International Trend
-
ఏటీఎఫ్ రేటు 14 శాతం పెంపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ధోరణులకు అనుగుణంగా విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరను ప్రభుత్వ రంగ చమురు రిటైల్ సంస్థలు వరుసగా మూడోసారి పెంచాయి. కంపెనీలు శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏటీఎఫ్ రేటు ఏకంగా 14 శాతం పెరిగింది. దీంతో ఢిల్లీలో కిలోలీటరు ధర రూ. 13,911 మేర పెరిగి రూ. 1,12,419కి చేరింది. స్థానిక పన్నులను బట్టి ఈ రేటు ఒకో రాష్ట్రంలో ఒకో రకంగా ఉంటుంది. చమురు కంపెనీలు జులై 1న 1.65 శాతం, ఆగస్టు 1న 8.5 శాతం మేర ధరను పెంచాయి. తాజా పెంపుతో కలిపి మొత్తం మీద ఏటీఎఫ్ రేట్లు ఈ మధ్య కాలంలో కిలోలీటరుకు రూ. 23,116 మేర పెరిగినట్లయింది. మరోవైపు, వాణిజ్యావసరాలకు హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగించే వంట గ్యాస్ సిలిండరు ధర రూ. 157.50 తగ్గింది. దీంతో 19 కేజీల సిలిండరు రేటు ఢిల్లీలో రూ. 1,522.50కి పరిమితమవుతుంది. ఆగస్టు 1నే కమర్షియల్ ఎల్పీజీ సిలిండరు రేటు రూ. 100 మేర తగ్గింది. చమురు కంపెనీలు వరుసగా 17వ నెల కూడా పెట్రోల్, డీజిల్ రేట్ల జోలికి వెళ్లలేదు. సాధారణంగా ప్రభుత్వ రంగ చమురు రిటైల్ సంస్థలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ప్రతి నెలా 1వ తేదీన, క్రితం నెల అంతర్జాతీయ రేట్ల సగటు ప్రకారం దేశీయంగా వంట గ్యాస్, ఏటీఎఫ్ రేట్లను సవరిస్తాయి. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతి రోజూ సవరిస్తాయి. అయితే, గతేడాది మే నుంచి వీటి రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నాయి. -
బుల్... ధనాధన్!.
► సెన్సెక్స్ మరో 485 పాయింట్లు జంప్ ► రెండు రోజుల్లో 1000 పాయింట్ల పైగా ర్యాలీ ► సెన్సెక్స్ మళ్లీ 26,000పైకి... ► 8,000 మార్కును దాటిన నిఫ్టీ ► 7 నెలల గరిష్టస్థాయికి సూచీలు పెరిగిన ఇన్వెస్టర్ల సంపదరూ. 2.69 లక్షల కోట్లు వరుసగా మూడు రోజుల్లో సెన్సెక్స్ 1,100 పాయింట్లు పెరగ్గా, ఇన్వెస్టర్ల సంపద రూ. 2.69 లక్షల కోట్ల మేర ఎగిసింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 98.11 లక్షల కోట్లకు చేరింది. ముంబై: అంతర్జాతీయ ట్రెండ్ అంతంతమాత్రంగానే వున్నా, గురువారం భారత్ స్టాక్ మార్కెట్లో బుల్స్ చెలరేగిపోయారు. భారీగా బ్లూచిప్ షేర్లను ఎడాపెడా కొనేశారు. దాంతో స్టాక్ సూచీలు 7 నెలల గరిష్టస్థాయికి పరుగులు తీసాయి. బీఎస్ఈ సెన్సెక్స్26,000 పాయింట్ల స్థాయిని అవలీలగా అధిగమించి, మరో 485 పాయింట్లు ఎగిసి 26,367 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ కేవలం రెండు రోజుల్లో 1,000 పాయింట్లపైన పెరిగింది. దాదాపు 29 వారాల తర్వాత 8,000 పాయింట్ల స్థాయిని అధిగమించిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 135 పాయింట్ల పెరుగుదలతో 8,069 పాయింట్ల వద్ద ముగిసింది. గతేడాది