మోక్షంలేని మోడల్ స్కూళ్లు
మోర్తాడ్ : గ్రామీణ స్థాయిలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీయస్‌ఈ) సెలబ స్‌ను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన మోడల్ స్కూళ్లు కొన్ని మండలాలకే పరిమితం అయ్యాయి. గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో యూపీఏ సర్కార్ మండలానికి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటుకు నిధులను కేటాయించింది. అయితే ఇప్పటి ఎన్‌డీఏ సర్కార్ మోడల్ స్కూళ్ల నిర్వహణ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై మోపడమే కాకుండా కొత్త మోడల్ స్కూ ళ్ల ఏర్పాటుకు నిధులను కేటాయించడం లేదు. దీంతో మోడల్ పాఠశాలల విద్య పరిమితం అయి ఎక్కువ మంది విద్యార్థులు లబ్ధిపొందలేక పోతున్నారు.
సీబీయస్‌ఈ సిలబస్ ద్వారా ప్లస్ టూ వరకు ఉచితంగా మెరుగైన విద్యను అందించడానికి మోడల్ స్కూళ్ల అంకురార్పణ జరిగింది. రెసిడెన్సియల్ విధానంతో పాటు డే స్కాలర్ విధానంలో మోడల్ స్కూళ్లలో విద్యను అందించడానికి ఏర్పాట్లు చేశారు. మోడల్ స్కూ ళ్ల ఏర్పాటుకు ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించింది. సొంత భవనాల నిర్మాణం కోసం 2014 అక్టోబర్24 జీవో నంబర్ యంయస్ 8 ద్వారా ఒక్కో మోడల్ స్కూల్ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.4.80 కోట్లను కేటాయింది. అయితే జిల్లాలో మొదట 15 చోట్ల స్థలాల సేకరణ వేగంగా జరగడంతో 15 మోడల్ స్కూళ్ల నిర్మాణం పూర్తయింది. బాల్కొండ మండలంలో మాత్రం స్థల సేకరణ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మోడల్ స్కూల్ నిర్మాణం మొదలయ్యే సమయంలో పనులు నిలిచిపోయాయి.
21 మండలాల్లో పాఠశాలల కోసం స్థల సేకరణలో జాప్యం ఏర్పడటంతో కేంద్ర ప్రభుత్వం తన నిధులను వెనక్కి తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో 21 మండలాలకు అన్యాయం జరిగిందని పలువురు విమర్శస్తున్నారు. ఇది ఇలా ఉండగా ప్రతి నియోజకవర్గంలో ఒకటి, రెండు మండలాల్లో మోడల్ స్కూళ్లు ఉండగా ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే ఎక్కడ కూడా మోడల్ స్కూళ్ల నిర్మాణం సాగలేదు. ఐదు మండలాల్లో స్థల సేకరణ పూర్తి అయినా కేంద్రం మనసు మారడంతో ఈ మండలాల్లోని విద్యార్థులకు తీవ్ర నష్టం ఏర్పడింది.
రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పాఠశాలలను సక్సెస్ స్కూళ్లుగా మార్చి వాటిలో ఆంగ్ల మాధ్యమంను అమలు చేస్తోంది. సక్సెస్ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో పదో తరగతి చదివిన విద్యార్థులకు ఇంటర్ ఇంగ్లిష్ మీడియంలో సీట్లు లభించడానికి మోడల్ స్కూళ్లు ఒక్కటే మార్గంగా ఉన్నాయి. అయితే మోడల్ స్కూళ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో విద్యార్థులకు సరిపడేంత సీట్లు ఉండటం లేదు. మోడల్ స్కూళ్ల సంఖ్య ఎక్కువగా ఉండిఉంటే ఇంటర్ ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులకు అవకాశం లభించేది.
మోడల్ స్కూళ్లు లేని మండలాలు ఇవే...
జిల్లాలోని మోర్తాడ్, కమ్మర్‌పల్లి, బాల్కొండ, భీమ్‌గల్, వేల్పూర్, కామారెడ్డి, మాచారెడ్డి, దోమకొండ, పిట్లం, జుక్కల్, బిచ్కుంద, గాంధారి, తాడ్వాయి, లింగంపేట్, బోధన్, ఎడపల్లి, నిజామాబాద్, కోటగిరి, బీర్కూర్, మాక్లూర్, భిక్కునూర్ మండలాల్లో సరైన సమయంలో స్థల సేకరణ జరుగకపోవడంతో మోడల్ స్కూళ్లు ఏర్పాటు కాలేదు. ఇప్పుడు స్థలాలు ఉన్నా నిధులు కేటాయించకపోవడంతో మోడల్ విద్య విద్యార్థులకు అందడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మోడల్ పాఠశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.