comments on kcr
-
కేసీఆర్ బయోపిక్‌పై ఆలోచన ఉంది.. కానీ: రామ్ గోపాల్ వర్మ
Ram Gopal Varma About KCR Biopic In Kondaa Movie Trailer Launch 2022: ‘‘నేను విజయవాడలో చదువుకున్నాను. విజయవాడ రౌడీయిజం, రాయలసీమ ఫ్యాక్షనిజం మీద సినిమాలు చేశాను. అయితే తెలంగాణ గురించి నాకు పెద్దగా తెలియదు. కానీ కొండా మురళి, కొండా సురేఖల గురించి తెలుసుకున్నప్పుడు వీరిపై సినిమా తీయాలనిపించి వారిని అడిగాను. తన తల్లిదండ్రుల జీవితాల ఆధారంగా సినిమా కాబట్టి నిర్మాతగా ఉంటానని సుష్మిత అడిగారు. కొండా మురళి, కొండా సురేఖల జీవితాల్లో చాలా విషయాలు ఉన్నప్పటికీ కొంత భాగాన్ని మాత్రమే నేను సినిమాలో చూపించే ప్రయత్నం చేశాను. నేను ఏ బయోపిక్ తీసినా ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా చూపించను. ‘కొండా’ (Kondaa Movie) రెస్పాన్స్‌ను బట్టి ప్రీక్వెల్, సీక్వెల్ ప్లాన్ చేస్తాను. కేసీఆర్‌గారి బయోపిక్ (KCR Biopic) ఆలోచన ఉంది కానీ ఎప్పుడో చెప్పలేను’’ అన్నారు రామ్‌గోపాల్ వర్మ. కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవితం ఆధారంగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘కొండా’. కొండా మురళి పాత్రలో త్రిగుణ్ (అదిత్ అరుణ్), కొండా సురేఖ పాత్రలో ఐరా మోర్ నటించారు. కొండా సుష్మితా పటేల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ సినిమా కొత్త ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం కొండా సుష్మిత మాట్లాడుతూ.. ‘‘రాజకీయ ప్రయోజనాల కోసం ‘కొండా’ సినిమా తీయలేదు. సినిమా తీస్తేనే గెలుస్తారని లేదు. అమ్మానాన్నల (కొండా మురళి, కొండా సురేఖ) ప్రస్థానాలు అంత ఈజీగా సాగలేదు. రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. వీరి కథ అందరికీ తెలియాలనే కొండా సినిమాను నిర్మించాను. అలాగే యువత రాజకీయాల్లోకి రావాలన్నది మరో కారణం’’ అని తెలిపారు. చదవండి: ఈసారి కొట్టా.. చంపేస్తా.. ఆసక్తిగా 'కొండా' రెండో ట్రైలర్.. ‘‘నేను హైదరాబాద్‌లో పెరిగాను. కానీ వరంగల్ గురించి, అక్కడి రాజకీయాల గురించి తెలీదు. ఈ సినిమా ద్వారా తెలుసుకున్నాను. ఇప్పటివరకు 17 సినిమాలు చేశాను. అన్ని సినిమాలు డబ్బులు తీసుకువచ్చాయి’’ అని త్రిగుణ్ పేర్కొన్నాడు. ‘‘సురేఖగారి పాత్రలో నటించగలనని నమ్మి నాకు అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అని ఐరా మోర్ తెలిపింది. -
సీఎం కేసీఆర్‌వి తుగ్లక్ నిర్ణయాలు: బండి సంజయ్
సాక్షి, వరంగల్: ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీల విషయంలో సీఎం కేసీఆర్ తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. వరంగల్‌లోని బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లాస్థాయి బీజేపీ రాజకీయ శిక్షణా తరగతులు గురువారం ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సంజయ్ జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మాట్లాడుతూ రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 36 నెలల్లో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంటే.. సీఎం కేసీఆర్ 36 నెలలుగా ఫాంహౌస్‌లో పడుకొని.. ఆగమేఘాలపై జీఓ 317 జారీ చేసి ఉద్యోగులను గందరగోళానికి గురిచేస్తున్నాడని ఆరోపించారు. స్థానికత కోసం ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే.. అదే స్థానికత పేరుతో ఉద్యోగ, ఉపాధ్యాయులను చీల్చి గోస పుచ్చుకుంటున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన 370 యాక్ట్ వచ్చినట్లు ఉందన్నారు. అనారోగ్యంతో ఉన్న ఉద్యోగులు, భార్యాభర్తల బదిలీల్లో మూర్ఖంగా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, అన్యాయం జరిగిందని అర్జీ పెట్టుకున్నా పరిష్కరించలేని పరిస్థితి నెలకొందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల్లో జరిగిన అన్యాయాన్ని పునః పరిశీలించి అందరికి న్యాయం చేయాలని, 317 జీఓను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఉద్యోగుల పక్షాన ఉద్యమ కార్యాచరణ ప్రకటించక తప్పదని సంజయ్ హెచ్చరించారు. టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాలి.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు టీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ పాలన వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని సంజయ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని కోరారు. రాబోయే సాధారణ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా పనిచేసినప్పుడే పార్టీ నిర్మాణం బలంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగు రాకేశ్‌రెడ్డి, రాష్ట్ర నాయకురాలు బంగారు శ్రుతి, మాజీ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వి.శ్రీ రాములు, జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, జిల్లా మాజీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు డాక్టర్ పెసరు విజయచందర్‌రెడ్డి, నాయకులు చింతాకుల సునీల్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: దేశాన్ని అమ్మకానికి పెట్టి కమ్యూనిస్టులపై విమర్శలా! -
