టీజీఓ అధ్యక్షురాలి పేరుతోనకిలీ ఫేస్‌బుక్ అకౌంట్
ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కామెంట్స్
సైబర్ క్రైమ్‌కు మమత ఫిర్యాదు
సీఎంకు వివరణ ఇచ్చిన బాధితురాలు
కుత్బుల్లాపూర్: తన పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసి, అందులో రాజకీయ సంబంధ విషయాలపై కామెంట్లు పెట్టారని కుత్బుల్లాపూర్ ఉప కమిషనర్, టీజీఓ రాష్ట్ర అధ్యక్షురాలు వంకాయలపాటి మమత సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు మమత ‘సాక్షి’కి తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం మమత పేరుపై ఉన్న ఫేస్‌బుక్ అకౌంట్‌లో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ‘‘ బీసీగా పుట్టడమే నేను చేసినా నేరమా..!’’ అన్న క్యాప్షన్ పెట్టి దానికి కామెంట్‌గా టీఆర్‌ఎస్ నిరంకుశ పాలనకు ఇది నిదర్శనమని, కేసీఆర్ పాలన విమర్శిస్తూ కామెంట్లు మమత పెట్టినట్లుగా పోస్ట్ చేశారు. ఈ విషయం మమత చెవిన పడింది. వెంటనే అప్రమత్తమై ఆమె తన పేరుపై ఎవరో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి ఈ విధంగా కామెంట్లు చేస్తున్నారని గుర్తించారు.
అప్పటికే సీఎం క్యాంప్ కార్యాలయానికి ఈ కామెంట్ విషయం వెళ్లింది. దీనిపై ఆమెను సీఎం క్యాంప్ కార్యాలయం వివరణ కోరగా... తనకు సంబంధం లేని ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఇలా కామెంట్లు వచ్చాయని తెలిపారు. అదేరోజు రాత్రి ఆమె సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిసి జరిగిన విషయం చెప్పగా ఆయన వెంటనే ఈ విషయంపై దర్యాప్తు జరపాలని నగర పోలీసు కమిషనర్‌కు ఆదేశించారు. తనకు ఉన్న ఫేస్‌బుక్ మాదిరిగానే మరో ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్‌ను తెరిచి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఇలా చేయడాన్ని తాను వారం రోజుల క్రితమే గుర్తు పట్టానని, అప్పట్లోనే అకౌంట్‌ను క్లోజ్ చేయమని హెచ్చరించినా.. కొనసాగిస్తూ ఇలా పోస్ట్ చేశారే తప్ప ఇందులో తన ప్రమేయం లేదని ఆమె తెలిపారు. తన స్నేహితులు, కుత్బుల్లాపూర్ ప్రాంత ప్రజలు, సహ ఉద్యోగులు, టీజీఓ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని ‘సాక్షి’ ద్వారా కోరుతున్నానని మమత అన్నారు. ఈ విషయంపై ఆరాతీస్తే ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్‌ను తొలగించినట్లు గుర్తించారు.