కేసీఆర్‌పై లగడపాటి ఇంట్రస్టింగ్ కామెంట్స్!
రాజకీయాలకు ప్రస్తుతం దూరంగా ఉన్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. యాదాద్రి ఆలయాన్ని ప్రపంచస్థాయి పుణ్యక్షేత్రంగా మార్చడానికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషి హర్షనీయమని, ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలని పట్టుదలతో ఉన్న సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని ఆయన పొగడ్తల వర్షం కురిపించారు.
యాదాద్రి అభివృద్ధి పనులు దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుంటున్నాని, ఇంతకుముందు యాదాద్రి రూపురేఖలు మారబోతున్నాయని మీడియాలో మాత్రమే చూశానని, ఇప్పుడు ప్రత్యక్షంగా తిలకించానని రాజగోపాల్ అన్నారు. ఇంతకుముందు యాదాద్రిని సందర్శించుకున్న తర్వాతే తాను ఎంపీగా గెలిచానని కూడా లగడపాటి చెప్పారు. అయితే.. ఇప్పుడు రాజకీయాల్లోకి మళ్లీ రావడంపై మాత్రం ఆయన స్పందించలేదు. మొత్తమ్మీద చాలాకాలం తర్వాత ఆయన వార్తల్లోకి రావడం విశేషం. యాదాద్రి పర్యటనలో మాజీ ఎంపీ లగడపాటితో పాటు మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి తదితరులు కూడా పాల్గొన్నట్లు తెలిసింది.