అగ్గి పెడతా.. కేసీఆర్ పార్టీని కూల్చేస్తా
సాక్షి, కమలాపూర్ (వరంగల్): తాను ఒక్క హుజూరాబాద్‌తోనే కొట్లాట ఆపనని, ఉప ఎన్నిక ఫలితాల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి అగ్గి పెట్టి.. కేసీఆర్ పార్టీని కూల్చే ప్రయత్నం చేస్తానని మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ హెచ్చరించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శ్రీరాములపల్లి, అంబాల, నేరెళ్ల, గూడూరు గ్రామాల్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు తన పేరిట నాలుగు దొంగ ఉత్తరాలు పుట్టించారని, దళితబంధు వద్దు.. అని సృష్టించిన లేఖపై ఎన్నికల కమిషన్, టీఆర్ఎస్ చెంప చెళ్లుమనిపించిందని అన్నారు. అలాగే తాను కేసీఆర్‌కు భయపడి వాళ్ల కాళ్ల మీద పడి క్షమించమని కోరుతూ ఉత్తరం రాసినట్లు మరో దొంగ లేఖ పుట్టించారని, తాను చచ్చినా ఎవరి ముందు మోకరిళ్లనని స్పష్టంచేశారు. గతంలో గ్యాంగ్‌స్టర్ నయీం చంపిస్తానంటేనే బెదిరిపోలేదని, ఇప్పుడు కూడా కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడబోనని పేర్కొన్నారు. ‘కేసీఆర్! నువ్వు కాదు కదా.. నీ జేజమ్మ వచ్చినా ఇక్కడ గెలవలేరు. ఇక్కడ ఉన్న నా అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లు పద్దెనిమిదిన్నర ఏళ్లుగా నన్ను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నారు. నన్ను గుండెల్లో పెట్టుకున్నోళ్లు.. నీ సారా సీసాలకు, డబ్బు సంచులకు లొంగిపోరు, బెదిరింపులకు, నీ పోలీసు రాజ్యానికి భయపడరు. ఇది చైతన్యవంతమైన హుజూరాబాద్’అని అన్నారు. కేసీఆర్ కుట్రలను, కుతంత్రాలను ఛేదించి ఈ నెల 30న హుజూరాబాద్ ప్రజలు ఆత్మగౌరవ బావుటా ఎగురవేస్తారన్నారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సదానందంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఈటల మోసానికి.. గెల్లు విధేయతకు మధ్య పోటీ -
Bandi Sanjay: కేసీఆర్‌వన్నీ మోసపూరిత హామీలే
సాక్షి, కామారెడ్డి(నిజామాబాద్): ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చేవన్నీ మోసపూరిత హామీలేనని, ప్రజలకు ఆయన చేసిందేమి లేదని కేంద్రమంత్రి భగవంత్ ఖుబా విమర్శిం చారు. శనివారం ఆయన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మాటతప్పారని, అలాగే దళితులకు మూడె కరాల భూమి, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి.. ఇలా ఎన్నో హామీలిచ్చి మోసం చేశారని ఆరోపించారు. బండి సంజయ్ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నారని, కానీ సీఎం కేసీఆర్ తన కొడుకు, కూతురు, అల్లుడి కోసం పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌కు సాగనంపాలన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్మల్ సభలో మత విద్వేషాలు రగిల్చేలా మాట్లాడారంటూ టీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు మాట్లాడితే మత విద్వేషాలను రెచ్చగొట్టినట్టా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార తదితరులు పాల్గొన్నారు. డ్రోన్ కెమెరా తగిలి సంజయ్‌కు గాయం పాదయాత్రలో స్వల్ప అపశ్రుతి చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిలో సభ ముగిసిన తరువాత హజీపూర్ తండా వద్ద గిరిజనులు ఆయనకు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. ఈ సమయంలో పూలు డ్రోన్ కెమెరాపై పడటంతో అది ఆగిపోయి కిందికి జారింది. ఈ క్రమంలో డ్రోన్ కెమెరా, సంజయ్ నుదిటిపై నుంచి రాసుకుంటూ వెళ్లింది. దీంతో ఆయనకు చిన్న గాయమైంది. ఒక్క క్షణం అందరూ ఆందోళనకు గురైనా, పెద్దగా ఇబ్బంది లేకపోవడంతో తేరుకున్నారు. అనంతరం పాదయాత్ర యథావిధిగా కొనసాగింది. చదవండి: బెదిరిస్తే.. భయపడేదే లేదు: రేవంత్‌రెడ్డి -
MP Aravind: ఆయనో తుగ్లక్ ముఖ్యమంత్రి
సాక్షి, లింగంపేట(నిజామాబాద్): రాష్ట్రంలో హిందూ సాంప్రదాయాలను ఒవైసీకి తాకట్టు పెట్టిన కేసీఆర్ తుగ్లక్ ముఖ్యమంత్రి అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ధ్వజమెత్తారు. హిందూ మతాన్ని తొక్కేస్తున్నాడని, ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడని విమర్శించారు. లింగంపేట లో మంగళవారం నిర్వహించిన బీజేపీ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ అర్వింద్ ప్రసంగించారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని, ఈ పాలన చూసి, టీఆర్ఎస్రే ఢిల్లీలోని తుగ్లక్ గల్లీలో స్థలం కేటాయించారని ఎద్దేవా చేశారు. హిందువులంతా ఏకం కావాలి.. హిందువులంతా ఏకం కావాలని, హిందూ రాష్ట్ర స్థాపనే కర్తవ్యంగా పని చేయాలని సూచించారు. అయోధ్యలో శ్రీరామ మందిరం కట్టే వారికే మద్దతు పలకాలని కోరారు. రాష్టంలో బీజేపీ బలపడుతుండడంతో కేసీఆర్‌కు మింగుడు పడడం లేదన్నారు. ఈటలదే గెలుపు.. పార్టీ జెండా మోసిన వారిని బయటకు పంపడం కేసీఆర్‌కు అలవాటేనని, 20 ఏళ్లు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన ఏనుగు రవీందర్‌రెడ్డి, ఈటల రాజేందర్‌లను పార్టీ నుంచి బయటకు పంపించాడన్నారు. ఇరువురు నిఖార్సయిన నాయకులు బీజేపీలోకి రావడం సంతోషకరమని చెప్పారు. హుజూరాబాదులో రూ.200 కోట్లు కాదు కదా.. రూ.2 వేల కోట్లు ఖర్చు పెట్టినా ఈటలను ఓడించలేరన్నారు. భారీ మెజారిటీతో ఈటల గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. గులాబీ జెండా కాలుష్యమైందని, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆలోచించుకోవాలని సూచించారు. వీళ్లేమైనా సక్కగున్నారా? పసుపుబోర్డు విషయంలో నానా యాగీ చేస్తున్నారని ఎంపీ ధ్వజమెత్తారు. బోర్డు కోసం ప్రధాని మోదీ వద్దకు రైతులను తీసుకెళ్లానని, బోర్డుకు మించి మెరుగైన వ్యవస్థను తీసుకొచ్చానని చెప్పారు. కేంద్రం బడ్జెట్లో రూ.30 కోట్లు కేటాయించిందని, పసుపు ఎగుమతులు పెంచి దిగుమతులు తగ్గించినట్లు తెలిపారు. పసుపుబోర్డు గురించి తన గుండుపై కామెంట్లు చేశారని, కేసీఆర్ కుటుంబంలో చక్కగా ఉన్న ముఖాలు ఒక్కటైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. దొడ్డుబియ్యం కొనబోమని చెప్పలేదు.. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడానికి సీఎం కేసీఆర్ కూడా కారణమని అర్వింద్ విమర్శించారు. పెరిగిన ధరల్లో 30 శాతం మేర రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ రూపంలో వసూలు చే స్తోందని, ఆ మొత్తాన్ని కేసీఆర్ తీసుకోకుండా ఉంటే పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయ ని చెప్పారు. కేంద్రం దొడ్డు బియ్యం కొనమని ఎక్కడా చెప్పలేదని, కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి రావడం ఖాయం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, వంద సీట్లలో గెలుస్తామని అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంట్, తొమ్మిది అసెంబ్లీ స్థానాలు గెలిచి తీరతామన్నారు. జిల్లాలో టీఆర్ఎస్లో కవిత, కాంగ్రెస్‌లో షబ్బీర్ అలీ ఒక్కరే మిగులుతారన్నారు. బీజేపీలో గెలిచే గుర్రాలకే టికెట్లు వస్తాయని, కార్యకర్తలు జవాబుదారీగా పని చేయాలని సూచించారు. బండి సంజయ్ పాదయాత్ర ఎల్లారెడ్డి నియోజక వర్గంలో నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని, ఆయన యాత్రను విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, పార్టీ నేతలు ఏనుగు రవీందర్‌రెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి, బాపురెడ్డి, కృష్ణారెడ్డి, రాంరెడ్డి, మాల్యాద్రిరెడ్డి, మురళి, దత్తురాం, రాంచందర్ పాల్గొన్నారు. చదవండి: బ్లాక్‌మెయిలింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ -
RS Praveen kumar: సీఎంగా కేసీఆర్ ఏడేళ్లు ఏం చేశారు..?
సాక్షి, ఆదిలాబాద్: బహుజనులు రాజ్యాధికారం సాధించే దిశగా ఇప్పటి నుంచే గ్రామాలకు వెళ్లి ప్రచారం చేపట్టాలని మాజీ ఐపీఎస్ అధికారి, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న ఆయన శనివారం ఆదిలాబాద్‌కు వచ్చారు. అర్అండ్బీ అతిథి గృహంలో ఉమ్మడి ఆది లాబాద్ జిల్లాలోని బీఎస్పీ నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కుమ్మరివాడకు వెళ్లి కుండలు తయారు చేసే విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. భుక్తపూర్ కాలనీకి వెళ్లి కావేరి, మహిపాల్ దంపతులతోపాటు పలువురు మేదరులతో మాట్లాడారు. తర్వాత జనార్దన్‌రెడ్డి గార్డెన్లో ఏర్పాటు చేసిన బీఎస్పీ నాయకులు, కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షీరాం, మహాత్మా జ్యోతిబా ఫులే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివిధ పార్టీలను వదిలి బీఎస్పీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ రెండేళ్ల తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోని పేదల రాజ్యం రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. బాంచన్ బతుకుల కాలం పోయిందని, గులాబీ తెలంగాణ నీలి తెలంగాణగా మారుతుందని పేర్కొన్నారు. దళితుల అభివృద్ధి విషయంలో సీఏం కేసీఆర్ ఏడేళ్లు ఎందుకు పథకాలను అందించకుండా నిద్రపోయారని ప్రశ్నించారు. దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి ఇస్తానని కేవలం 10 వేల మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. శ్మాశనవాటికలు, రైతు వేదికలు, ఇతర భవనాలను నిర్మించేందుకు అసైన్డ్ భూములను గుంజుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోవడంతో నిరుద్యోగులు కులవృత్తులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారన్నారు. సమావేశంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ మంద, కోఆర్డినేటర్ గంగాధర్, జిల్లా ఇన్చార్జి మెస్రం జంగుబాపు, తదితరులు పాల్గొన్నారు. చదవండి: పదేళ్ల క్రితం అదృశ్యం: పుట్టింటికి రప్పించిన రాఖీ పండుగ -
తెలంగాణను టీఆర్ఎస్ పార్టీ హైజాక్ చేసింది..
