'బాబు వేసే హెరిటేజ్ బిస్కట్లను రేవంత్ తింటూ..'
కరీంనగర్ సిటీ: 'ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు విసిరే హెరిటేజ్ బిస్కట్లను తింటూ తెలంగాణ ఉద్యమకారులపై నోరు పారేసుకుంటున్నాడని, అర్థంలేని వ్యాఖ్యలు చేస్తే నాలుక కోసే రోజొస్తది' అని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ టీడీపీ నేత రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. గురువారం కరీంనగర్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓటుకు నోటు వ్యవహారంలో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన దొంగల ముఠా సభ్యుడు రేవంత్ అని ధ్వజమెత్తారు. బెయిల్‌తో ఏదో సాధించినట్లు నిస్సిగ్గుగా ఊరేగింపు చేశాడన్నారు.
తెలంగాణ సాధించాడా, స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నాడా... ఎందుకు ఈ అట్టహాసమని ప్రశ్నించారు. ఎన్‌టీఆర్ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను రేవంత్ చదివారని, ప్రతి మాటకు ఏపీ సీఎం చంద్రబాబుదే బాధ్యతని అన్నారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఒంటికాలుమీద లేచే మేధావులు, మీడియా ఎందుకు రేవంత్ బాషపై మాట్లాడడం లేదన్నారు. తెలంగాణలోనే కాదు ఏపీలోనూ టీడీపీ భూస్థాపితం కాక తప్పదన్నారు.