karimngar
-
‘రెండు గుంటలు’.. రెండు హత్యలు
సాక్షి, జగిత్యాల (కరీంనగర్): ప్రేమానురాగాలు మరిచారు.. స్నేహం, బంధుత్వాలు పట్టవనుకున్నారు.. కేవలం రెండు గుంటల భూమి కోసం నెలకొన్న వివాదం అన్నదమ్ముల కుటుంబాల్లో చిచ్చు పెట్టింది.. పరస్పరం ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లింది.. ఈ నేపథ్యంలో జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామ శివారులో ఈరిశెట్టి రాజేశ్(28) దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. ► ధరూర్‌కు చెందిన ఈరిశెట్టి బుచ్చిలింగంకు నలుగురు కుమార్తెలు. వీరిలో ముగ్గురికి వివాహాలు చేశారు. మరో కూతురు రాజేశ్వరికి మల్యాల మండలం రాజారాం గ్రామానికి చెందిన బక్కశెట్టి గంగారెడ్డితో పెళ్లి జరిపించి, అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నాడు. ► బుచ్చిలింగం అన్న కుమారుడు ఈరిశెట్టి వెంకన్న, అల్లుడు గంగారెడ్డిలకు ఒకేచోట చెరో రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో వెంకన్నకు రెండు గుంటల భూమి ఎక్కువ ఉందనే కారణంతో ఇద్దరి మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ► ఈ రెండు గుంటల్లో తనకో గుంట ఇవ్వాలని గంగారెడ్డి, తాను ఇవ్వబోనని వెంకన్న ఘర్షణ పడుతున్నారు. పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు జరిగాయి. ► ఈ క్రమంలో 24 మే 2020న గంగారెడ్డి, అతడి కుమారులు వేణు, సతీశ్, సంతోష్‌లు వెంకన్న ఇంటికి వెళ్లారు. తమకు గుంట భూమి ఇవ్వాల్సిందేనని గొడవకు దిగారు. ఆగ్రహించిన వెంకన్న, అతని కుమారులు రాజేశ్, రాకేశ్‌లు గంగారెడ్డిని కత్తితో పొడిచి, చంపారు. ► ఈ కేసులో వెంకన్న, రాజేశ్, రాకేశ్‌లు జైలుకు వెళ్లి, ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. అయి తే, తమ తండ్రిని చంపిన వారిని ఎలాగైనా హతమార్చాలని గంగారెడ్డి కుమారులు భావించారు. ఇందుకు మరికొందరి సాయం తీసుకున్నారు. ► ఆదివారం ఉదయం వెంకన్న కుమారుడు రాజేశ్ తన మొక్కజొన్న చేను వద్దకు వెళ్తుండగా గ్రామ శివారులో తల్వార్, ఇనుపరాడ్లతో కొట్టి, హత్య చేశారు. ►జగిత్యాల రూరల్ సీఐ కృష్ణకుమార్, ఎస్సై అనిల్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం పోలీస్ బందోబస్తు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. ► రాజేశ్‌కు భార్య లత, కూతురు అక్షర(4), కుమారుడు మన్విత్(3) ఉన్నారు. లత ఐదోవార్డు సభ్యులుగా కొనసాగుతున్నారు. అతని మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ► మృతుడి సోదరుడు రాకేశ్ ఫిర్యాదు మేరకు వేణు, సంతోష్, సతీశ్‌తోపాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని, గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. -
సామీజీల వేషం.. పూజలంటూ మోసం
