సాక్షి, ఇల్లందకుంట(కరీంనగర్): అధికారం, ముఖ్య మంత్రి కుర్చే కేసీఆర్‌కు ముఖ్యమని, దానికోసం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేయడానికైనా వెనుకడడని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రజాదీవెన పేరిట చేపట్టిన పాదయాత్ర గురువారం నాల్గో రోజు ఇల్లందకుంట మండలం సీతంపేట, వనతడుపుల, బుజూనూర్‌తోపాటు జమ్మికుంట మండలం నగురం, వావిలాలలలో నిర్వహించారు. ఈసందర్భంగా పలు చోట్ల ఈటల మాట్లాడుతూ తాను వాస్తవంగా ఎమ్మెల్యేకు రాజీనామా చేయలేదని.. వాళ్లే రాజీనామా చేయమని అడిగితే చేశానని అన్నారు. పార్టీని వదిలిపెట్టేలా చేశారని తెలిపారు.
18 ఏళ్లపాటు ఉద్యమాన్ని నడిపి జైళ్లో ఉన్న వ్యక్తినని.. మంత్రినయ్యాక కూడా కేసుల కోసం విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని గంటలకొద్ది కోర్టుల దగ్గర గడిపానని అన్నారు. మొక్కజొన్నలు రూ. 1300–1350లకు అమ్ముకొని దాదాపు క్వింటా కు 600 చొప్పున ఎకరానికి రూ.15 వేలు నష్టపోయారని తెలిపారు. రైతుబంధు పేరిట రూ. 5 వేలు ఇచ్చి మొక్కజొన్నలకు రూ.15 వేలు నష్టం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే బిడ్డను, తెలంగాణ నిఖార్‌సైన బిడ్డను ఆశీర్వదించాలని కోరారు. నోట్ల కట్టలతో నాయకులను, సంఘాలను కొనుగోలు చేస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్ నాయకులు, మంత్రులు ఎన్ని చేసిన ప్రజలు తమ పక్షానే ఉన్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు బొడిగె శోభ, ధర్మారావు, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, చాడ సురేశ్‌రెడ్డి, మహిపాల్‌యాదవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment