న్యూఢిల్లీ: అంతర్జాతీయ ధోరణులకు అనుగుణంగా విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరను ప్రభుత్వ రంగ చమురు రిటైల్ సంస్థలు వరుసగా మూడోసారి పెంచాయి. కంపెనీలు శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏటీఎఫ్ రేటు ఏకంగా 14 శాతం పెరిగింది. దీంతో ఢిల్లీలో కిలోలీటరు ధర రూ. 13,911 మేర పెరిగి రూ. 1,12,419కి చేరింది. స్థానిక పన్నులను బట్టి ఈ రేటు ఒకో రాష్ట్రంలో ఒకో రకంగా ఉంటుంది.
చమురు కంపెనీలు జులై 1న 1.65 శాతం, ఆగస్టు 1న 8.5 శాతం మేర ధరను పెంచాయి. తాజా పెంపుతో కలిపి మొత్తం మీద ఏటీఎఫ్ రేట్లు ఈ మధ్య కాలంలో కిలోలీటరుకు రూ. 23,116 మేర పెరిగినట్లయింది. మరోవైపు, వాణిజ్యావసరాలకు హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగించే వంట గ్యాస్ సిలిండరు ధర రూ. 157.50 తగ్గింది. దీంతో 19 కేజీల సిలిండరు రేటు ఢిల్లీలో రూ. 1,522.50కి పరిమితమవుతుంది. ఆగస్టు 1నే కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండరు రేటు రూ. 100 మేర తగ్గింది. చమురు కంపెనీలు వరుసగా 17వ నెల కూడా పెట్రోల్, డీజిల్ రేట్ల జోలికి వెళ్లలేదు.
సాధారణంగా ప్రభుత్వ రంగ చమురు రిటైల్ సంస్థలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ప్రతి నెలా 1వ తేదీన, క్రితం నెల అంతర్జాతీయ రేట్ల సగటు ప్రకారం దేశీయంగా వంట గ్యాస్, ఏటీఎఫ్ రేట్లను సవరిస్తాయి. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతి రోజూ సవరిస్తాయి. అయితే, గతేడాది మే నుంచి వీటి రేట్లను యథాతథంగా
కొనసాగిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment