MP Aravind: ఆయనో తుగ్లక్‌ ముఖ్యమంత్రి  | MP Dharmapuri Aravind Fires On CM KCR In Nizabad | Sakshi
Sakshi News home page

MP Aravind: ఆయనో తుగ్లక్‌ ముఖ్యమంత్రి 

Published Wed, Sep 15 2021 11:40 AM | Last Updated on Wed, Sep 15 2021 11:40 AM

MP Dharmapuri Aravind Fires On CM KCR In Nizabad - Sakshi

కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాతున్న ఎంపీ అర్వింద్‌

సాక్షి, లింగంపేట(నిజామాబాద్‌): రాష్ట్రంలో హిందూ సాంప్రదాయాలను ఒవైసీకి తాకట్టు పెట్టిన కేసీఆర్‌ తుగ్లక్‌ ముఖ్యమంత్రి అని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ధ్వజమెత్తారు. హిందూ మతాన్ని తొక్కేస్తున్నాడని, ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడని విమర్శించారు. లింగంపేట లో మంగళవారం నిర్వహించిన బీజేపీ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ అర్వింద్‌ ప్రసంగించారు. రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన కొనసాగుతోందని, ఈ పాలన చూసి, టీఆర్‌ఎస్‌రే ఢిల్లీలోని తుగ్లక్‌ గల్లీలో స్థలం కేటాయించారని ఎద్దేవా చేశారు. 

హిందువులంతా ఏకం కావాలి.. 
హిందువులంతా ఏకం కావాలని, హిందూ రాష్ట్ర స్థాపనే కర్తవ్యంగా పని చేయాలని సూచించారు. అయోధ్యలో శ్రీరామ మందిరం కట్టే వారికే మద్దతు పలకాలని కోరారు. రాష్టంలో బీజేపీ బలపడుతుండడంతో కేసీఆర్‌కు మింగుడు పడడం లేదన్నారు. 

ఈటలదే గెలుపు.. 
పార్టీ జెండా మోసిన వారిని బయటకు పంపడం కేసీఆర్‌కు అలవాటేనని, 20 ఏళ్లు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన ఏనుగు రవీందర్‌రెడ్డి, ఈటల రాజేందర్‌లను పార్టీ నుంచి బయటకు పంపించాడన్నారు. ఇరువురు నిఖార్సయిన నాయకులు బీజేపీలోకి రావడం సంతోషకరమని చెప్పారు. హుజూరాబాదులో రూ.200 కోట్లు కాదు కదా.. రూ.2 వేల కోట్లు ఖర్చు పెట్టినా ఈటలను ఓడించలేరన్నారు. భారీ మెజారిటీతో ఈటల గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. గులాబీ జెండా కాలుష్యమైందని, టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆలోచించుకోవాలని సూచించారు.  

వీళ్లేమైనా సక్కగున్నారా? 
పసుపుబోర్డు విషయంలో నానా యాగీ చేస్తున్నారని ఎంపీ ధ్వజమెత్తారు. బోర్డు కోసం ప్రధాని మోదీ వద్దకు రైతులను తీసుకెళ్లానని, బోర్డుకు మించి మెరుగైన వ్యవస్థను తీసుకొచ్చానని చెప్పారు. కేంద్రం బడ్జెట్‌లో రూ.30 కోట్లు కేటాయించిందని, పసుపు ఎగుమతులు పెంచి దిగుమతులు తగ్గించినట్లు తెలిపారు. పసుపుబోర్డు గురించి తన గుండుపై కామెంట్లు చేశారని, కేసీఆర్‌ కుటుంబంలో చక్కగా ఉన్న ముఖాలు ఒక్కటైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. 

దొడ్డుబియ్యం కొనబోమని చెప్పలేదు.. 
పెట్రోల్, డీజిల్‌ రేట్లు పెరగడానికి సీఎం కేసీఆర్‌ కూడా కారణమని అర్వింద్‌ విమర్శించారు. పెరిగిన ధరల్లో 30 శాతం మేర రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్‌ రూపంలో వసూలు చే స్తోందని, ఆ మొత్తాన్ని కేసీఆర్‌ తీసుకోకుండా ఉంటే పెట్రోల్, డీజిల్‌ రేట్లు తగ్గుతాయ ని చెప్పారు. కేంద్రం దొడ్డు బియ్యం కొనమని ఎక్కడా చెప్పలేదని, కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

అధికారంలోకి రావడం ఖాయం
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, వంద సీట్లలో గెలుస్తామని అర్వింద్‌ ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంట్, తొమ్మిది అసెంబ్లీ స్థానాలు గెలిచి తీరతామన్నారు. జిల్లాలో టీఆర్‌ఎస్‌లో కవిత, కాంగ్రెస్‌లో షబ్బీర్‌ అలీ ఒక్కరే మిగులుతారన్నారు. బీజేపీలో గెలిచే గుర్రాలకే టికెట్లు వస్తాయని, కార్యకర్తలు జవాబుదారీగా పని చేయాలని సూచించారు.

బండి సంజయ్‌ పాదయాత్ర ఎల్లారెడ్డి నియోజక వర్గంలో నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని, ఆయన యాత్రను విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, పార్టీ నేతలు ఏనుగు రవీందర్‌రెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి, బాపురెడ్డి, కృష్ణారెడ్డి, రాంరెడ్డి, మాల్యాద్రిరెడ్డి, మురళి, దత్తురాం, రాంచందర్‌ పాల్గొన్నారు.  

చదవండి: బ్లాక్‌మెయిలింగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ రేవంత్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement