yadadri tour
-
ముగ్గురు సీఎంలతో కలిసి యాదాద్రి పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ (ఫొటోలు)
-
యాదాద్రిలో సీఎం కేసీఆర్.. కిలో బంగారం సమర్పించి మొక్కు చెల్లింపు
సాక్షి, యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించారు సీఎం కేసీఆర్. ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం.. యాదాద్రి ప్రధాన ఆలయ దివ్య విమాన గోపురానికి బంగారం కానుకగా సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. బంగారు తాపడం కోసం వారి కుటుంబం తరపున కిలో 16 తులాల బంగారం స్వామి వారికి కానుకగా ఇచ్చారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, ఆలయ అధికారులతో ఆలయ అభివృద్ధిపై సమీక్షించారు. శనివారం వరంగల్‌కు.. సీఎం కేసీఆర్ శనివారం వరంగల్ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ వరంగల్‌లో నిర్మించిన ఓ ప్రైవేటు ఆస్పత్రిని కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఆయన వరంగల్ జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించే అవకాశముంది. జాతీయ పార్టీ పేరు, ముహూర్తంపై కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. జాతీయ పార్టీపై దసరా రోజు అధికారిక ప్రకటన చేయనున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇదీ చదవండి: రూ.80 కోట్లతో కొనుగోలుకు టీఆర్ఎస్ నిర్ణయం -
నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్
సాక్షి, యాదాద్రి: సీఎం కేసీఆర్ మంగళవారం యాదాద్రి పర్యటనకు రానున్నారు. మధ్యాహ్నం 1 గంటకు సీఎం యాదాద్రికి చేరుకుంటారు. ఇటీవల ప్రధాని మోదీని ఢిల్లీలో కలిసిన సీఎం.. యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటనకు ఆయన్ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఆలయ ప్రారంభం ఉంటుందని ప్రధానికి సీఎం తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దర్శన భాగ్యం త్వరలో కల్పించే ప్రధాన ఘట్టంలో భాగంగా తుదిదశ పనులు సీఎం పరిశీలించనున్నారు. తర్వాత మార్పులు, చేర్పులు ఉంటే సూచించడంతో పాటు తుది మెరుగులు దిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలను పురమాయిస్తారు. సీఎంఓ ముఖ్యకార్యదర్శి భూపాల్‌రెడ్డి సమీక్షలు నిర్వహిస్తూ పనుల్లో వేగం పెంచారు. 17న మరోసారి ఈ నెల 17న చినజీయర్ స్వామితో కలిసి సీఎం మళ్లీ యాదాద్రికి రానున్నారు. ఆలయ పునర్నిర్మాణానికి ముందు యాదాద్రి ఉద్ఘాటన సందర్భంగా ఆలయంలో మహా సుదర్శన యాగం నిర్వహిస్తామని గతంలోనే సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో సుమారు 3,000 మంది వేదపండితులు, రుత్విక్కులతో యాగం మహోన్నతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయనున్నారు. ఉద్ఘాటనతో పాటు యాగ నిర్వహణ చినజీయర్ స్వామి నేతృత్వంలో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో యాగశాలతో పాటు ఆలయ ప్రారంభోత్సవం, అంతకు ముందు కుంభాభిషేకం వంటి ప్రధాన శాస్త్రోక్త కార్యక్రమాలన్నిటి నిర్వహణపై సలహాలు, సూచనలు తీసుకోవడానికి చినజీయర్ స్వామిని తీసుకువస్తున్నారని అధికారులు చెబుతున్నారు. పసిడి కాంతుల్లో యాదాద్రి యాదాద్రీశుడి క్షేత్రం సోమవారం రాత్రి పసిడి కాంతుల్లో కనువిందు చేసింది. ఆలయమంతా బంగారు వర్ణం వెదజల్లేలా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలను వైటీడీఏ అధికారులు ట్రయల్ రన్ వేశారు. గతంలో తూర్పు, ఉత్తర రాజగోపురాల వైపు మాత్రమే విద్యుత్ దీపాలను ప్రయోగాత్మకంగా వెలిగించగా.. సోమవారం రాత్రి ఆలయ మండపాలు, రాజగోపురాలు, తిరువీధుల్లోనూ బంగారు రంగులో కనువిందు చేసే విద్యుత్ దీపాలను ట్రయల్ వేశారు. -
‘యాదాద్రి అద్భుతం.. అద్వితీయం’ సీజేఐ ప్రశంసలు