సాక్షి, కరీంనగర్‌టౌన్: సీమాంధ్రుల పాలన నుంచి విముక్తి కల్పించి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ బంగారు తెలంగాణ పేరుతో హైజాక్ చేసిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆరోపించారు. బుధవారం నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రజాసంగ్రామ యాత్ర కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వ భూములు అమ్మి హుజూరాబాద్‌లో తన పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పథకాలు అమలు చేస్తుండటం సిగ్గుచేటన్నారు. ప్రజా అవసరాలపై నిరంతరం దృష్టి సారించాల్సిన అధికారులను కార్యకర్తల్లా మార్చుకొని, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో పని చేయిస్తుండటం శోచనీయమన్నారు. ప్రభుత్వ అవినీతి అక్రమాలపై ప్రచారం చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తూ, పోలీసులతో బెదిరింపులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఈనెల 28 నుంచి చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చదవండి: Malla Reddy Vs Revanth Reddy: తొడగొట్టి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన మంత్రి మల్లారెడ్డి -
Bandi Sanjay: కేసీఆర్ కోటను ఢీకొడతాం
సాక్షి,సూర్యాపేట(నల్లగొండ): ప్రజల త్యాగం, విద్యావంతుల పోరాటం, వందల మంది విద్యార్థుల ఆత్మబలిదానంతో సాధించుకున్న తెలంగాణలో నియంత మాదిరిగా గడీల పాలన చేస్తున్న కేసీఆర్ కోటను బద్దలు కొట్టడం తెలంగాణ ముఖద్వారమైన కోదాడ నుంచే ప్రారంభమైందని బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గురువారం కోదాడలోని రంగా థియేటర్ సెంటర్లో, సూర్యాపేట పట్టణంలోని వాణిజ్యభవన్ సెంటర్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేపట్టిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ హామీలతో ప్రజలను మోసం చేస్తూ ఎన్నికల్లో నెగ్గుతున్న సీఎంకు త్వరలో జరగబోయే హూజూరాబాద్ ఎన్నికల్లో ప్రజలు తగినబుద్ది చెపుతారని అన్నారు. 2023 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపి అధికారంలోకి వస్తుందని, ఆ సంవత్సరం స్వాతంత్య్ర వేడుకల్లో గోల్కొండ కోటపై బీజేపీ సీఎం జాతీయజెండాను ఎగుర వేయడం ఖాయమని ఆయన అన్నారు. బీజేపిలో కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని, దానికి కిషన్‌రెడ్డి ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పారు. సామాన్య కార్యకర్త నుంచి 130 కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించే కేంద్ర మంత్రి స్థాయికి ఆయన ఎదగడం తెలంగాణ ప్రజల విజయమని అన్నారు. కోదాడ పక్క నియోజకవర్గమైన హుజూర్‌నగర్‌లో ఉప ఎన్నికల సమయంలో రూ.100 కోట్ల హామీలు ఇచ్చిన పెద్దలు.. ఒక్క రూపాయి పని కూడా చేయలేదని, అక్రమ డబ్బుతో గెలిచిన అక్కడి టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు గుర్రంబోడు గిరిజనుల భూములు ఆక్రమించారని అన్నారు. ఇదేమిటని ప్రశ్నించిన గిరిజనులపై పోలీసుల ద్వారా లాఠీచార్జీ చేయించి, జైళ్ల పాలు చేసిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఉప ఎన్నికలు రాగానే దళితబంధు అంటూ మాయమాటలు చెపుతున్నాడని, ప్రజలు వాటిని నమ్మవద్దని ఆయన కోరారు. తెలంగాణ రాగానే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పాడని, వాటి సంగతి ఏంటో ఇప్పుడు దళితులు నిలదీయాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన సీఎం ఆయన ఇంటిలో అందరికి ఉద్యోగాలు ఇప్పించుకున్నాడని విమర్శించారు. ప్రజలు అండగా ఉండాలి తెలంగాణా ప్రజలు టీఆర్ఎస్ మోసపూరిత మాటల్లో పడకుండా బీజేపీ ప్రభుత్వానికి అండగా ఉండాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ ప్రజల కోసమే ప్రధాని కిషన్‌రెడ్డికి కేబినెట్ హోదా ఇచ్చారని అన్నారు. సూర్యాపేట జిల్లాలో ఉర్లుగొండతో పాటు, ఫణిగిరి బౌద్ధక్షేత్రం, పిల్లలమర్రి దేవాలయం లాంటి ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వాటిని పర్యాటక మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డికి తెలిపి అభివృద్ధి పరిచేలా చూస్తామన్నారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కేసీర్, రేవంత్‌రెడ్డి వేరు కాదని.. ముగ్గురూ ఒక్కటేనని అన్నారు. ఈ సభల్లో ప్రేమేందర్‌రెడ్డి, రజనీకుమారి, బొబ్బ భాగ్యారెడ్డి, కడియం రాంచంద్రయ్య, సలిగంటి వీరేంద్ర, వెంకట్‌రెడ్డి, పల్స మల్సూర్‌గౌడ్, కార్తీక్‌రెడ్డి, మంగ్తానాయక్, మీర్ ఆక్బర్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం కేసీఆర్‌ది రాజకీయ వ్యభిచారం
