
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రో ధరల పెంపుతో వాహనదారులకు చెమటలు పడుతుంటే. తాజాగా జెట్ ఇంధనం ధరలు చుక్కలు తాకుతుండటంతో విమాన చార్జీలు భారం కానున్నాయి. విమానాల్లో వాడే జెట్ ఇంధనం ధరలు శుక్రవారం నాలుగేళ్ల గరిష్టస్ధాయిలో ఏకంగా ఏడు శాతం పెరిగాయి. తాజా పెంపుతో ఏవియేషన్ టర్భైన్ ఇంధనం (ఏటీఎఫ్) ధరలు కిలోలీటర్‌కు రూ 4688 మేర పెరిగి రూ 70,028కి చేరాయి.
జెట్ ఇంధన ధరలు ఇటీవల ఈ స్ధాయిలో భారీగా పెరగడం ఇది రెండవసారి కావడం గమనార్హం. మే 1న ఏటీఎఫ్ ధరలు కిలోలీటర్‌కు రూ 3890 మేర పెరిగాయి. తాజా పెంపుతో జెట్ ఇంధనం ధరలు నాలుగేళ్ల గరిష్టస్ధాయిలో భగ్గుమన్నాయి. మరోవైపు జెట్ ఇంధన ధరలు భారీగా పెరగడంతో విమాన ప్రయాణ చార్జీలను పెంచేందుకు విమానయాన సంస్థలు కసరత్తు సాగిస్తున్నాయి.
చార్జీల పెంపు తప్పదని గతంలోనే సంకేతాలు పంపిన విమానయాన సంస్ధలు తాజాగా జెట్ ఇంధన ధరలు భారీగా పెరగడంతో ఇక ప్రయాణీకులపై చార్జీల వాత వడ్డిస్తాయని భావిస్తున్నారు.