సాక్షి, యాదాద్రి: యాదాద్రి పుణ్యక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లక్ష్మీ నర్సింహస్వామి ఆలయ పునర్నిర్మాణం అద్భుతంగా ఉందని, కృష్ణ శిలలతో నిర్మితమైన ఈ ఆలయం చరిత్రలో నిలిచిపోతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు. క్షేత్రంలోని పచ్చదనం, కట్టడాలు అద్వితీయంగా ఉన్నాయని ఆలయ ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయితోపాటు శిల్పుల పనితీరును ప్రశంసించారు. యాదాద్రికి మరోసారి సైతం తప్పక వస్తానని పేర్కొన్నారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సతీసమేతంగా మంగళవారం యాదాద్రి జిల్లాలోని లక్ష్మీ నర్సింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు స్వర్ణ కలశంతో కూడిన పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వయంభువును, బాలాలయంలోని పంచ నారసింహుని దర్శించుకుంటూ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు స్వామి, అమ్మవార్లకు స్వర్ణ పుష్పార్చన పూజలు జరిపించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఆలయ గడప బయట నుంచి పూజలు జరిపి దర్శించుకుని స్వర్ణ శటారి పొందారు. సుమారు గంటపాటు బాలాలయంలో గడిపి పూజలు నిర్వహించిన అనంతరం వేద ఆశీర్వచనం పొందారు. ఆలయ విశేషాలను పూజారులను సీజేఐ అడిగి తెలుసుకున్నారు. సీజేఐ దంపతులకు ఆలయ పక్షాన స్వామి అమ్మవార్ల జ్ఞాపికను రాష్ట్ర దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డి అందజేశారు. దేవాలయ ఈఓ గీతారెడ్డి వారికి పట్టు వస్త్రాలను అందించగా దేవుడి ప్రసాదాన్ని అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి అందించారు. పునర్నిర్మాణంలో ఎంత మంది పనిచేశారు? సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు ఆలయ నిర్మాణ ప్రత్యేకతల గురించి ఆలయ ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయిని అడిగి తెలుసుకున్నారు. హొయ సాల, ద్రవిడ, పల్లవ, కాకతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా చేపట్టిన ఆలయ నిర్మాణంలో ఎంత మంది పనిచేశారని సీజేఐ అడగ్గా సుమారు వెయ్యి మంది వరకు కళాకారులు పనిచేసినట్లు ఆనంద్‌సాయి వివరించారు. అష్టభుజి ప్రాకారం, వాలి పిల్లర్లు, అద్దాల మండపం, కాకతీయ పిల్లర్లు, గర్భాలయ గోడలపై ప్రహ్లాద చరిత్ర, మహారాజ గోపురం, ముఖ మండపం, తంజావూర్ పెయింటింగ్స్, గండబేరుండ దేవాలయం, ఆలయంలోని శిల్పాలు, విద్యుత్ దీపాలు, తూర్పు రాజగోపురం నుంచి ఆలయంలోకి వస్తుండగా ఉన్న ఏనుగుల విగ్రహాల వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. మహారాజగోపురం వద్ద జస్టిస్ దంపతులు ఫొటోలు దిగారు. ప్రెసిడెన్షియల్ సూట్స్‌తోపాటు పెద్దగుట్టపై నిర్మితమవుతున్న టెంపుల్ సిటీని సైతం సీజేఐ దంపతులు సందర్శించారు. కాటేజీలను పరిశీలించి, పనితీరును మెచ్చుకున్నారు. పట్టువస్త్రాలు ధరించి సంప్రదాయ రీతిలో స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్న అనంతరం అతిథి గృహం చేరుకొని అల్పాహారం తీసుకున్నారు. -
కేసీఆర్‌పై లగడపాటి ఇంట్రస్టింగ్ కామెంట్స్!
రాజకీయాలకు ప్రస్తుతం దూరంగా ఉన్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. యాదాద్రి ఆలయాన్ని ప్రపంచస్థాయి పుణ్యక్షేత్రంగా మార్చడానికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషి హర్షనీయమని, ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలని పట్టుదలతో ఉన్న సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని ఆయన పొగడ్తల వర్షం కురిపించారు. యాదాద్రి అభివృద్ధి పనులు దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుంటున్నాని, ఇంతకుముందు యాదాద్రి రూపురేఖలు మారబోతున్నాయని మీడియాలో మాత్రమే చూశానని, ఇప్పుడు ప్రత్యక్షంగా తిలకించానని రాజగోపాల్ అన్నారు. ఇంతకుముందు యాదాద్రిని సందర్శించుకున్న తర్వాతే తాను ఎంపీగా గెలిచానని కూడా లగడపాటి చెప్పారు. అయితే.. ఇప్పుడు రాజకీయాల్లోకి మళ్లీ రావడంపై మాత్రం ఆయన స్పందించలేదు. మొత్తమ్మీద చాలాకాలం తర్వాత ఆయన వార్తల్లోకి రావడం విశేషం. యాదాద్రి పర్యటనలో మాజీ ఎంపీ లగడపాటితో పాటు మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి తదితరులు కూడా పాల్గొన్నట్లు తెలిసింది.