సాక్షి, జగిత్యాల(కరీంనగర్): వారు స్వామీజీల వేషం కట్టారు.. రెండ్రోజులుగా ఇంటింటికీ తిరుగుతున్నారు.. సమస్యలు పరిష్కరిస్తామని నమ్మిస్తున్నారు.. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చుతామని చెబుతూ పూజలు చేస్తున్నారు.. తాయత్తులు కడుతూ అందిన కాడికి దండుకుంటున్నారు.. నిందితులను జగిత్యాల ఖిలాగడ్డ ప్రాంతంలో స్థానికులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులు స్వామిజీల అవతారంలో రెండు రోజులుగా ఖిలాగడ్డ ప్రాంతంలో ఇంటింటికీ వెళ్తున్నారు. ముందుగా వీరిలో ఒకరు మీ ఇంట్లో సమస్య ఉందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించి, వెళ్తారు. గంట తర్వాత మరొకరు వచ్చి, లేని సమస్యలు ఉన్నట్లు నమ్మించి, రూ.2 వేలు, రూ.2,500 విలువైన తాయత్తులు ఉన్నాయని, వాటిని కట్టుకుంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని నమ్మిస్తారు. ఇలా పెద్దఎత్తున డబ్బు వసూలు చేస్తున్నారు. విషయం స్థానికులకు అర్థమవడంతో నిందితులను మంగళవారం ఉదయం పట్టుకొని, దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. -
Karimnagar: ‘స్మార్ట్’ పనులకు.. ఒక్క రూపాయి ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, కరీంనగర్: కరీం‘నగరం’స్మార్ట్ సిటీ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక చొరవతో 2017లో జూన్ 23వ తేదీన కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఫిబ్రవరి 25వ తేదీన స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో స్మార్ట్‌సిటీ నిర్మాణం, ఆధునీకరణ పనులు మొదలయ్యాయి. గతంలో ఉన్న 50 డివిజన్ల నుంచి 31 డివిజన్లు ఎంపికకాగా మొదటిదశలో 11 రోడ్లను వీటిలో 9 ఆధునిక సీసీరోడ్లు అందుబాటులోకి వచ్చాయి. జీవన ప్రమాణాల్లో 22వ స్థానం, నగరపాలక పనితీరులో 21వ స్థానాన్ని కరీంనగర్ దక్కించుకుంది. ఓడీఎఫ్ ప్లస్‌ప్లస్ స్థానం సాధించింది. నగరపాలక సంస్థ ఇప్పటివరకు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 2015లో 259వ ర్యాంకు, 2017లో 201, 2018లో 73 ర్యాంక్ సాధించగా, 2019లో 99వ ర్యాంక్‌కు పడిపోయింది 2020లో కస్తా మెరుగుపడి 72వ ర్యాంక్ సాధించింది. 2021లో 10లోపు ర్యాంకు సాధించడానికి చర్యలు తీసుకుంటున్నారు. స్మార్ట్‌సిటీ పనులకోసం కేంద్రం ఇప్పటివరకు రూ.196 కోట్లు విడుదల చేయగా రాష్ట్రం మాత్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు. నాడు...నేడు... కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు ఉండగా 600 కిలోమీటర్ల మేరకు డ్రైనేజీలు, 650 కిలోమీటర్లకుపైగా ప్రధాన అంతర్గత రోడ్లు ఉన్నాయి. వివిధ కాలనీలతోపాటు నగరంలోని నడిబోడ్డున ఉన్న భగత్‌నగర్‌కు కనీస రహదారి లేక ఇబ్బందులు పడేవారు. కలెక్టరేట్ రోడ్డు మొ త్తం నీటితో నిండిపోయి రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి ఉండేది. స్మార్ట్‌సిటీగా కరీంనగర్ నగరపాలక సంస్థను ఎంపిక చేయడంతో పట్టణం అభివృద్ధిబాట పట్టింది. రూ.1878 కోట్లతో మొ దటగా 54 పనులు చేపట్టాలని డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) రూపొందించారు. స్మార్ట్‌సిటీ(ఎస్ఆర్ఎం) కింద రూ.975 కోట్లు కేటాయించగా, కన్వెర్జన్స్గా రూ.472 కోట్లు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) కింద రూ.393 కోట్లు కేటాయించి ముందుకుసాగుతున్నారు. మొదటి దశ పనులు స్మార్ట్‌సిటీలో భాగంగా రూ.1878 కోట్లతో డీపీఆర్‌లు రూపొందించగా మొదటిదశలో రూ. 