జనతంత్రం
ఆకతాయిల పని కాదది. పథకం ప్రకారమే జరిగింది. ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతోనే జరిగింది. అదేదో చాటుమాటు ప్రాంతం కాదు. నిర్జన ప్రదేశం కాదు. విజయవాడ నడిగడ్డ. నగరంలోనే ఏక్ నంబర్ బిజినెస్ రాస్తా. బందర్ రోడ్. రాత్రి తొమ్మిది గంటల వేళ ఆ రోడ్డు మీద ప్రవహించే రణగొణ పీక్ స్థాయిలో ఉంటుంది. అటువంటి సమయంలో అంబేడ్కర్ స్మృతివనం లోకి కొందరు వ్యక్తులు ‘పనిముట్ల’తో ప్రవేశించి, సందర్శకు లను వెళ్లగొట్టి, లైట్లార్పేసి దాడికి తెగబడ్డారంటే... ఈ దాడికి స్వయానా పోలీసు యంత్రాంగమే కాపు కాసిందంటే... అధికార పీఠం అండదండలు లేవని ఎలా అనుకోగలం? అందుకే ఈ దాడి రాజ్య ప్రేరేపితం.
మీడియా ప్రతినిధులతోపాటు పలువురు పురజనులు హుటాహుటిన అక్కడికి చేరుకోకపోతే ఆ దాడి ఎంతదూరం వెళ్లేదో? టాప్ ప్రయారిటీ టాస్క్‌గా అక్కడున్న మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేరును తొలగించగలిగారు. ఇంకా ముందు కెళ్లడం జనం రాకతో కుదరలేదు. స్మృతి వనంలోకి దొంగల్లా ప్రవేశించి, లైట్లార్పేసి దాడికి తెగబడుతున్న వైనంపై సమా చారం అందించినా వెంటనే పోలీసులు స్పందించకపోవడం ఏమిటి? ప్రతిపక్ష నాయకుడి పేరునే కదా తొలగించింది... విగ్రహంపై దాడి జరగలేదు కదా అనే సన్నాయి నొక్కులు పాలక పార్టీ తైనాతీల నోటి వెంట వినబడుతున్నాయి.
ఈ లెక్కన ప్రతిపక్షాలకు చెందిన వారి ఇళ్లల్లో అక్రమంగా ప్రవేశించి దొంగతనం చేసినా ఫరవాలేదన్న మాట. పోలీసులు రక్షణ కూడా కల్పిస్తారేమో! నంద్యాల జిలాల్లో ఒక వైసీపీ కార్యకకర్తను పబ్లిగ్గా తెగనరుకుతుంటే ఆ హంతకులకు రక్షణగా పోలీసులు నిలబడిన వైపరీత్యాన్ని కూడా ఈ వారమే చూడవలసి వచ్చింది. ఏపీలో కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చిందా?
డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగ అంతస్సారం... సర్వమానవ సమతావాదం.
ఈ సిద్ధాంతానికీ ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పాలిస్తున్న ఎన్డీఏ కూటమి భావజాలానికీ అస్సలు పొసగదు. కూటమి పెద్దన్న భారతీయ జనతా పార్టీకి ఏ మాత్రం గిట్టదు. బీజేపీ తోలుబొమ్మను ఆడించే తెర వెనుక ఆరెస్సెస్‌కు అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మార్చే యాలన్నది చిరకాల వాంఛ. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించింది. నాలుగు రోజుల్లోనే (నవంబర్ 30) ఆరెస్సెస్ అధికార పత్రిక ‘ఆర్గనైజర్’ దాన్ని ఆడిపోసుకోవడం మొదలుపెట్టింది.
భారత రాజ్యాంగంలో భారతీయతే లేదని ‘ఆర్గనైజర్’ దుయ్యబట్టింది. ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలైన స్పార్టాకు లైకర్గస్‌లాగా, ఏథెన్స్‌కు సోలాన్ లాగా భారత్‌కు మనువు ఉండగా, ఆయన రూపొందించిన మనుస్మృతి ఉండగా ఈ రాజ్యాంగమెందుకని ‘ఆర్గనైజర్’ ప్రశ్నించింది. ఈ మనుధర్మ శాస్త్రం ఎటువంటిదో తెలిసిందే కదా! అసమానతలతో కూడిన కుల వ్యవస్థను సమర్థించిన శాస్త్రం.
