సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: అంతర్వేదిలాంటి ఘటనలు అత్యంత దురదృష్టకరం. ఈ విషయంలో రెండో మాటకు తావు లేదు. ఉండకూడదు కూడా. కానీ దీన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలకు దిగితే..? రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తే..? అది ప్రజాస్వామ్యమా? మతాల్ని అడ్డం పెట్టుకుని దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం... మనుషుల మధ్య చిచ్చు పెట్టడం ఏ మేరకు ధర్మం? అసలు అంతర్వేది ఘటనలో ప్రభుత్వాన్ని, ప్రభుత్వ చర్యలను తప్పుబట్టాల్సిన అవసరమేమైనా ఉందా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాద్ధాంతాలకు దిగాల్సిన అవసరం ఉందా? జరిగిన ఘటనల్ని చూస్తే ఎవరికి వారే ఓ స్థిరాభిప్రాయానికి రావచ్చు కూడా.
తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లిలోని అంతర్వేది పుణ్యక్షేత్రంలో ఈ నెల 5 అర్ధరాత్రి దాటాక ఆలయ రధం దగ్ధమయింది. కారణాలేంటన్నది ఇంకా ఎవరికీ తెలియదు. విచారణలో బయటపడక మానవు కూడా!!. విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం చర్యలకు దిగింది. దీన్ని దురదృష్టకర, అవాంఛనీయమైన ఘటనగా వర్ణించింది. ఘటనపై విచారణకు ఆదేశించింది. అంతేకాకుండా స్థానికంగా ఆ పుణ్యక్షేత్రంలోని సంఘటనలకు బాధ్యుడైన ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి (ఈవో) చక్రధరరావును విధుల నుంచి తప్పిస్తూ సస్పెండ్ చేసింది. కొత్త రథం తయారీకి, ఇతరత్రా పనులకు రూ.95 లక్షలు మంజూరు చేసింది. అక్కడి పరిస్థితిని సమీక్షించడానికి మంత్రులను పంపింది. స్థానిక అధికారులకూ అక్కడే ఉండి సమీక్షించేట్టుగా తగు ఆదేశాలిచ్చింది. ఇవన్నీ ప్రభుత్వ చిత్తశుద్ధిని స్పష్టంగా చెప్పేచర్యలు. ఎక్కడా తాత్సారానికి తావులేకుండా వెనువెంటనే చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం... విచారణలో దోషులెవరో తేలితే కఠిన చర్యలు తీసుకోవటానికి కూడా సిద్ధమవుతోంది.
దాపరికానికి తావే లేదు..
మొదటి నుంచీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పారదర్శకతకే పెద్దపీట వేస్తూ వస్తోంది. టెండర్లలో పారదర్శకత కోసం ముందే న్యాయ సమీక్షకు పంపించటమనేది చరిత్రాత్మకం. ఇటీవల టీటీడీ జమా ఖర్చుల్ని కాగ్ ఆడిట్ పరిధిలోకి తేవాలనుకోవటమూ మున్నెన్నడూ చూడనిదే. ఈ చిత్తశుద్ధే కొన్ని రాజకీయ పక్షాలకు మింగుడుపడటం లేదు. ఏ సంఘటన జరిగినా దాన్ని పెద్దది చేస్తూ... ప్రభుత్వానికి పూస్తూ రాజకీయ లబ్ధికి ఆరాటపడుతున్నాయి. తమ కుట్రబుద్ధిని బయటపెట్టుకుంటున్నాయి. సంఘటన స్థలానికి వెళ్లిన మంత్రులను అడ్డుకుని రచ్చకు ప్రయత్నించటం... అదే వ్యక్తులు అక్కడికి కొద్ది దూరంలోని వేరొక మతానికి చెందిన ప్రార్థన మందిరంపై రాళ్లు రువ్వటం, అద్దాలు పగలగొట్టడం ఈ కుట్రను స్పష్టంగా బయటపెట్టేవే.
ఈ విషయంలో నిష్పాక్షికంగా ఆలోచించేవారికి కలిగే సందేహమొక్కటే? ఇలాంటి చర్యల ద్వారా వీళ్లు సాధించాలనుకుంటున్నదేంటి? ఏం చేయాలని రాళ్లేశారు? అసలిలా మతాల మధ్య చిచ్చు పెట్టడం ఏ మేరకు ధర్మం? రాజకీయ లబ్ధి కోసం మరీ ఇంతలా దిగజారుతారా? ప్రజాస్వామ్య పాలనలో ఇలాంటివి ధర్మమేనా? ఇది ప్రభుత్వ ధర్మాగ్రహం. విచారణలో బయటపడే దోషులు... మతాల మధ్య చిచ్చుతో రాజకీయ లబ్ధికి ఆరాటపడుతున్న కుట్రదారులు ఈ ఆగ్రహాన్ని చవిచూడక తప్పదనే అనుకోవాలి!.
చదవండి: ఈ అలజడి ఎవరి మనోరథం?
Comments
Please login to add a commentAdd a comment