సాక్షి, ఇల్లందకుంట(కరీంనగర్): నాయకులను కొనుగోలు చేస్తూ సీఎం కేసీఆర్ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ విమర్శించారు. ఇల్లందకుంట మండలంలోని సీతారామ చంద్రస్వామి దేవాలయంలో మంగళవారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ ఒక్కడి వల్లే రాష్ట్రం ఏర్పాటు కాలేదని, అమరుల త్యాగాలను చూసి చలించిన సోనియాగాంధీ మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చారన్నారు. నేడు రాష్ట్ర అప్పులు రూ.4 లక్షల కోట్లకు పైగా ఉన్నాయని తెలిపారు. కేసీఆర్ రూ.వేల కోట్లు కమీషన్ తీసుకొని, ఆంధ్రావాళ్లకు ప్రాజెక్టుల కాంట్రాక్టులు ఇచ్చారని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీలు నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. సీఎం అభద్రతా భావంతో దళితులను ప్రగతి భవన్‌కు పిలిపించుకొని, నాటకాలు ఆడుతున్నారని అన్నారు. మొన్నటివరకు కాంగ్రెస్ నేతగా ఉన్న కౌశిక్‌రెడ్డి కోవర్టుగా పనిచేసి, టీఆర్ఎస్లోకి వెళ్లారని పేర్కొన్నారు. కొద్ది రోజుల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిని నిలబెడతామని, నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్‌ను గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, నరేందర్ రెడ్డి, మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాస్, శ్రీరాంచక్రవర్తి తదితరులున్నారు. మంత్రిగా ఈటల చేసిందేమీ లేదు జమ్మికుంట(హుజూరాబాద్): ప్రత్యేక రాష్ట్రంలో రెండుసార్లు మంత్రిగా ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలంగాణ సామాజానికి చేసిందేమీ లేదని టీపీసీసీ ఎన్నికల ఇన్చార్జి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఆరోపించారు. మంగళవారం సాయంత్రం జమ్మికుంట పట్టణంలోకి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈటల ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 8 వేల వైద్యుల పోస్టులు ఖాళీగా ఉంటే ఎందుకు చేయలేదని, కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనన్నారు. దళిత సీఎం హామీని సీఎం కేసీఆర్ విస్మరించారని, హుజూరాబాద్ ఉపఎన్నికలో ఆయనకు గుణపాఠం చెప్పాలని కోరారు. -
‘కుట్రలు చేస్తే ప్రజలు బొంద పెడతారు’
సాక్షి, ఇల్లందకుంట(కరీంనగర్): కుట్రలు, కుతంత్రాలు చేస్తే తెలంగాణ ప్రజలు బొందపెడతారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రజాదీవెనయాత్రలో భాగంగా ఆరోరోజు శనివారం ఇల్లందకుంట, మల్యాల, లక్ష్మాజీపల్లి, వాగుఒడ్డు రామన్నపల్లి, కనగర్తి గ్రామాల్లో పాదయాత్ర చేశారు. ఈటల మాట్లాడుతూ.. గతంలో ఆర్థిక మంత్రిగా, ఆరోగ్యశాఖ మంత్రిగా మంచి పేరొస్తోందని కుట్రపన్ని, కొత్త మందికి డబ్బులు ఇచ్చి దరఖాస్తు తీసుకుని మంత్రివర్గం నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీ నాయకులనే అంగట్లో పశువుల్లాగా కొనుగోలు చేస్తున్నారని అన్నారు. డబ్బుల సంచులకు కాలం చెల్లిపోయిందని నిరూపించే ఎన్ని కలివి అని పేర్కొన్నారు. అధికారులు ప్రభుత్వ ఒత్తిడికి లొంగి తమ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈటల పాదయాత్రలో కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ పాల్గొని సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కంకణాల శ్రీలత, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి క్రిష్ణారెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రే మేందర్ రెడ్డి, ఎన్నికల ఇన్చార్జీ జితేందర్‌రెడ్డి, చాడసురేశ్‌రెడ్డి,బొడిగె శోభ, తులఉమ పాల్గొన్నారు. మానవమృగం ముఖ్యమంత్రి మానకొండూర్: రాష్ట్ర ముఖ్యమంత్రి మానవత్వం లేని మృగమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ అన్నారు. మానకొండూర్ మండలంలోని గట్టుదుద్దెనపల్లిలో ఇటీవల కురిసిన వర్షాలతో దెబ్బతిన్న వరిపంటను పరిశీలించారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. అయినా ఏ ఒక్క కుటుంబాన్ని ఆదుకోలేదని మండిపడ్డారు. పసల్‌బీమాను అమలు కానివ్వడని అన్నారు. గంగిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ జిల్లా కార్యదర్శి రంగుభాస్కరాచారి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా పరామర్శించారు. కొండపల్కలలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రాల వెంకటరెడ్డి తల్లి మృతి చెందగా పరామర్శించారు. జిల్లా అధ్యక్షుడు గంగాడి క్రిష్ణారెడ్డి, కటకం మృత్యుంజయం, మండల అధ్యక్షుడు రాపాక ప్రవీణ్, నాయకులు సోన్నాకుల శ్రీనివాస్, దుర్గం శ్రీనివాస్, ప్రదీప్‌యాదవ్, శ్రీనివాస్, తదితరులు ఉన్నారు. -
ముఖ్యమంత్రి కుర్చే కేసీఆర్‌కు ముఖ్యం..