నవంబర్ 5 తర్వాత నిఫ్టీ 8,000 శిఖరాన్ని అధిరోహించడం ఇదే మొదటిసారి. ఈ సూచీ రెండు రోజుల్లో 300 పాయింట్లకుపైగా ర్యాలీ జరిపింది. ఎందుకీ ర్యాలీ... కొద్దిరోజుల నుంచి పలు సానుకూల అంశాలు కన్పిస్తున్నా, వెనుకంజ వేస్తూవస్తున్న ఇన్వెస్టర్లు ఒక్కసారిగా వారి భయాల్ని పక్కనపెట్టి బుధ, గురువారాల్లో జోరుగా కొనుగోళ్లు జరిపారు. మే నెల డెరివేటివ్ సిరీస్ ముగింపు కారణంగా జరిగిన షార్ట్ కవరింగ్ కూడా షేర్లను కదం తొక్కించింది. మార్కెట్ భయపడినంతగా కార్పొరేట్ల క్యూ3 ఫలితాలు లేవని, కొన్ని కంపెనీలు ప్రోత్సాహకర ఫలితాలు సైతం ప్రకటించాయని, దీంతో ఇన్వెస్టర్లలో తాజా విశ్వాసం ఏర్పడటం తాజా ర్యాలీకి ఒక కారణమని విశ్లేషకులు చెపుతున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వెలువడిన తర్వాత ఆ అంశాన్ని మార్కెట్ డిస్కౌంట్చేసుకోకుండా ప్రపంచ ట్రెండ్ పట్ల ఆందోళనతో నిరీక్షించిందని వారు పేర్కొన్నారు. అయితే రెండు రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లు ర్యాలీ జరపడంతో ఇక్కడ హఠాత్తుగా కొనుగోళ్లు జరిగినట్లు నిపుణులు వివరించారు. ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధర ఈ ఏడాదిలో మొదటిసారిగా 50 డాలర్ల స్థాయిని తాకడం కూడా సెంటిమెంట్ను మెరుగుపర్చిందని వారన్నారు. ఈ ఏడాది వర్షపాతం సగటుకంటే అధికంగా వుంటుందంటూ ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ ప్రకటన ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపిందన్నారు. ఆందోళనలు పోలేదు... పలు సానుకూల అంశాలతో మార్కెట్ భారీ ర్యాలీ జరిపినా, మార్కెట్లో ఇంకా కొన్ని ఆందోళనలు తొలగిపోలేదని విశ్లేషకులు చెప్పారు. జూన్ నెలలో అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచవచ్చన్న భయాలు, చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం ప్రధానంగా ఇన్వెస్టర్లను ఆందోళనపరుస్తున్నాయని, వీటిని తాత్కాలికంగా పక్కనపెట్టి వృద్ధి అవకాశాలున్న బ్లూచిప్ షేర్లను కొనుగోలు చేసినట్లు నిపుణులు వివరించారు. ఎల్ అండ్ టీ టాప్... మార్కెట్ అంచనాల్ని మించి ఆర్థిక ఫలితాల్ని ప్రకటించిన ఎల్ అండ్ టీ భారీగా 14 శాతం ఎగిసి రూ. 1,471 వద్ద ముగిసింది. సెన్సెక్స్-30 షేర్లలో 22 షేర్లు పెరిగాయి. శుక్రవారం ఆర్థిక ఫలితాలు వెల్లడించనున్న ఎస్బీఐ 5 శాతం వరకూ పెరిగింది. రెండు రోజుల క్రితం బోనస్ ఇష్యూను, భారీ డివిడెండును ప్రకటించిన ఐటీసీ మరో 3 శాతం పెరిగి రెండు సంవత్సరాల గరిష్టస్థాయి రూ. 363 వద్ద క్లోజయ్యింది. బీహెచ్ఈఎల్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ షేర్లు 3-5 శాతం మధ్య ర్యాలీ జరిపాయి. వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే ఎక్కువగా క్యాపిటల్ గూడ్స్ సూచి 8.78 శాతం పెరగ్గా, బ్యాంకెక్స్ 2.22 శాతం, రియల్టీ సూచి 1.82 శాతం చొప్పున పెరిగాయి. -
పసిడి... ఫెడ్ వైపు చూపు...
