఠం 81 అడుగుల ఎత్తు ఉంది. దానిపై ప్రతిష్ఠించిన 125 అడుగుల ప్రధాన విగ్రహంతో మొత్తం 206 అడుగుల అంబేడ్కర్ శిల్పం విజయవాడ నలుదిక్కులకూ కనిపిస్తూ, చూడగానే ఆకర్షించేలా ఉంది. ఈ విగ్రహ ప్రదేశం ఒక స్మృతివనంగా భాసిస్తుంది.
మూడు అంతస్తులున్న విగ్రహం కింది భాగంలో నాలుగు ఏసీ హాల్స్ ఉన్నాయి. నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మినీ థియేటర్, మ్యూజియం, మరో రెండు హాల్స్‌లో అంబేడ్కర్‌కు దక్షిణ భారతదేశంతో ఉన్న అనుబంధంతో కూడిన ఛాయాచిత్రాలు, మరో మ్యూజియం ఉంది. వీటికి తోడు రెండు వేలమంది కూర్చోవడానికి సరిపడే మరో ఓపెన్ ఎయిర్ థియేటర్‌తో పాటు అందమైన పార్కు, మరో అందమైన ఫౌంటెన్ సందర్శకులకు కనువిందు చేయనున్నాయి. విగ్రహం రంగు మాసిపోకుండా పాల్యూరెథేన్ కోటింగ్ వేయటం మరో ప్రత్యేకత! 15 మంది ఎక్కడానికి సరిపడ రెండు లిఫ్టులను ఏర్పాటుచేశారు.
మూడు అంతస్తుల్లో నిర్మిత మైన ఈ ప్రదేశం ఒక పర్యాటక కేంద్రంగా వర్ధిల్లుతుందనటంలో ఎలాంటి అనుమానం లేదు. అంబేడ్కర్ విగ్రహ ప్రతి ష్ఠతో విజయవాడలో నూతన సాంస్కృతిక వికాసం మరింతగా వృద్ధిచెందుతుంది. దీనివల్ల సమాజ వికాసంతోపాటు దళిత అస్తిత్వానికీ, సర్వమత సామరస్యానికీ, సకల మానవ సౌభ్రాతృత్వానికీ మరింత దోహదం చేకూరుతుంది. ఈ విగ్రహ ప్రాంగణం నిత్యమూ విజ్ఞాన మేధామథనంతోపాటు సకల కళలు అభివృద్ధి చెందే సాంస్కృతిక కేంద్రంగా మారుతుంది. ఈ కేంద్రంలో ఏర్పరచే నూతన పుస్తక భాండాగారం పుస్తక ప్రియులకూ, పాఠకులకూ ఒక విజ్ఞాన వికాస కేంద్రంగా నిత్యం అందుబాటులో ఉంటుంది. అంబేడ్కర్ విగ్రహంతో పోరాటాల పురిటిగడ్డ విజయవాడ నగరానికి కొత్త అందాలు పురివిప్పుకుంటాయి. ఆయన జీవిత సందేశం అడుగడుగునా ప్రతిబింబించి ప్రగతిపథంలో పయనించే ప్రజలకు మార్గదర్శి కాగలదు.
ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, వ్యాసకర్త ప్రముఖ సాహితీవేత్త, 98481 23655
Comments
Please login to add a commentAdd a comment