
కరీంనగర్ టౌన్: ‘మూడోసారి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు జరుగుతున్న ఈ మహాయాగంలో మీ ఆశీస్సుల కోసం ప్రజాహిత యాత్రగా మీ గడపకొస్తున్నా.. ఆశీర్వదించండి’అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. యా త్రను విజయవంతం చేయాలని కోరారు.
శనివారం ఉదయం కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు చేసి మేడిపల్లి నుంచి ప్రారంభమయ్యే తొలివిడత యాత్ర ఈనెల 15 వరకు కొనసాగనుంది. తొలిరోజు యాత్ర మేడిపల్లి, కొండాపూర్, రంగాపూర్, భీమారం, మన్నెగూడ, బొమ్మెన, దూలూరు, సరికొండ, కథలాపూర్ గ్రామాల్లో జరగనుంది. రాత్రి కథలాపూ ర్‌లో సంజయ్ బసచేస్తారు. తొలివిడతలో సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో యాత్రను కొనసాగించనున్నారు. యాత్రలో భాగంగా ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లే క్రమంలో వాహనం వాడతారు. గ్రామాల్లో మా త్రం పాదయాత్రగా ముందుకు సాగుతారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 3 రోజుల చొప్పున యాత్ర చేసేలా రూట్‌మ్యాప్ రూపొందించారు.
నియోజకవర్గం మొత్తం పర్యటించేలా రూట్‌మ్యాప్
ప్రజాహిత యాత్ర పేరిట కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పాదయాత్ర చేసేలా ఇప్పటికే సంజయ్ రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. మొదట కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు నిర్వహించి జగిత్యాల జిల్లా మేడిపల్లి నుంచి సంజయ్ తనయాత్రను ప్రారంభించనున్నారు. తొలివిడతలో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో పర్యటించి తంగళ్లపల్లిలో ముగింపు సభ నిర్వహించనున్నారు.
తొలిదశలో మొత్తం 119 కి.మీ. మేరకు యాత్ర చేయనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని ప్రతీ మండలం కవర్ చేస్తూ.. గ్రామాల్లోకి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటారు. నరేంద్రమోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అన్ని మండలాలు, మున్సిపాలిటీల మీదుగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు యాత్రను కొనసాగించేలా షెడ్యూల్‌ను రూపొందించారు.