jet fuel price
-
ఏటీఎఫ్ రేటు 14 శాతం పెంపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ధోరణులకు అనుగుణంగా విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరను ప్రభుత్వ రంగ చమురు రిటైల్ సంస్థలు వరుసగా మూడోసారి పెంచాయి. కంపెనీలు శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏటీఎఫ్ రేటు ఏకంగా 14 శాతం పెరిగింది. దీంతో ఢిల్లీలో కిలోలీటరు ధర రూ. 13,911 మేర పెరిగి రూ. 1,12,419కి చేరింది. స్థానిక పన్నులను బట్టి ఈ రేటు ఒకో రాష్ట్రంలో ఒకో రకంగా ఉంటుంది. చమురు కంపెనీలు జులై 1న 1.65 శాతం, ఆగస్టు 1న 8.5 శాతం మేర ధరను పెంచాయి. తాజా పెంపుతో కలిపి మొత్తం మీద ఏటీఎఫ్ రేట్లు ఈ మధ్య కాలంలో కిలోలీటరుకు రూ. 23,116 మేర పెరిగినట్లయింది. మరోవైపు, వాణిజ్యావసరాలకు హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగించే వంట గ్యాస్ సిలిండరు ధర రూ. 157.50 తగ్గింది. దీంతో 19 కేజీల సిలిండరు రేటు ఢిల్లీలో రూ. 1,522.50కి పరిమితమవుతుంది. ఆగస్టు 1నే కమర్షియల్ ఎల్పీజీ సిలిండరు రేటు రూ. 100 మేర తగ్గింది. చమురు కంపెనీలు వరుసగా 17వ నెల కూడా పెట్రోల్, డీజిల్ రేట్ల జోలికి వెళ్లలేదు. సాధారణంగా ప్రభుత్వ రంగ చమురు రిటైల్ సంస్థలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ప్రతి నెలా 1వ తేదీన, క్రితం నెల అంతర్జాతీయ రేట్ల సగటు ప్రకారం దేశీయంగా వంట గ్యాస్, ఏటీఎఫ్ రేట్లను సవరిస్తాయి. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతి రోజూ సవరిస్తాయి. అయితే, గతేడాది మే నుంచి వీటి రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నాయి. -
విమాన ప్రయాణికులకు షాక్! ఛార్జీల పెంపు షురూ..
పెరిగిన ధరలతో సామాన్యులు ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కాగా మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వాళ్లకు ఇప్పుడీ కాక మరింత బాగా తాకనుంది. బడ్జెట్ ధరల్లో విమాన సర్వీసులు అందించే స్పైస్‌జెట్ సంస్థ ఛార్జీలు పెంచుతామంటూ ప్రకటించింది. ఇటీవల కాలంలో విమానాల్లో ఉపయోగించే జెట్ ఫ్యూయల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఒక్క జూన్‌లోనే ఇంధన ధరలు 120 శాతం వరకు పెరిగాయి. మరోవైపు డాలర్‌తో రూపాయి మారక విలువ రోజురోజుకి క్షీణిస్తుంది. దీంతో ఏవియేషన్ సెక్టార్లో లాభాల సంగతి అటుంచి వస్తున్న నష్టాలను అదుపు చేయడం ఎలా అనే ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి. చివరకు ధరల పెంపు ఒక్కటే మార్గంగా ఏవియేషన్ సర్వీస్ ప్రొవైడర్లు డిసైడ్ అవుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తమ సంస్థ మనుగడ కొనసాగించాలంటే ఛార్జీలు పెంచడం మినహా మరో మార్గం లేదని స్పైస్‌జెట్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ ఇప్పటికే ప్రకటించారు. వివిధ మార్గాల్లో 10 నుంచి 15 శాతం వరకు ధరల పెంపు ఉంటుందని కూడా ఆయన ప్రకటించారు. ధరలు పెంచినా నష్టాల నుంచి తప్పించుకోవడం కష్టమని.. పన్నులు తగ్గించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలని కూడా ఆయన కోరారు. కోవిడ్ తర్వాత ప్రయాణాలు తగ్గిపోయాయి. ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తోంది. ఈ తరుణంలో ధరల పెంపుకు విమానయాన సంస్థలు విముఖంగా ఉన్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవు. ఛార్జీలు పెంచకపోతే మనుగడ కష్టమనే భావనలోకి స్పైస్‌జెట్‌తో పాటు ఇతర ఎయిర్‌లైన్స్ సంస్థలు సైతం ఉన్నాయి. ఈ ఛార్జీలు పెంపు స్పైస్‌జెట్‌తో మొదలైందని.. రాబోయే రోజుల్లో ఇతర సంస్థల నుంచి ధరల పెంపు ప్రకటనలు వెలువడతాయనే వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: ఎన్ని కోట్లయినా సరే.. తగ్గేదేలే!సూపర్ రిచ్ ఇక్కడ! -
విమాన చార్జీలకు రెక్కలు..
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రో ధరల పెంపుతో వాహనదారులకు చెమటలు పడుతుంటే. తాజాగా జెట్ ఇంధనం ధరలు చుక్కలు తాకుతుండటంతో విమాన చార్జీలు భారం కానున్నాయి. విమానాల్లో వాడే జెట్ ఇంధనం ధరలు శుక్రవారం నాలుగేళ్ల గరిష్టస్ధాయిలో ఏకంగా ఏడు శాతం పెరిగాయి. తాజా పెంపుతో ఏవియేషన్ టర్భైన్ ఇంధనం (ఏటీఎఫ్) ధరలు కిలోలీటర్‌కు రూ 4688 మేర పెరిగి రూ 70,028కి చేరాయి. జెట్ ఇంధన ధరలు ఇటీవల ఈ స్ధాయిలో భారీగా పెరగడం ఇది రెండవసారి కావడం గమనార్హం. మే 1న ఏటీఎఫ్ ధరలు కిలోలీటర్‌కు రూ 3890 మేర పెరిగాయి. తాజా పెంపుతో జెట్ ఇంధనం ధరలు నాలుగేళ్ల గరిష్టస్ధాయిలో భగ్గుమన్నాయి. మరోవైపు జెట్ ఇంధన ధరలు భారీగా పెరగడంతో విమాన ప్రయాణ చార్జీలను పెంచేందుకు విమానయాన సంస్థలు కసరత్తు సాగిస్తున్నాయి. చార్జీల పెంపు తప్పదని గతంలోనే సంకేతాలు పంపిన విమానయాన సంస్ధలు తాజాగా జెట్ ఇంధన ధరలు భారీగా పెరగడంతో ఇక ప్రయాణీకులపై చార్జీల వాత వడ్డిస్తాయని భావిస్తున్నారు. -
విమాన చార్జీలకు రెక్కలు..
సాక్షి, ముంబయి : ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు గత ఏడాదిలో 30 శాతం పెరగడంతో విమానయాన సంస్థలు నిర్వహణ ఖర్చులను అధిగమించేందుకు విమాన చార్జీలను పెంచవచ్చని నిపుణులు భావిస్తున్నారు. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో 45 శాతం జెట్ ఇంధనం ఖర్చులే కావడంతో విమాన చార్జీలను 15 శాతం మేర పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇంధన ధరల పెరుగుదలతో చార్జీలు పెంచకతప్పదని ఇప్పటికే పలు ప్రైవేట్ విమానయాన సంస్థలు సంకేతాలు పంపినా అధికారికంగా చార్జీల పెంపుపై స్పష్టత ఇవ్వలేదు. గత ఏడాదిగా జెట్ ఇంధన ధరలు 30 శాతం మేర పెరిగాయని, గత ఆరునెలల్లోనే 25 శాతం భారమయ్యాయని, ఈ పరిస్థితుల్లో టికెట్ ధరలను పెంచకతప్పదని ఓ ప్రైవేట్ విమానయాన సంస్థ ప్రతినిధి వ్యాఖ్యానించారు. అయితే ముందుగా ఏ సంస్థ చార్జీల పెంపును ప్రకటిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు పోటీ పెరిగిన క్రమంలో చార్జీల పెంపుకు ముందు సీట్ల ఆక్యుపెన్సీని కూడా చూసుకోవాలని మరో ఎయిర్‌లైన్‌కు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. జెట్ ఇంధన ధరల పెంపుతో విమాన చార్జీలు 10 నుంచి 15 శాతం పెరగవచ్చని తాము అంచనా వేస్తున్నామని కేపీఎంజీ ఏరోస్సేస్, డిఫెన్స్ ఇండియా హెడ్ అంబర్ దూబే పేర్కొన్నారు. జెట్ ఇంధనంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ సుంకం తగ్గిస్తే పరిస్థితిలో కొంత మార్పు వస్తుందని అన్నారు. -
పెరిగిన గ్యాస్ ధర.. తగ్గిన విమాన ఇంధనం
నాన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల ధరను పెంచారు. 14.2 కిలోల బరువుండే ఒక్కో సిలిండర్ మీద ధరను రూ. 61.50 వంతున పెంచారు. ఒక కనెక్షన్‌కు ఏడాదికి 12 సిలిండర్లను మాత్రమే సబ్సిడీ మీద ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆ కోటా దాటిన తర్వాత నాన్ సబ్సిడీ ధరకు వాటిని కొనాల్సి ఉంటుంది. వాటి ధర మాత్రమే ఇప్పుడు పెరిగింది. అయితే, విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలను మాత్రం 1.2 శాతం చొప్పున కొద్దిగా తగ్గించారు. పెట్రోలు, డీజిల్ ధరలను సోమవారం స్వల్పంగా తగ్గించిన విషయం తెలిసిందే. పెట్రోలు ధరను లీటరుకు 58 పైసలు, డీజిల్ ధరను లీటరుకు 25 పైసల వంతున తగ్గిస్తూ ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.