సాక్షి, ఇల్లందకుంట(కరీంనగర్): అధికారం, ముఖ్య మంత్రి కుర్చే కేసీఆర్‌కు ముఖ్యమని, దానికోసం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేయడానికైనా వెనుకడడని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రజాదీవెన పేరిట చేపట్టిన పాదయాత్ర గురువారం నాల్గో రోజు ఇల్లందకుంట మండలం సీతంపేట, వనతడుపుల, బుజూనూర్‌తోపాటు జమ్మికుంట మండలం నగురం, వావిలాలలలో నిర్వహించారు. ఈసందర్భంగా పలు చోట్ల ఈటల మాట్లాడుతూ తాను వాస్తవంగా ఎమ్మెల్యేకు రాజీనామా చేయలేదని.. వాళ్లే రాజీనామా చేయమని అడిగితే చేశానని అన్నారు. పార్టీని వదిలిపెట్టేలా చేశారని తెలిపారు. 18 ఏళ్లపాటు ఉద్యమాన్ని నడిపి జైళ్లో ఉన్న వ్యక్తినని.. మంత్రినయ్యాక కూడా కేసుల కోసం విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని గంటలకొద్ది కోర్టుల దగ్గర గడిపానని అన్నారు. మొక్కజొన్నలు రూ. 1300–1350లకు అమ్ముకొని దాదాపు క్వింటా కు 600 చొప్పున ఎకరానికి రూ.15 వేలు నష్టపోయారని తెలిపారు. రైతుబంధు పేరిట రూ. 5 వేలు ఇచ్చి మొక్కజొన్నలకు రూ.15 వేలు నష్టం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే బిడ్డను, తెలంగాణ నిఖార్సైన బిడ్డను ఆశీర్వదించాలని కోరారు. నోట్ల కట్టలతో నాయకులను, సంఘాలను కొనుగోలు చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు ఎన్ని చేసిన ప్రజలు తమ పక్షానే ఉన్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు బొడిగె శోభ, ధర్మారావు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, చాడ సురేశ్‌రెడ్డి, మహిపాల్‌యాదవ్ పాల్గొన్నారు. -
‘అవినీతిలో నంబర్‌వన్ సీఎం కేసీఆర్’
సాక్షి, జన్నారం(కరీంనగర్): దేశంలోనే అవినీతిలో నంబర్‌వన్‌గా తెలంగాణ సీఎం కేసీఆర్ నిలుస్తారని, అవినీతి అంతం కావాలంటే రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌ను గద్దె దించాలని మాజీ ఎంపీ, బీజేపీ కోర్‌కమిటీ సభ్యుడు గడ్డం వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పైడిపల్లి ఫంక్షన్ హాలులో రాథోడ్ రమేశ్ ఆధ్వర్యంలో బీజేపీ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వివేక్‌వెంకటస్వామి మాట్లాడుతూ హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం కేసీఆర్‌కు దళితులపై ప్రే పుట్టుకొచ్చిందని విమర్శించారు. 45 వేల మంది దళితుల ఓట్ల కోసం కపట ప్రేమ నటిస్తున్నారని పేర్కొన్నారు. జన్నారం మండలం కవ్వాల్, కలమడుగు, రోటిగూడ, చింతలపల్లి, పొనకల్, చింతగూడ, తదితర గ్రామాలకు చెందిన ముగ్గురు ఎంపీటీసీలు, సర్పంచు, వర్గక సంఘం అధ్యక్షుడు మారుతితోపాటు సుమారు 500 మంది మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ సమక్షంలో బీజేపీలో చేరారు. వివేక్ వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు వెర్రబెల్లి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు జోగుల శ్రీదేవి, జిల్లా ఇన్చార్జి పల్లె గంగాధర్, జన్నారం మండల ఇన్చార్జి తుల శ్రీనివాస్, మండల అధ్యక్షుడు గోలి చందు, ప్రధాన కార్యదర్శి ఎరుకల రమేశ్‌గౌడ్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు మహేశ్, తదితరులు పాల్గొన్నారు. చదవండి: సాక్షి కథనం: మానవత్వం చాటుకున్న మెజిస్ట్రేట్ -
కేసీఆర్ ప్రభుత్వం కొనసాగడం రాష్ట్రానికే అరిష్టం..
సాక్షి, జమ్మికుంట(కరీంనగర్): కేసీఆర్ ప్రభుత్వం కొనసాగడం రాష్ట్రానికే అరిష్టమని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం జమ్మికుంటలో ని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. సీఎం కేసీఆర్ కుట్రదారుడని, మోసగాడని, అతనికి ప్రజలపై ప్రేమ లేదని ఆరోపించారు. దళితులపై ప్రేమ ఉంటే వారికి జనాభా ప్రాతిపదికన మంత్రి వర్గంలో పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం చెప్పిందే తప్ప మంత్రుల అభిప్రాయాలకు విలువ లేదని అన్నారు. ఇంటెలిజెన్స్ పోలీసులా.. టీఆర్ఎస్ కార్యకర్తలా అంటూ ఘాటుగా విమర్శించారు. ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలిస్తేనే ధర్మం గెలుస్తుందని ప్రజల్లో చర్చ జరుగుతోందని తెలిపారు. నియోజకవర్గంలో తిరుగుతున్న మంత్రులు సమావేశాల్లో, సభలో నిధులు ఇస్తామని, భవనాలు కట్టిసామని ప్రజలకు హామీలు ఇస్తున్నారని.. మొత్తం రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ‘నాగార్ణున సాగర్ ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని.. హుజూరా బాద్ మీ జాగీర్ కాదు’ అని అన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్‌రావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీలో చేరిక మోత్కులగూడెంకు చెందిన యువకులు, స్వాతి గార్డెన్ సమీపంలోని అపార్ట్మెంట్లో నివాసం ఉండే మహిళలు, యువకులు బీజేపీలో చేరా రు. నాయకులు రాజేందర్‌రెడ్డి, రమేష్, సంపత్‌రావు, మల్లేశ్, పురపాలక సంఘం మాజీ చైర్మన్ శ్రీనివాస్, కోటి తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఎన్టీఆర్ భవన్ లీజును రద్దు చేయండి -
Etela Rajender: కేసీఆర్ పతనం కావడానికి హుజూరాబాద్ వేదిక కావాలి
