బుల్... ధనాధన్!.
► సెన్సెక్స్ మరో 485 పాయింట్లు జంప్
► రెండు రోజుల్లో 1000 పాయింట్ల పైగా ర్యాలీ
► సెన్సెక్స్ మళ్లీ 26,000పైకి...
► 8,000 మార్కును దాటిన నిఫ్టీ
► 7 నెలల గరిష్టస్థాయికి సూచీలు
పెరిగిన ఇన్వెస్టర్ల సంపదరూ. 2.69 లక్షల కోట్లు వరుసగా మూడు రోజుల్లో సెన్సెక్స్ 1,100 పాయింట్లు పెరగ్గా, ఇన్వెస్టర్ల సంపద రూ. 2.69 లక్షల కోట్ల మేర ఎగిసింది. బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 98.11 లక్షల కోట్లకు చేరింది.
ముంబై: అంతర్జాతీయ ట్రెండ్ అంతంతమాత్రంగానే వున్నా, గురువారం భారత్ స్టాక్ మార్కెట్లో బుల్స్ చెలరేగిపోయారు. భారీగా బ్లూచిప్ షేర్లను ఎడాపెడా కొనేశారు. దాంతో స్టాక్ సూచీలు 7 నెలల గరిష్టస్థాయికి పరుగులు తీసాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్26,000 పాయింట్ల స్థాయిని అవలీలగా అధిగమించి, మరో 485 పాయింట్లు ఎగిసి 26,367 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ కేవలం రెండు రోజుల్లో 1,000 పాయింట్లపైన పెరిగింది. దాదాపు 29 వారాల తర్వాత 8,000 పాయింట్ల స్థాయిని అధిగమించిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 135 పాయింట్ల పెరుగుదలతో 8,069 పాయింట్ల వద్ద ముగిసింది. గతేడాది నవంబర్ 5 తర్వాత నిఫ్టీ 8,000 శిఖరాన్ని అధిరోహించడం ఇదే మొదటిసారి. ఈ సూచీ రెండు రోజుల్లో 300 పాయింట్లకుపైగా ర్యాలీ జరిపింది.
ఎందుకీ ర్యాలీ...
కొద్దిరోజుల నుంచి పలు సానుకూల అంశాలు కన్పిస్తున్నా, వెనుకంజ వేస్తూవస్తున్న ఇన్వెస్టర్లు ఒక్కసారిగా వారి భయాల్ని పక్కనపెట్టి బుధ, గురువారాల్లో జోరుగా కొనుగోళ్లు జరిపారు. మే నెల డెరివేటివ్ సిరీస్ ముగింపు కారణంగా జరిగిన షార్ట్ కవరింగ్ కూడా షేర్లను కదం తొక్కించింది. మార్కెట్ భయపడినంతగా కార్పొరేట్ల క్యూ3 ఫలితాలు లేవని, కొన్ని కంపెనీలు ప్రోత్సాహకర ఫలితాలు సైతం ప్రకటించాయని, దీంతో ఇన్వెస్టర్లలో తాజా విశ్వాసం ఏర్పడటం తాజా ర్యాలీకి ఒక కారణమని విశ్లేషకులు చెపుతున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వెలువడిన తర్వాత ఆ అంశాన్ని మార్కెట్ డిస్కౌంట్‌చేసుకోకుండా ప్రపంచ ట్రెండ్ పట్ల ఆందోళనతో నిరీక్షించిందని వారు పేర్కొన్నారు.
అయితే రెండు రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లు ర్యాలీ జరపడంతో ఇక్కడ హఠాత్తుగా కొనుగోళ్లు జరిగినట్లు నిపుణులు వివరించారు. ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధర ఈ ఏడాదిలో మొదటిసారిగా 50 డాలర్ల స్థాయిని తాకడం కూడా సెంటిమెంట్‌ను మెరుగుపర్చిందని వారన్నారు. ఈ ఏడాది వర్షపాతం సగటుకంటే అధికంగా వుంటుందంటూ ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ ప్రకటన ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపిందన్నారు.
ఆందోళనలు పోలేదు...
పలు సానుకూల అంశాలతో మార్కెట్ భారీ ర్యాలీ జరిపినా, మార్కెట్లో ఇంకా కొన్ని ఆందోళనలు తొలగిపోలేదని విశ్లేషకులు చెప్పారు. జూన్ నెలలో అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచవచ్చన్న భయాలు, చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం ప్రధానంగా ఇన్వెస్టర్లను ఆందోళనపరుస్తున్నాయని, వీటిని తాత్కాలికంగా పక్కనపెట్టి వృద్ధి అవకాశాలున్న బ్లూచిప్ షేర్లను కొనుగోలు చేసినట్లు నిపుణులు వివరించారు.
ఎల్ అండ్ టీ టాప్...
మార్కెట్ అంచనాల్ని మించి ఆర్థిక ఫలితాల్ని ప్రకటించిన ఎల్ అండ్ టీ భారీగా 14 శాతం ఎగిసి రూ. 1,471 వద్ద ముగిసింది. సెన్సెక్స్-30 షేర్లలో 22 షేర్లు పెరిగాయి. శుక్రవారం ఆర్థిక ఫలితాలు వెల్లడించనున్న ఎస్‌బీఐ 5 శాతం వరకూ పెరిగింది. రెండు రోజుల క్రితం బోనస్ ఇష్యూను, భారీ డివిడెండును ప్రకటించిన ఐటీసీ మరో 3 శాతం పెరిగి రెండు సంవత్సరాల గరిష్టస్థాయి రూ. 363 వద్ద క్లోజయ్యింది. బీహెచ్‌ఈఎల్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్‌జీసీ షేర్లు 3-5 శాతం మధ్య ర్యాలీ జరిపాయి. వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే ఎక్కువగా క్యాపిటల్ గూడ్స్ సూచి 8.78 శాతం పెరగ్గా, బ్యాంకెక్స్ 2.22 శాతం, రియల్టీ సూచి 1.82 శాతం చొప్పున పెరిగాయి.