* వరుసగా మూడవ వారమూ లాభాలే... * రూ.40,000 పైకి వెండి న్యూయార్క్/ముంబై: అంతర్జాతీయ ట్రెండ్, దేశీయంగా పెళ్ళిళ్ల డిమాండ్ కారణంగా కొద్దిరోజుల నుంచి పెరుగుతూ వస్తున్న పుత్తడి ధరపై సమీప భవిష్యత్తులో అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ నిర్ణయ ప్రభావం వుంటుందని బులియన్ ట్రేడర్లు అంచనావేస్తున్నారు. ఈ మంగళ, బుధవారాల్లో జరగబోయే ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో వడ్డీ రేట్ల పెంపు అంశంపై నిర్ణయం వెలువడుతుంది. ఫెడ్ నిర్ణయం లేదా వ్యాఖ్యానాలకు అనుగుణంగా పుత్తడి ధర బాగా పెరగడం లేదా లాభాల స్వీకరణకు గురై తగ్గడం జరగవచ్చని ట్రేడర్లు భావిస్తున్నారు. ప్రస్తుతం భారత్లో పెళ్లిళ్లు, పండుగల సీజన్ను ఈ సందర్భంగా స్టాకిస్టులు, ఆభరణ వర్తకుల నుంచి భారీ డిమాండ్ నెలకొంది. భారత్లో నెలకొన్న డిమాండ్ ఫలితంగా సమీప కాలంలో పసిడి ధరలో స్వల్ప ఒడుదుడుకులున్నా, అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ నెమైక్స్లో ఔన్స్ (31.1గ్రా)కు 1,200 డాలర్ల దిగువకు మాత్రం పడిపోయే పరిస్థితి లేదన్నది వారి వాదన. దేశీయంగా పసిడి వరుసగా మూడవ వారమూ లాభాల బాటన పయనించింది. ముంబై ప్రధాన బులియన్ మార్కెట్లో 99.9 ప్యూరిటీ 10 గ్రాముల ధర రూ.295 లాభపడి, రూ. 29,505 వద్ద ముగిసింది. ఇక 99.5 ప్యూరిటీ ధర సైతం ఇదే స్థాయిలో ఎగసి రూ. 29,355 వద్ద వద్ద ముగిసింది. ఇక వెండి విషయానికి వస్తే... కేజీకి భారీగా రూ. 2,425 లాభపడి (6శాతం పైగా) రూ.40,800 వద్దకు పెరిగింది. వరుసగా మూడు వారాల నుంచీ భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి, గడచిన వారం ఏకంగా ఏడాదిన్నర గరిష్ట స్థాయికి ఎగయడం గమనార్హం. నెమైక్స్లో చురుగ్గా ట్రేడవుతున్న ఔన్స్ జూన్ డెలివరీ ధర వారంవారీగా దాదాపు నిశ్చలంగా 1,230 డాలర్ల వద్ద ముగిసింది. వెండి 15 డాలర్లు-16 డాలర్ల శ్రేణిలో తిరుగుతోంది. -
మూడు నెలల కనిష్టానికి బంగారం
ముంబై : అంతర్జాతీయ ట్రెండ్ బలహీనంగా వుండటంతో ముంబై బులియన్ మార్కెట్లో పుత్తడి ధర గతవారం మరింత క్షీణించి, మూడు నెలల కనిష్టస్థాయికి పడిపోయింది. పుత్తడి క్షీణించడం వరుసగా ఇది రెండోవారం. 99.9 స్వచ్ఛతగల 10 గ్రాముల బంగారం ధర రూ. 26,820-26,230 మధ్య హెచ్చుతగ్గులకు లోనై, చివరకు రూ. 26,340 వద్ద ముగిసింది. అంతక్రితం వారంతో పోలిస్తే రూ. 195 వరకూ తగ్గింది. 99.5 స్వచ్ఛతగల పుత్తడి అంతేమొత్తం నష్టంతో రూ. 26,190 వద్ద ముగిసింది. ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం ధర దాదాపు 10 డాలర్లు కోల్పోయి, 1,163 డాలర్ల వద్ద క్లోజయ్యింది. గ్రీసులో జరుగుతున్న రిఫరెండం నేపథ్యంలో అంతర్జాతీయ ట్రెండ్ బలహీనంగా వుందని, ఇదే సమయంలో ఇక్కడ రూపాయి మారకపు విలువ బలపడటంతో స్థానిక మార్కెట్లో పుత్తడి ధర తగ్గిందని బులియన్ ట్రేడర్లు చెప్పారు. -
స్వల్పంగా పెరిగిన బంగారం ధర
అంతర్జాతీయ ట్రెండ్ మెరుగ్గావుండటం, స్థానికంగా స్టాకిస్టులు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరపడంతో గతవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచేఅంశమై ఆచితూచి వ్యవహరించనున్నట్లు ప్రకటించడంతో ప్రపంచమార్కెట్లో ఔన్సు బంగారం ధర నెలరోజుల తర్వాత తొలిసారిగా 1,200 డాలర్లస్థాయిని దాటింది. వారంలో 22 డాలర్లు పెరిగిన పుత్తడి 1,202 డాలర్ల వద్దకు చేరింది. దాంతో ముంబై బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛతగల పుత్తడి 10 గ్రాములకు వారంలో ఒకదశలో 27,000 స్థాయిని అధిగమించి, రూ. 27,030 వద్దకు చేరింది. అటుతర్వాత డాలరుతో రూపాయి విలువ బలపడిన కారణంగా 26,935 వద్ద ముగిసింది. గతవారంతో పోలిస్తే రూ. 95 వరకూ లాభపడింది.