సాక్షి, వీణవంక (కరీంనగర్): ‘రాష్ట్రంలో అధికారులను కూడా బానిసలుగా మార్చారు. మీ ప్రాప్తం లేకుండా వారికి మంచి పదవి కూడా రాని పరిస్థితి నెలకొంది. బానిసలుగా మారితే తప్పా పోస్టింగ్‌లు రాని దుస్థితి రాష్ట్రంలో నెలకొంది’ అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ తీరుపై ధ్వజమెత్తారు. వల్బాపూర్ గ్రామం నుంచి గంగారం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చల్లూరులో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకొని.. ఓటు మాత్రం తనకు వేయాలని కోరారు. 20 ఏళ్లలో ఎప్పుడూ గొడవలకు తావు లేదని.. ఎప్పుడైనా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకున్నామని తెలిపారు. ఈసారి సీఎం కేసీఆర్ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వృత్తి ధర్మాన్ని పక్కనపెట్టి కొంత మంది బానిసలుగా మారారని.. మండలానికి ఒకరి చొప్పున ఐదు మంది మంత్రులు, గ్రామానికి ఒక ఎమ్మెల్యే లెక్క గొర్ల మంద మీద తోడేలు పడ్డటు పడుతున్నారని విమర్శించారు. ఇంత దౌర్భాగ్యం దేశంలో ఎక్కడైన ఉందా అని ప్రశ్నించారు. కొంతమంది కురుస నాయకులు పోయినంత మాత్రాన పోయేది లేదని, హుజూరాబాద్‌లో ఏం జరుగుతోందని అమెరికాలో ఉన్నవారు, దేశవ్యాప్తంగా ఉన్నవారు చూస్తున్నారని పేర్కొన్నారు. ఆత్మగౌరవం దక్కించుకోవాలని అందరూ చూస్తున్నారని.. అందుకే కమలం గుర్తుకు ఓటు వేయాలని కో రారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అ«ధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. జమ్మికుంటలో ఘన స్వాగతం జమ్మికుంట: జమ్మికుంటలో మంగళవారం బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. గాంధీచౌరస్తా వద్ద ముస్లిం మహిళలు స్వాగతం పలికారు. అనంతరం ఈటల గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో పురపాలక సంఘం వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెళ్లి సంపత్‌రావు, పట్టణ అధ్యక్షుడు జీడీ మల్లేశ్, నాయకులు పాల్గొన్నారు. చదవండి: వైఎస్సార్ చేయూతతో కోటి మందికి మేలు -
కేసీఆర్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుంది
-
‘డబుల్’ పథకం ఓ వరం
రఘునాథపాలెం : డబుల్ బెడ్రూం పథకం పేద ప్రజలందరికీ ఓ వరంగా ఉందని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం రఘునాథపాలెం మండలంలోని శివాయిగూడెంలో తొలి విడతగా పూర్తయిన 218 డబుల్ బెడ్రూం ఇళ్లను 166 మంది లబ్ధిదారులకు కేటాయించగా, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పాపాలాల్‌తో కలిసి ఎమ్మెల్యే అజయ్‌కుమార్ ప్రాంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అజయ్‌కుమార్ మాట్లాడుతూ ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నారు. 2016లో జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి నగరంలో అత్యధికంగా పేదలు ఉన్నారని, వారందరికి 2 వేల ఇళ్లను మంజూరు చేశారన్నారు. తొలి విడతగా ఖమ్మం నియోజకవర్గానికి కేటయించిన ఇళ్లు పలు నిర్మాణాల్లో ఉన్నాయన్నారు. శివాయిగూడెంలో చేపట్టిన ఇళ్లు పూర్తి చేసుకోవటంతో రెవెన్యూ అధికారులు ఎంపికను పారదర్శకంగా చేపట్టారన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శ్రీలతను, ఆర్వీఎం అధికారి రవికుమార్‌లను ఎమ్మెల్యే అభినందించారు. వచ్చే ఏడాది కల్లా నియోజకవర్గానికి కేటాయించిన 2 వేల ఇళ్లను పూర్తి చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలను కొనసాగిస్తామన్నారు. శివాయిగూడెంలో పూర్తయిన 216 ఇళ్లను నగర పరిధిలో 2, 3, 4, 56 డివిజన్లకు కేటాయించటం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శ్రీలత, కార్పొరేటర్లు చావా నారాయణ, కొనకంచి సరళాప్రసాద్, మందడపు మనోహర్, ఎస్.వెంకన్న, నాగండ్ల కోటి, ఆత్కూరి హనుమాన్, కమర్తపు మురళీ, పగడాల నాగరాజు, రైతు సమితి జిల్లా సభ్యులు మందడపు సుధాకర్, ఏఎంసీ మాజీ వైస్‌చైర్మన్ మందడపు నర్సింహారావు, ఆత్మ చైర్మన్ మెంటెం రామారావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మద్దినేని వెంకటరమణ, టీఆర్ఎస్ నాయకులు దండా జ్యోతిరెడ్డి, నర్రా యల్లయ్య, హెచ్చు ప్రసాద్, షేక్ మహ్మద్, శివాయిగూడెం గ్రామ టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు సిద్దయ్య, రవి, చెరుకూరి ప్రదీప్, శివాయిగూడెం సర్పంచ్ బాణోతు నాగమణి, నాగేశ్వరరావు, మాదగాని సుదర్శన్‌రావు, సుంకర వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ నిజ స్వరూపం చూపిస్తున్నారు..
సాక్షి, జగిత్యాల : అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ నిజస్వరూపం చూపుతున్నారని తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ విమర్శించారు. అసెంబ్లీలో జరుగుతున్నపరిణామాలపై ఆయన జగిత్యాలలో గురువారం మీడియాతో మాట్లాడుతూ...‘ కేసీఆర్ దళితులను దగా చేస్తున్నారు. టీఆర్ఎస్ అనుచరుల కోసమే ప్రాజెక్టుల అంచనాలు పెంచారు. అడ్డగోలు భూసేకరణ చేసి రైతులను మోసం చేశారు. ప్రగతి భవన్ పైరవీ కారులకు అడ్డాగా మారింది. మంత్రులకు అపాయింట్మెంట్ దొరకదు కానీ, దొంగలకు మాత్రం దొరుకుతుంది’ అన్నారు. -
కేసీఆర్‌పై లగడపాటి ఇంట్రస్టింగ్ కామెంట్స్!