416 కోట్లతో 11 పనులకు ఆమోదం తెలుపగా రూ.266.66 కోట్లతో 9 పనులు కొనసాగుతున్నాయి. రూ.3.80 కోట్లతో సర్కస్ మైదానం పార్క్ పనులు, రూ. 7.20 కోట్లతో పురాతన పాఠశాల మైదానం పార్క్ పనులు, రూ. 53.70 కోట్లతో ప్యాకేజీ–3 కింద హౌసింగ్‌బోర్డు రహదారుల నిర్మాణం పనులు, రూ.18 కోట్లతో అంబేద్కర్ స్టేడియం స్పోర్ట్ కాంప్లెక్స్ పనులు, రూ.16.90 కోట్లతో టవర్ సర్కిల్ అభివృద్ధి పనులు, రూ.84 కోట్లతో ప్యాకేజీ–1 కింద ప్రధాన రహదారుల నిర్మాణం, రూ. 80 కోట్లతో ప్యాకేజీ–2 కింద రోడ్ల పనులు చేపడుతున్నారు. రూ.2.43 కోట్లతో కంప్యాక్టర్ స్టేషన్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. రెండోదశ పనులు సుమారు రూ.500 కోట్లతో పనులు చేయడానికి ఆమోద ముద్ర వేస్తూ జూలై 8వ తేదీ 2020న నిర్ణయం తీసుకున్నారు. రూ.78 కోట్లతో డంపుయార్డ్ ఆధునీకరణ, రూ. 68 కోట్లను మూడు జోన్లలో రోజు వారి మంచినీటి పథకానికి కేటాయించారు. స్మార్ట్‌సిటీలో ఈ–బస్సుల కోసం రూ.20 కోట్లు, ఈ–స్మార్ట్‌క్లాస్ రూంలకోసం రూ.21 కోట్లు, రూ.150 నుంచి రూ.180 కోట్లతో కమాండ్ కంట్రోల్‌రూం నిర్మాణంకోసం బోర్డు ఆమోద ముద్ర వేసింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ.52 కోట్లు, సీసీ కెమెరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడానికి రూ.20 కోట్లు, అలుగునూర్ చౌరస్తా అభివృద్ధికి రూ.5 కోట్లు, మల్టిపర్పస్ పార్క్‌ల నిర్మాణానికి రూ.3 కోట్లు, స్మృతివనం కోసం ప్రతిపాదించిన ప్రకారం ఎంతైనా నిధులు వినియోగించుకునే అవకాశం, రూ.11 కోట్లతో సోలార్‌సిస్టం ఏర్పాటుకు, రూ. 07 కోట్లతో ఇంకుడు గుంతల నిర్మాణంకోసం కేటాయించారు. ఇంకా నిధుల కొరత నిధులు విడుదల లేకపోవడంతో స్మార్ట్ సిటీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. డీపీఆర్ ప్రకారం మొదట 54 పనులకు ఆమోదం తెలిపి పనులు ప్రారంభించారు. వివిధవర్గాల విజ్ఞప్తుల మేరకు మరో 6 పనులు వాటికి కలుపుకుని మొత్తం 60 పనులు చేయడానికి డీపీఆర్ సిద్ధం చేశారు. వీటిలో 10 పూర్తిస్థాయిలో కాగా మరో10 పనులు వచ్చే మూడునెలల్లోనే అందుబాటులోకి వస్తాయని మున్సిపల్ కమిషనర్ క్రాంతి చెబుతున్నారు. ఇవికాకుండా మరో 5 పనులు టెండర్లు పూర్తయి అనుమతికోసం వేచి చూస్తున్నాయి. మరో30 పనులు డీపీఆర్ సిద్ధం చేసి ఉంచారు. వీటికి అనుమతి లభించడంతో త్వరలో టెండర్లు పిలవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పనులకు అనుమతి మొదటిదశ పనులకు రూ.196 కోట్ల పనులకు అనుమతి లభించింది. రూ.174 కోట్ల పనులు పూర్తి చేయగా వీటిలో రూ.119 కోట్లు కాంట్రాక్టర్‌కు చెల్లించారు. ఎస్పీవీ వద్ద రూ. 18 కోట్ల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం వద్ద రూ. 61 కోట్ల రూపాయలున్నాయి. వచ్చే రెండునెలల్లో రూ.18 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది. ఇవికాకుండా రూ.375 కోట్ల పనులు కొనసాగుతున్నాయి. ఇవి వచ్చే మూడు నెలల్లోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరో రూ.200 కోట్ల రూపాయల డీపీఆర్‌లు సిద్ధంగా ఉన్నాయి. వీటిని త్వరలో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగా నిధులు సరైన సమయంలో విడుదల చేయకపోవడంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌సిటీ కింద రూ. 900 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.196 కోట్లు విడుదల చేసింది. వీటి నుంచి రూ.192 కోట్ల నిధులు స్మార్ట్‌సిటీ ఖాతాకు జమ అయ్యాయి. అంతేమొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ షేర్ కింద వాటా జమ చేయాలి.. ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. కేంద్ర వాటాలోని రూ.900 కోట్ల రూపాయల నుంచి సగం వాటా సుమారు రూ.400 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండగా ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు. సీఎం అస్యూరెన్స్ కింద కరీంనగర్‌కు ప్రత్యేకంగా రూ.350 కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు రూ.147 కోట్లు విడుదల చేశారు. వీటిని స్మార్ట్‌సిటీలో ఎంపిక కాని డివిజన్లు, శివారు ప్రాంతాల అభివృద్ధికి వినియోగిస్తున్నారు. చదవండి: కష్టాలు తెలుసుకుని కన్నీళ్లు తుడిచేందుకే.. -
పదిసార్లు తిరిగినా.. కళ్లకు కనిపిస్తలేనా.. పింఛన్ ఎందుకివ్వరు?
సాక్షి,ఇల్లందకుంట(కరీంనగర్): ‘నేను వికలాంగుడిని కాదా.. సంవత్సరం నుంచి పింఛన్ వస్త లేదు.. కళ్లకు కనిపిస్తలేనా.. నాకెందుకు పింఛన్ ఇవ్వరు’ అంటూ ఓ దివ్యాంగుడు ఆవేదన వ్యక్తం చేశాడు. జమ్మికుంట మండలంలోని వావిలాలలో సోమవారం రాత్రి టీఆర్ఎస్ ధూంధాం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మడుపు రాజేశ్ వేదిక పైకి ఎక్కి తన బాధ చెప్పుకునే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న టీఆర్ఎస్ కార్యకర్త అతని కాలర్ పట్టుకొని, కిందికి దింపేందుకు ప్రయత్నించగా పడిపోయాడు. అనంతరం రాజేశ్ మాట్లాడుతూ.. కార్యక్రమం ప్రారంభానికి ముందే తనకు ఏడాదిగా పెన్షన్ రావడం లేదని ఎమ్మెల్యేకు చెప్పడానికి వస్తుంటే పోలీసులు అడ్డుకున్నారని వాపోయాడు. వారి నుంచి తప్పించుకొని స్టేజి ఎక్కి తన బాధను అందరికీ చెప్పుకునే ప్రయత్నం చేశానన్నాడు. ఇందులో ఏ విధమైన రాజకీయాలు లేవని పేర్కొన్నాడు. పెన్షన్ కోసం కలెక్టర్ ఆఫీస్‌కు, పదిసార్లు ఎంపీడీవో కార్యాలయం చుట్టూ తిరిగినా రాలేదని చెప్పాడు. చదవండి: సోనియమ్మకు థాంక్స్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే -
దళిత హక్కుల నేత.. డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్ కన్నుమూత..
సాక్షి, నార్నూర్(ఆదిలాబాద్): బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఏజెన్సీ దళితుల హక్కుల కోసం పోరాడిన దళిత నేత ఉమ్మడి ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్(65) హఠాన్మరణం చెందారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం గుంజాల గ్రామానికి చెందిన ఆయన బుధవారం గుండెపోటుతో హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. నాందేవ్ మంగళవారం ఆదిలాబాద్‌లో జరిగిన రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటనలో పాల్గొన్నారు. రాత్రి తొమ్మిది గంటలకు స్వగ్రామానికి చేరుకున్నారు. ఇంట్లో నిద్రిస్తుండగా రాత్రి 2గంటల సమయంలో గుండెపోటు రావడంతో ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ఉట్నూర్ నుంచి ఆదిలాబాద్‌కు చేరుకుని తన సొంత వాహనంలో హైదరాబాద్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాందేవ్ మృతిచెందారు. ఆయన స్వగ్రామం గుంజాలలో విషాదం నెలకొంది. గురువారం ఉదయం 11 గంటలకు స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. స్వయంకృషితో ఎదిగారు.. నాందేవ్ వ్యవసాయ కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. ఆయనకు భార్య సత్యభామ, ఐదుగురు కూతుళ్లు, నలుగురు కుమారులు ఉన్నారు. రెండేళ్ల క్రితం కుమారుడు అనారోగ్యంతో చనిపోయాడు. నాందేవ్ 1990లో విద్యుత్ శాఖలో కాంట్రాక్టర్‌గా పని చేస్తూనే ఏ1కాంట్రాక్టర్‌గా ఎదిగారు. 1989లో పీఏసీఎస్ తాడిహత్నూర్‌కు చైర్మన్‌గా తొలిసారి ఎన్నికయ్యారు. 1994–95లో జరిగిన ఎన్నికల్లో నార్నూర్ పీఏసీఎస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆరు సార్లు చైర్మన్‌గా ఎన్నిక కావడంతోపాటు ఆరు సార్లు డీసీసీబీ డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. 1997లో ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా దళితుల సమస్యలపై పోరాటం చేశారు. 1/70 చట్టంతో ఏజెన్సీ ప్రాంత దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, దళితుల సాగు భూములకు పట్టాలు, పహాణి పత్రాలు ఇవ్వాలని, ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేయాలని అప్పటి ముఖ్యమంత్రులు వైఎస్ఆర్, చంద్రబాబు, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దళితులకు పహాణి పత్రాలు ఇప్పించారు. డీసీసీబీ చైర్మన్‌గా ఉంటూనే ఏజెన్సీ దళితులకు రైతుబంధు, రైతుబీమా వర్తింప చేయాలని తీవ్ర ప్రయత్నం చేశారు. టీడీపీలో సామాన్య కార్యకర్తగా అడుగుపెట్టి తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2020–21ఫిబ్రవరిలో జరిగిన పీఏసీఎస్ ఎన్నికల్లో చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రి ఐకే రెడ్డి సంతాపం నిర్మల్‌రూరల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్ హఠాన్మరణంపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. నాందేవ్ మృతి బాధాకరమని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
ఆగిపోయిన గుండెకు మళ్ళీ ఊపిరి పోసిన అంబులెన్స్ సిబ్బంది..
కరీంనగర్: అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తీతో ఆగిపోయిన గుండెకు మళ్లీ ఊపిరిపోసి మానవత్వం చాటుకున్నారు. ఈ అరుదైన సంఘటన కరీంనగర్లో చోటుచేసుకుంది. కాగా, మంథని మండలం గంగిపల్లికి చెందిన సుజాత అనే మహిళకు మూడు రోజుల క్రితం బాలుడు జన్మించాడు. బాబుకు అనారోగ్యం కారణంగా నిన్న కరీంనగర్ సివిల్ ఆస్పత్రిలో చేర్చి చికిత్సను అందిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా, బాబు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వెంటనే వరంగల్ ఆస్పత్రికి తరలించాలని డాక్టర్లు తల్లిదండ్రులకు సూచించారు. దీంతో సీరియస్ కండిషన్లో ఉన్న తమ బాలుడిని కరీంనగర్ నుంచి వరంగల్‌కు అంబులెన్స్‌లో తరలిస్తున్నారు. అయితే, అంబులెన్స్‌లో ప్రయాణిస్తుండగా.. పసికందు గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం ఆగిపోయింది. దీంతో అంబులెన్స్ సిబ్బంది వెంటనే.. హార్ట్ బీట్ చెస్ట్ కంప్రెషన్ విధానంలో మళ్ళీ గుండె కొట్టుకునేలా చేశారు. దీంతో ఆ బాలుడు తిరిగి సాధారణంగా స్థితికి చేరుకున్నాడు. ఆ తర్వాత వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
కేవలం ఓట్లు, సానుభూతి కోసం ఈటల చీఫ్ ట్రిక్స్..
సాక్షి, హుజూరాబాద్(కరీంనగర్): ఆత్మగౌరవం అంటూ పదే పదే మాట్లాడుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఏడేళ్లుగా ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా? అని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాద్ ప్రశ్నించారు. గురువారం మండలంలోని సింగాపూర్‌లో రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఐదేళ్ల నుంచే సీఎం కేసీఆర్‌తో విబేధాలు ఉన్నాయన్న ఈటల ఇన్నేళ్లు మంత్రిగా, పార్టీలో ఎందుకు ఉన్నారన్నారు. గొర్రెల పంపిణీ, దళితబంధు పథకాలు ఒక్క హుజూరాబాద్‌కు సంబందించినవి కాదని, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న పథకాలని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతీ దానిని హుజూరాబాద్‌తో లింకు పెట్టడం సరికాదన్నారు. భూస్వాములకు రైతుబంధు వద్దన్న ఈటల తన ఖాతాలో జమైన డబ్బులను ప్రభుత్వానికి తిరిగి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. గొర్రెల యూనిట్ ధరను హుజూరాబాద్ ఎన్నికల కోసం పెంచలేదని, ప్రస్తుతం పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని మంత్రిగా ఉన్నప్పుడు చెప్పిన ఈటలకు ఇప్పుడు తప్పులు కనిపిస్తున్నాయా? అని ఎద్దేవా చేశారు. ఈటల రాజేందర్ గెలిస్తే బీజేపీలో రెండు పోయి ముగ్గురు ఎమ్మెల్యేలు అవుతారే తప్పా, ప్రజలకు ఏం మేలు జరుగదన్నారు. పదవి పోగానే గౌరవం మర్చిపోయి మాట్లాడుతున్నారని, ఏడేళ్లు మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే సీఎం నీకు అడ్డు వచ్చాడా? అని, ఇప్పుడు పాదయాత్ర ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించారు. కేవలం ఓట్లు, సానుభూతి కోసం ఈటల చీఫ్ ట్రిక్స్ చేస్తున్నారని ఇక నుంచైనా మానుకోవాలని హితవు పలికారు. ఈటలను ప్రభుత్వం బయటకు పంపలేదని, ఆశలు పెరిగి పోయి చేసుకున్నారని, అది నీ కర్మ అన్నారు. హుజూరాబాద్ ప్రజలు అమ్ముడుపోరని చెప్పిన ఈటల గడియారాలు, కుక్కర్లు ఎందుకు ఇస్తున్నావని ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు వొడితల సతీశ్‌కుమార్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశంయాదవ్, బస్వరాజు సారయ్య, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ముఖ్యమంత్రి కుర్చే కేసీఆర్‌కు ముఖ్యం..