దళితులనైతే వర్ణవ్యవస్థకు ఆవల బహిష్కృతులుగా, అస్పృశ్యులుగా పరిగణించిన న్యాయ సంహిత ఇది. స్త్రీలకు స్వాతంత్య్రం అవసరం లేదని కూడా మనుస్మృతి అభిప్రాయపడింది. ‘పితా రక్షతి కౌమారే, భర్తా రక్షతి యౌవనే, రక్షంతి స్థవిరే పుత్రా, న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి’ (బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కుమా రుని రక్షణలో ఉండాలి. స్త్రీలకు స్వతంత్రత అవసరం లేదు)... ఇదీ మనుస్మృతి!
ఇటువంటి మనుధర్మ సంహిత భారత రాజ్యాంగంగా ఉండాలని ఒక్క ‘ఆర్గనైజర్’ మాత్రమే కోరుకోలేదు. ఆరెస్సెస్ సిద్ధాంతవేత్తగా ప్రసిద్ధుడైన గురు గోల్వాల్కర్ (బంచ్ ఆఫ్ థాట్స్), ఆరెస్సెస్‌కు ప్రాతఃస్మరణీయుడైన వినాయక్‌రావు దామోదర్ సావర్కర్‌లు కూడా వివిధ సందర్భాల్లో అభిలషించారు.
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తొలి రోజుల్లోనే కాదు, ఆ తర్వాతి కాలంలో కూడా ఆరెస్సెస్ అభిప్రాయం మారలేదని ప్రముఖ కన్నడ రచయిత దేవనూర్ మహాదేవ ఆరెస్సెస్‌పై రాసిన ఒక చిన్న పుస్తకంలో నిరూపించారు. ఆ సంస్థ 1993 జనవరిలో విడుదల చేసిన శ్వేతపత్రంలో భారత రాజ్యాంగాన్ని ‘విదేశీ భావాలతో కూడిన హిందూ వ్యతిరేక సంహిత’గా అభిశంసించారని మహాదేవ రాశారు.
ఆరెస్సెస్ అనే సంస్థ ప్రస్తుతం మూడు అంతర్లీన లక్ష్యాల కోసం పనిచేస్తున్నదని మహాదేవ వివరించారు. భారతదేశ ఫెడ రల్ స్వభావానికి విరుద్ధంగా కేంద్రీకృత అధికార స్థాపన మొదటి లక్ష్యం. ఇక రెండవది – మనుధర్మ శాస్త్రం ప్రబోధించిన వర్ణాశ్రమ ధర్మం. అసమానతలతో కూడిన కుల వ్యవస్థను కాపాడటం – సమాజంపై ఆర్యుల ఆధిపత్యాన్ని రుద్దడం మూడవది.
ఆర్యులంటే ఎవరు? వర్ణాశ్రమంలో వారి స్థానాలేమిటి? తదితర అంశాలపై వివరణలు అవసరం కాకపోవచ్చు. ఇదిగో ఈ మూడు లక్ష్యాల సాధనలో భాగంగానే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పాఠ్య పుస్తకాల సిలబస్ సవరణ, మతాంతీకరణ వ్యతిరేక బిల్లును తేవడం తదితర చర్యలు చేపట్టిందని మహాదేవ అభియోగం.
స్థూలంగా మనుషులంతా సమానం కాదని మనుధర్మ శాస్త్రం అభిప్రాయపడుతుంది. మనుషుల్లో కొందరు ఉత్తమ జాతులవారు, కొందరు నీచ జాతులవారు. ఈ నీచ జాతుల వారు ఉత్తమ జాతులను సేవిస్తూ జీవించాలి. అన్ని జాతుల్లోనూ పురుషుల స్థాయి ఎక్కువ. స్త్రీల స్థాయి తక్కువ. పురుషుల అడుగుజాడల్లో వారి పాదధూళిని తలదాల్చుతూ స్త్రీలు మనుగడ సాగించాలి.
