పసిడి... ఫెడ్ వైపు చూపు...
* వరుసగా మూడవ వారమూ లాభాలే...
* రూ.40,000 పైకి వెండి
న్యూయార్క్/ముంబై: అంతర్జాతీయ ట్రెండ్, దేశీయంగా పెళ్ళిళ్ల డిమాండ్ కారణంగా కొద్దిరోజుల నుంచి పెరుగుతూ వస్తున్న పుత్తడి ధరపై సమీప భవిష్యత్తులో అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ నిర్ణయ ప్రభావం వుంటుందని బులియన్ ట్రేడర్లు అంచనావేస్తున్నారు. ఈ మంగళ, బుధవారాల్లో జరగబోయే ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో వడ్డీ రేట్ల పెంపు అంశంపై నిర్ణయం వెలువడుతుంది. ఫెడ్ నిర్ణయం లేదా వ్యాఖ్యానాలకు అనుగుణంగా పుత్తడి ధర బాగా పెరగడం లేదా లాభాల స్వీకరణకు గురై తగ్గడం జరగవచ్చని ట్రేడర్లు భావిస్తున్నారు.
ప్రస్తుతం భారత్‌లో పెళ్లిళ్లు, పండుగల సీజన్‌ను ఈ సందర్భంగా స్టాకిస్టులు, ఆభరణ వర్తకుల నుంచి భారీ డిమాండ్ నెలకొంది. భారత్‌లో నెలకొన్న డిమాండ్ ఫలితంగా సమీప కాలంలో పసిడి ధరలో స్వల్ప ఒడుదుడుకులున్నా, అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ నెమైక్స్‌లో ఔన్స్ (31.1గ్రా)కు 1,200 డాలర్ల దిగువకు మాత్రం పడిపోయే పరిస్థితి లేదన్నది వారి వాదన. దేశీయంగా పసిడి వరుసగా మూడవ వారమూ లాభాల బాటన పయనించింది. ముంబై ప్రధాన బులియన్ మార్కెట్‌లో 99.9 ప్యూరిటీ 10 గ్రాముల ధర రూ.295 లాభపడి, రూ. 29,505 వద్ద ముగిసింది. ఇక 99.5 ప్యూరిటీ ధర సైతం ఇదే స్థాయిలో ఎగసి రూ. 29,355 వద్ద వద్ద ముగిసింది. ఇక వెండి విషయానికి వస్తే... కేజీకి భారీగా రూ. 2,425 లాభపడి (6శాతం పైగా) రూ.40,800 వద్దకు పెరిగింది.
వరుసగా మూడు వారాల నుంచీ భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి, గడచిన వారం ఏకంగా ఏడాదిన్నర గరిష్ట స్థాయికి ఎగయడం గమనార్హం. నెమైక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న ఔన్స్ జూన్ డెలివరీ ధర వారంవారీగా దాదాపు నిశ్చలంగా 1,230 డాలర్ల వద్ద ముగిసింది. వెండి 15 డాలర్లు-16 డాలర్ల శ్రేణిలో తిరుగుతోంది.