సాక్షి, ఇల్లందకుంట(కరీంనగర్): అధికారం, ముఖ్య మంత్రి కుర్చే కేసీఆర్‌కు ముఖ్యమని, దానికోసం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేయడానికైనా వెనుకడడని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రజాదీవెన పేరిట చేపట్టిన పాదయాత్ర గురువారం నాల్గో రోజు ఇల్లందకుంట మండలం సీతంపేట, వనతడుపుల, బుజూనూర్‌తోపాటు జమ్మికుంట మండలం నగురం, వావిలాలలలో నిర్వహించారు. ఈసందర్భంగా పలు చోట్ల ఈటల మాట్లాడుతూ తాను వాస్తవంగా ఎమ్మెల్యేకు రాజీనామా చేయలేదని.. వాళ్లే రాజీనామా చేయమని అడిగితే చేశానని అన్నారు. పార్టీని వదిలిపెట్టేలా చేశారని తెలిపారు. 18 ఏళ్లపాటు ఉద్యమాన్ని నడిపి జైళ్లో ఉన్న వ్యక్తినని.. మంత్రినయ్యాక కూడా కేసుల కోసం విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని గంటలకొద్ది కోర్టుల దగ్గర గడిపానని అన్నారు. మొక్కజొన్నలు రూ. 1300–1350లకు అమ్ముకొని దాదాపు క్వింటా కు 600 చొప్పున ఎకరానికి రూ.15 వేలు నష్టపోయారని తెలిపారు. రైతుబంధు పేరిట రూ. 5 వేలు ఇచ్చి మొక్కజొన్నలకు రూ.15 వేలు నష్టం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే బిడ్డను, తెలంగాణ నిఖార్సైన బిడ్డను ఆశీర్వదించాలని కోరారు. నోట్ల కట్టలతో నాయకులను, సంఘాలను కొనుగోలు చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు ఎన్ని చేసిన ప్రజలు తమ పక్షానే ఉన్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు బొడిగె శోభ, ధర్మారావు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, చాడ సురేశ్‌రెడ్డి, మహిపాల్‌యాదవ్ పాల్గొన్నారు. -
12 ఏళ్ల క్రితం వివాహం.. ఇద్దరు కుమారులు.. అదనపు కట్నం తేవాలని..
సాక్షి, సారంగాపూర్(కరీంనగర్): అదనపు వరకట్నం తీసుకురావాలని వేధిస్తున్న భర్త, అత్తామామలపై సారంగాపూర్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ప్రొబేషనరీ ఎస్సై (పీఎస్సై) రజిత కథనం ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం గోపాల్రావుపేట గ్రామానికి చెందిన మిర్యాల సుమలతకు సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన మిర్యాల మహేశ్‌తో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో మహేశ్‌కు సుమలత తల్లితండ్రులు ఒప్పుకున్న ప్రకారం వరకట్నం ముట్టజెప్పారు. సదరు దంపతులకు ఇద్దరు కుమారులు. కొన్ని రోజులుగా అదనంగా మరో రూ.3 లక్షలు కట్నం తీసుకురావాలని భర్త, అత్త పోశవ్వ, మామ లక్ష్మీనారాయణలు సుమలతను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పీఎస్సై తెలిపారు. -
Etela Rajender: గోడ గడియారాలు పగలగొట్టి నిరసన
సాక్షి, వీణవంక(కరీంనగర్): మండలంలోని చల్లూరు, ఎల్బాక గ్రామాల్లో బుధవారం దళితులు మాజీ మంత్రి ఈటల రాజేందర్ బొమ్మతో కూడిన గోడ గడియారాలను పగలగొట్టి నిరసన తెలిపారు. మండలానికి చెందిన బీజేపీ నాయకులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ బొమ్మతో ఉన్న గోడ గడియారాలను ఇటీవల మండల వ్యాప్తంగా పంపిణీ చేశారు. దళితులను ఈటల పట్టించుకోలేదని, గడియారాలు తమకెందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తుల రక్షణ కోసమే బీజేపీలో చేరాడని, ప్రజలకు రూ.90 విలువగల గడియారాలు ఇచ్చి ప్రలోభాలకు గురి చేస్తే ఎవరూ లొంగరని అన్నారు. ఆత్మగౌరవం అంటూ చెప్పుకునే ఈటల దళితులపై ఎప్పుడూ స్పందించలేదని పేర్కొన్నారు. ఇకనైనా ప్రలోభాలకు గురి చేయడం మానుకోవాలని హితవు పలికారు. దళితబంధు పథకంతో దళితుల ఆర్థిక సాధికారత చేకూరుతుందని పేర్కొన్నారు. -
కాసులిస్తే..వేటుండదు!