ఇటువంటి మనువాద తుప్పు భావాలను చీల్చి చెండాడుతూ మనుషులంతా ఒక్కటేనని చాటిచెప్పిన నవీన ధర్మ శాస్త్రం అంబేడ్కర్ విరచిత భారత రాజ్యాంగం. ఇటువంటి రాజ్యాంగంతో మనువాదులు రాజీపడటం అంత సులభసాధ్య మేమీ కాదు. అందుకే గడిచిన డెబ్బయ్ ఐదేళ్లుగా ఈ రాజ్యాంగంపై, దాన్ని రచించిన బాబాసాహెబ్‌పై వివిధ రూపాల్లో దాడులు జరుగుతూనే ఉన్నాయి. రాజకీయ రంగంలో మనువాదుల ప్రాబల్యం కారణంగానే రాజ్యాంగాన్ని తు.చ. తప్పకుండా అమలు చేయడం ఇప్పటి దాకా సాధ్యం కాలేదు.
ఎన్టీఆర్ స్థానంలో చంద్రబాబు నాయకత్వం మొదలైన దగ్గర నుంచీ తెలుగుదేశం పార్టీలో వచ్చిన భావజాల మార్పు దాన్ని బీజేపీకి సహజ మిత్రపక్షంగా మార్చింది. కాకుల్ని కొట్టి గద్దలకు వేయడం ఆ పార్టీ ఆర్థిక సిద్ధాంతంగా మారింది. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో నిజాం షుగర్స్, ఆంధ్ర పేపర్, ఆల్విన్, రిపబ్లిక్ ఫోర్జ్ తదితర 56 ప్రభుత్వ రంగ సంస్థలను చంద్రబాబు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడమో, మూసివేయడమో చేశారు. ప్రైవేట్ వ్యక్తులు బాగా బలిస్తే... వారి దగ్గర నుంచి జారిపడే చిల్లరతో పేదలు బతికేస్తారనే ట్రికిల్‌డౌన్ ఆర్థిక సిద్ధాంతం చంద్రబాబుది. భారత రాజ్యాంగం కోరుకున్న పేదల సాధికారతతో ఈ ఆర్థిక సిద్ధాంతా నికి సాపత్యం కుదరదు.
పేద వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యనూ, వైద్యాన్నీ ఆయన అందనీయలేదు. కనీస వైద్య సేవలు కూడా ఉచితంగా అందడానికి వీల్లేదని యూజర్ ఛార్జీలను ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆయనదే! వరస కరువుకాటకాలతో, నకిలీ ఎరువులు, పురుగుల మందుల వాడకంతో చితికిపోయిన రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వడానికి వీల్లేదని ఆయన చెప్పిన పాఠాలు ఎప్పటికీ తెలుగు ప్రజలు మరిచిపోరు. విభజిత రాష్ట్ర ముఖ్య మంత్రిగా కూడా ఈ ఆర్థిక విధానాలకే ఆయన కట్టుబడి ఉన్నారు.
ఆర్థిక రంగంలోనే కాదు, సామాజిక రంగంలోనూ ఆయన భావజాలానికీ, మనుస్మృతికీ మధ్యన పెద్దగా తేడాలుండవు. తన కులతత్వ ఆలోచనలు, పురుషాహంకార అభిప్రాయా లను దాచుకోవడం కూడా ఆయనకు సాధ్యపడలేదు. విభజిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీసీల తోకలు కత్తిరిస్తానని ఆయన బహిరంగంగానే బెదిరించారు.
‘ఎస్‌సీ కులాల్లో పుట్టా లని ఎవరు కోరుకుంటార’ని ప్రెస్‌మీట్‌లోనే ఈసడించు కున్నారు. ‘న్యాయస్థానాల్లో జడ్జీ పదవులకు బీసీలు పనికిరారం’టూ కేంద్రానికి లేఖలు రాశారు. ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా’ అని తన మనువాద భావాలను బయటపెట్టుకున్నారు.
ఈ మనువాద రాజకీయాలకు పూర్తి భిన్నంగా గడిచిన ఐదేళ్ల జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన సాగింది. భారత రాజ్యాంగ లక్ష్యాల సాధన ఆశయంగా, సుస్థిర అభివృద్ధి ధ్యేయంగా సాగిన ఆయన ఐదేళ్ల పరిపాలన దేశం ముందు ఒక ఆదర్శ నమూనాను ఆవిష్కరించింది. ఈ నమూనాపై జరిగిన విద్వేషపూరిత విష ప్రచారం బహుశా ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఎప్పుడూ జరిగి ఉండదు.
సమాజంలోని పేదవర్గాల సంక్షే మానికీ, మధ్య తరగతి కలల సాకారానికీ, మహిళల సాధికా రతకూ మనువాద సంపన్న వర్గాలు మనస్ఫూర్తిగా సహకరించవు. ఈ వర్గాలను చంద్రబాబు ఏకం చేసుకున్నారు. వారి వద్ద నున్న సకల అస్త్ర శస్త్రాలు, హంగు ఆర్భాటాలతో యుద్ధానికి దిగారు. విద్వేషపు విషవాయువులతో కార్పెట్ బాంబింగ్ చేశారు. ఒక్కో నియోజకవర్గం ఒక్కో భోపాల్ మాదిరిగా విష వాయువులతో ఉక్కిరి బిక్కిరైంది.
విష ప్రచారాన్ని కొంతమందైనా నమ్మి ఉండవచ్చు. అరచేతిలో చూపెట్టిన వైకుంఠానికి మరికొంతమంది మోస పోయి ఉండవచ్చు. వోట్ ఫర్ డెమోక్రసీ (వీఎఫ్‌డీ), అసోసి యేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థలు బల్లగుద్ది చెబుతున్నట్టుగా ఈవీఎమ్‌లలో మాయాజాలం జరిగి ఉండ వచ్చు.
ఈ మాయాజాలంలో దేశంలోనే అత్యధికంగా యాభై లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నట్టు వీఎఫ్‌డీ వాదిస్తున్నది. కారణమేదైనా చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అలవాటు ప్రకారం చేతిలోని వైకుంఠాన్ని చెట్టెక్కించారు. ముసుగు చీల్చు కొని మనువాదం బయటకొచ్చింది.
మహిళా సాధికారతపై దాడి జరిగింది. ‘అమ్మ ఒడి’, ‘చేయూత’ వగైరా పథకాలు ఆగిపోయాయి. పేద విద్యార్థుల నాణ్యమైన చదువుపై దాడి జరిగింది. జగనన్న విద్యా కానుక, మధ్యాహ్న భోజనం, రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన తదితర కార్యక్రమాలు పట్టాలు తప్పాయి. ‘ఫ్యామిలీ డాక్టర్’ మాయ మయ్యాడు. ‘ఆరోగ్యశ్రీ’నీ నీరుకార్చారు. పాలనా వికేంద్రీకర ణకు చాపచుట్టారు. వలంటీర్ వ్యవస్థ మాయమైంది. ఆర్‌బీకేల సేవలు ఆవిరయ్యాయి.
విత్తనాల కోసం ఐదేళ్ల తర్వాత రైతులు మళ్లీ క్యూలైన్లలో రోజుల తరబడి నిలబడుతున్నారు. జగన్ మోహన్‌రెడ్డి ప్రారంభించిన ప్రభుత్వ వైద్యశాలలపై ప్రైవేటీ కరణ కత్తి వేలాడుతున్నది. కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్ర రహదారులపై సైతం టోల్ వసూలుకు రంగం సిద్ధమైంది. రాజ్యాంగ లక్ష్యాలపై వరసగా దాడులు జరుగుతున్నాయి. అంబే డ్కర్ స్మృతివనంపై జరిగిన దాడిని ఒక ప్రతీకాత్మక దాడిగానే పరిగణించాలి.
విజయవాడ నడిబొడ్డున ఆకాశమెత్తు అంబేడ్క రుడి మహాశిల్పాన్ని జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేశారు. ఇది ఆంధ్రా మనువాదుల్లో కడుపు మంటకు కారణమైంది. నలభ య్యేళ్ల నాటి కారంచేడు కండకావరం తిమ్మిరి ఇంకా వదల్లేదు. జగన్‌మోహన్‌రెడ్డి పేరును తొలగించి కొంత ఆనందాన్ని పొంది ఉండవచ్చు. ముందు ముందు మరిన్ని దాడులు జరగవచ్చు. ఆ దాడుల అసలు లక్ష్యం – భారత రాజ్యాంగం మాత్రమే!
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
Comments
Please login to add a commentAdd a comment