
సాక్షి, తాడేపల్లి: ఈ నెల 19న విజయవాడలో జరిగే125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం రాజన్న దొర, బీసీ సంక్షేమం, సమాచార శాఖమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు. 139 కులాలకు సంబంధించి 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర కార్పొరేషన్లలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఛైర్మన్లు, డైరక్టర్ల సమావేశం తాడేపల్లిలోలో బుధవారం జరిగింది. ఈ సమావేశానికి శాసనమండలి విప్, పార్టీ కేంద్ర కార్యాలయ ఇంచార్జ్ లేళ్ళ అప్పిరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు.
అనంతరం రాజన్నదొర మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత బాబాసాహేబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణం అని అన్నారు. విజయవాడ నగరంలో నడిబొడ్డున ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్ననిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. అంబేద్కర్ సిధ్దాంతాలను, ఆశయాలను, లక్ష్యాలను నమ్మి సీఎం జగన్ సామాజిక న్యాయం చేస్తున్నారన్నారు.
విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం.. ఎంతో ఆనందం
అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని నమ్మి దాన్ని ఆకళింపు చేసుకున్నారన్నారు. అంబేద్కర్ అడుగుజాడలలో నడుస్తున్నారని తెలిపారు. భారతదేశంలో ఎక్కడాలేని విధంగా స్వేచ్చా, స్వాతంత్ర్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ప్రజలందరూ మెచ్చే నిర్ణయమని కొనియాడారు. సాధారణంగా దళితవాడలలో, పల్లెల్లో అంటే ప్రతి ఊరి చివరన కాలనీలలో కనబడే అంబేద్కర్ విగ్రహాలను సీఎం జగన్ విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
అంబేద్కర్ ఆశయాల సాధనకు అనుగుణంగా సీఎం పాలన
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. ఈ నెల 19 న విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణను పండుగలా నిర్వహించాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విగ్రహం కింద ఏర్పాటుచేస్తున్న వేదికతో కూడితే దాదాపు 195 అఢుగుల ఎత్తులో కారణజన్ముడైన అంబేద్కర్ విగ్రహం కనిపిస్తుందన్నారు. విజయవాడలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం సగర్వంగా చూడవచ్చన్నారు. వివిధ దేశాలలో అధ్యయనం చేసి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇంత పెద్ద భారత దేశ ప్రజాస్వామ్యాన్ని ఎల్లప్పుడూ పరిఢవిల్లేలా చేస్తోందన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు అనుగుణంగా ముఖ్యమంత్రి పరిపాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు.
ఆ ఘనత సీఎందే..
గ్రామసచివాలయాల పరిధిలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం గురించి ప్రచారం చేయాలని కోరారు. ఆ కార్యక్రమానికి ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చేవిధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజా ప్రతినిధులు పాలకులు కాదు సేవకుడు అని అంబేద్కర్ చెప్పిన మాటలను తూచ తప్పకుండా పాటిస్తున్ననాయకుడు సీఎం జగన్ అని ప్రశంసించారు. బీసీలకు 56 కార్పొరేషన్లను ఏర్పాటుచేసి వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించింది జగన్ మాత్రమేనని చెప్పారు. జనరల్ కార్పొరేషన్ల ఛైర్మన్లుగా కూడా బడుగు,బలహీనవర్గాలను నియమించిన ఘనత ముఖ్యమంత్రిదేనని కొనియాడారు.