సాక్షి, కరీంనగర్: తప్పు చేశారు.. అనుకోకుండా దొరికిపోయారు. ఆ తప్పు నుంచి తప్పించుకునేందుకు నానాతిప్పలు పడుతున్నారు. సిబ్బం ది చేసిన తప్పిదాన్ని సొమ్ము చేసుకోవాలనుకున్న ఓ అధికారి.. వారిని వేటు పేరిట భయపెడుతున్నాడు. వేలాది రూపాయలు చెల్లించాలని, లేకుంటే శాఖాపరంగా శిక్ష తప్పదని బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. ఏం చేయాలో తోచక కొందరు తమ ను మన్నించాలని సదరు అధికారిని వేడుకుంటుంటే.. ఇంకొందరు శాఖాపరమైన చర్యలకు జడిసి అడిగినంత ఇచ్చేస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం కేంద్రంగా జరుగుతున్న ఈ అవినీతి హాట్‌టాపిక్‌గా మారింది. జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌హెల్త్ సెంటర్లలో 524 మంది రెగ్యులర్, 576 కాంట్రాక్టు ఏఎన్ఎంలు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు తాము పని చేసే కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో తిరిగి పారిశుధ్యం, ప్రజారోగ్యంపై రోగులు, గర్భిణులు, బాలింతలకు సల హాలు, సూచనలందిస్తారు. క్షేత్రస్థాయిలో తిరిగే సమస్య, జీతభత్యాలు తక్కువగా ఉండటంతో కాంట్రాక్టు పద్ధతి లో పనిచేసే పన్నెండుమంది ఏఎన్ఎంలు ఒకేచోట ఉండి పనిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పై చదువులు చదివి.. పీహెచ్సీ, ఆస్పత్రుల్లో స్టాఫ్‌నర్స్‌గా పర్మినెంట్ ఉద్యోగం సాధించాలనుకున్నారు. కరీంనగర్లో ఓ నర్సింగ్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు. రోజు విడిచి రోజు విధులు ఎగ్గొట్టి కాలేజీకి రాకపోకలు సాగించారు. కొన్ని నెలలు వారి చదువు సాఫీగానే సాగింది. తర్వాత ఈ వ్యవహారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి దృష్టిలో పడింది. విధులకు బదులు కాలేజీలో శిక్షణకు వెళ్తున్నట్లు నిర్ధారించుకున్న ఆ అధికారి ఏఎన్ఎంలు చేరిన కాలేజీ నుంచి నేరుగా వారి సర్టిఫికెట్లు.. హాజరుపట్టిక తెప్పించుకున్నారు. కాలేజీలో చదివేందుకు అనుమతి ఎవరిచ్చారని హెచ్చరించారు. కోర్సులో చేరిన తప్పునకు జరిమానాగా రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు చెల్లించాలని ఏఎన్ఎంలతో చెప్పారు. దీంతో తమను మన్నించి సర్టిఫికెట్లు ఇవ్వాలని ఏఎన్ఎంలు ఆ అధికారిని వేడుకున్నారు. అయినా తీరు మారని సదరు అధికారి డబ్బులివ్వకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో చేసేదేమీ లేక కొందరు ఏఎన్ఎంలు డబ్బులు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై డీఎంహెచ్‌వో బాలు వివరణ ఇస్తూ.. జిల్లాలో చాలామంది కాంట్రాక్టు ఏఎన్ఎంలు నిబంధనలకు విరుద్ధంగా నర్సింగ్ కళాశాలల్లో చేరి, స్టాఫ్‌నర్సు శిక్షణ తీసుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, వారిపై విచారణ జరుపుతున్నామని చెప్పారు.