రాజకీయాలకు ప్రస్తుతం దూరంగా ఉన్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. యాదాద్రి ఆలయాన్ని ప్రపంచస్థాయి పుణ్యక్షేత్రంగా మార్చడానికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషి హర్షనీయమని, ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలని పట్టుదలతో ఉన్న సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని ఆయన పొగడ్తల వర్షం కురిపించారు. యాదాద్రి అభివృద్ధి పనులు దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుంటున్నాని, ఇంతకుముందు యాదాద్రి రూపురేఖలు మారబోతున్నాయని మీడియాలో మాత్రమే చూశానని, ఇప్పుడు ప్రత్యక్షంగా తిలకించానని రాజగోపాల్ అన్నారు. ఇంతకుముందు యాదాద్రిని సందర్శించుకున్న తర్వాతే తాను ఎంపీగా గెలిచానని కూడా లగడపాటి చెప్పారు. అయితే.. ఇప్పుడు రాజకీయాల్లోకి మళ్లీ రావడంపై మాత్రం ఆయన స్పందించలేదు. మొత్తమ్మీద చాలాకాలం తర్వాత ఆయన వార్తల్లోకి రావడం విశేషం. యాదాద్రి పర్యటనలో మాజీ ఎంపీ లగడపాటితో పాటు మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి తదితరులు కూడా పాల్గొన్నట్లు తెలిసింది. -
'బాబు వేసే హెరిటేజ్ బిస్కట్లను రేవంత్ తింటూ..'
కరీంనగర్ సిటీ: 'ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు విసిరే హెరిటేజ్ బిస్కట్లను తింటూ తెలంగాణ ఉద్యమకారులపై నోరు పారేసుకుంటున్నాడని, అర్థంలేని వ్యాఖ్యలు చేస్తే నాలుక కోసే రోజొస్తది' అని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ టీడీపీ నేత రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. గురువారం కరీంనగర్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓటుకు నోటు వ్యవహారంలో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన దొంగల ముఠా సభ్యుడు రేవంత్ అని ధ్వజమెత్తారు. బెయిల్‌తో ఏదో సాధించినట్లు నిస్సిగ్గుగా ఊరేగింపు చేశాడన్నారు. తెలంగాణ సాధించాడా, స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నాడా... ఎందుకు ఈ అట్టహాసమని ప్రశ్నించారు. ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను రేవంత్ చదివారని, ప్రతి మాటకు ఏపీ సీఎం చంద్రబాబుదే బాధ్యతని అన్నారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఒంటికాలుమీద లేచే మేధావులు, మీడియా ఎందుకు రేవంత్ బాషపై మాట్లాడడం లేదన్నారు. తెలంగాణలోనే కాదు ఏపీలోనూ టీడీపీ భూస్థాపితం కాక తప్పదన్నారు. -
టీజీఓ అధ్యక్షురాలి పేరుతోనకిలీ ఫేస్బుక్ అకౌంట్
ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కామెంట్స్ సైబర్ క్రైమ్‌కు మమత ఫిర్యాదు సీఎంకు వివరణ ఇచ్చిన బాధితురాలు కుత్బుల్లాపూర్: తన పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి, అందులో రాజకీయ సంబంధ విషయాలపై కామెంట్లు పెట్టారని కుత్బుల్లాపూర్ ఉప కమిషనర్, టీజీఓ రాష్ట్ర అధ్యక్షురాలు వంకాయలపాటి మమత సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు మమత ‘సాక్షి’కి తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం మమత పేరుపై ఉన్న ఫేస్బుక్ అకౌంట్లో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ‘‘ బీసీగా పుట్టడమే నేను చేసినా నేరమా..!’’ అన్న క్యాప్షన్ పెట్టి దానికి కామెంట్‌గా టీఆర్ఎస్ నిరంకుశ పాలనకు ఇది నిదర్శనమని, కేసీఆర్ పాలన విమర్శిస్తూ కామెంట్లు మమత పెట్టినట్లుగా పోస్ట్ చేశారు. ఈ విషయం మమత చెవిన పడింది. వెంటనే అప్రమత్తమై ఆమె తన పేరుపై ఎవరో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి ఈ విధంగా కామెంట్లు చేస్తున్నారని గుర్తించారు. అప్పటికే సీఎం క్యాంప్ కార్యాలయానికి ఈ కామెంట్ విషయం వెళ్లింది. దీనిపై ఆమెను సీఎం క్యాంప్ కార్యాలయం వివరణ కోరగా... తనకు సంబంధం లేని ఫేస్బుక్ అకౌంట్లో ఇలా కామెంట్లు వచ్చాయని తెలిపారు. అదేరోజు రాత్రి ఆమె సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిసి జరిగిన విషయం చెప్పగా ఆయన వెంటనే ఈ విషయంపై దర్యాప్తు జరపాలని నగర పోలీసు కమిషనర్‌కు ఆదేశించారు. తనకు ఉన్న ఫేస్బుక్ మాదిరిగానే మరో ఫేక్ ఫేస్బుక్ అకౌంట్‌ను తెరిచి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఇలా చేయడాన్ని తాను వారం రోజుల క్రితమే గుర్తు పట్టానని, అప్పట్లోనే అకౌంట్‌ను క్లోజ్ చేయమని హెచ్చరించినా.. కొనసాగిస్తూ ఇలా పోస్ట్ చేశారే తప్ప ఇందులో తన ప్రమేయం లేదని ఆమె తెలిపారు. తన స్నేహితులు, కుత్బుల్లాపూర్ ప్రాంత ప్రజలు, సహ ఉద్యోగులు, టీజీఓ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని ‘సాక్షి’ ద్వారా కోరుతున్నానని మమత అన్నారు. ఈ విషయంపై ఆరాతీస్తే ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్‌ను తొలగించినట్లు గుర్తించారు.