antharvedi
-
అంతర్వేది దగ్గర అల్లకల్లోలంగా సముద్రం
-
మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు..
సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. అంతర్వేదిలో 2021 ఉత్సవాలు, రథోత్సవం కొత్త రథంతోనే నిర్వహిస్తామని భక్తులకు ఇచ్చిన హామీని సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారు. అంతర్వేదిలో రథం దగ్థౖమైన తర్వాత ఐదు నెలల్లో అన్ని హంగులతో కొత్త రథం నిర్మాణం పూర్తయ్యింది. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలకు కొత్త రథాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు. కల్యాణోత్సవాలు, కొత్త రథాన్ని ప్రారంభించేందుకు సీఎం శుక్రవారం అంతర్వేదికి వస్తున్నారు. వైఎస్ జగన్ సుమారు గంట పాటు స్వామి సేవలో గడపనున్నారు.. భక్తుల మనోభావాలకే సర్కారు పెద్దపీట రథం దగ్ధం అయిన నాటి నుంచి కొత్త రథం రూపు దాల్చేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం భక్తుల మనోభావాలకే పెద్ద పీట వేసింది. గతేడాది సెప్టెంబర్ 5న అర్థరాత్రి దాటాక అంతర్వేదిలో రథం దగ్ధం అయ్యింది. దీన్ని సాకుగా తీసుకుని రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రతి పక్షాలు, కొన్ని సంస్థలు ప్రయత్నించాయి. కుట్రలకు తెరలేపాయి. కొత్త రథం లేకుండా ఫిబ్రవరిలో ఉత్సవాలు నిర్వహించడం అరిష్టమనే ప్రచారాన్ని కూడా చేశాయి. ఉద్యమాలు, నిరసన పేరుతో రాద్ధాతం చేసి రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నించాయి. అయితే సంఘటన జరిగిన మరుక్షణమే సీఎం స్పందించారు. కొత్త రథం తోనే ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు. రథం దగ్ధం కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రాన్ని కోరడంతో ప్రతిపక్షాల నోళ్లు మూతపడ్డాయి. ఇటీవల పార్లమెంటు సమావేశాల సందర్భంలో సైతం వైఎస్సార్సీపీ ఎంపీలు రథం దగ్థంపై సీబీఐ దర్యాప్తు విషయం ఏమైందని కేంద్రాన్ని ప్రశ్నించడం గమనార్హం. రూ.95 లక్షలతో కొత్త రథం అంతర్వేదిలో ఫిబ్రవరిలోగా కొత్త రథం తయారు చేయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం ఈ కార్యక్రమం వెంటనే కార్యరూపం దాల్చేలా సెప్టెంబర్ 8న మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. రూ.95 లక్షల నిధులు మంజూరు చేశారు. స్వామి కల్యాణోత్సవాల సమయానికి కొత్త రథాన్ని సిద్ధం చేయాలనే సంకల్పంతో పనులు వేగవంతం చేశారు. రథం నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం అధికారులతో మరో కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ రథం నిర్మాణాన్ని, పనుల్లో నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించింది. మొత్తం 1,330 ఘనపటడుగుల బస్తర్ టేకును రథం కోసం వినియోగించారు. విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి, పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతీస్వామి కొత్త రథం పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతర్వేదిలో సీఎం పర్యటన ఇలా.. సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ శుక్రవారం ఉదయం 11.20 గంటలకు అంతర్వేది ఫిషింగ్ హార్బర్ వద్ద హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 11.35 గంటలకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ రాజగోపురం వద్దకు చేరుకుంటారు. 11.35 నుంచి 11.45 మధ్య స్వామి దర్శనం, అర్చన, మంత్రపుష్పం సమర్పణ కార్యక్రమాలను సీఎం నిర్వహిస్తారు. అనంతరం రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. 12 గంటలకు శ్రీలక్ష్మీనరసింహస్వామి రథాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 1.30కి తాడేపల్లికి చేరుకుంటారు. చదవండి: (యోధులారా వందనం : సీఎం జగన్) -
శరవేగంగా నూతన రథం నిర్మాణ పనులు
-
ఎన్ని గుళ్లు తిరిగినా ఆయన పాపాలు పోవు
సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అంతటి నీచ రాజకీయ నాయకుడు ఎవరూ లేరని, ఎన్ని గుళ్లకు తిరిగినా ఆయన పాపాలు పోవని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ 19-10-2017 కె. పంటపాడులో రథం దగ్ధమైంది. ఈ ఘటనపై చంద్రబాబు, బీజేపీ, జనసేన ప్రశ్నించలేదు. అంతర్వేది ఘటనను కావాలనే రాజకీయం చేస్తున్నారు. సోషల్ మీడియాలో టీడీపీ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. అలజడి సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూశారు. ( ‘చంద్రబాబువి పగటి కలలు’ ) అంతర్వేది ఘటన కేసును సీబీఐకి అప్పగించాం. దేవాలయాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించినా కఠిన చర్యలు తప్పవు. 40 దేవాలయాలను కూల్చేసిన చరిత్ర చంద్రబాబుది. ఆయన హయాంలోని భూ దోపిడీని ఎందుకు ప్రశ్నించరు?. చేయని తప్పులను కూడా ప్రభుత్వానికి అంటగడుతున్నారు. ఇలాంటి దుర్మార్గపు పనులను ఎవరూ సమర్థించొద్ద’’ని అన్నారు. -
రథం చుట్టూ రాజకీయం!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: అంతర్వేదిలాంటి ఘటనలు అత్యంత దురదృష్టకరం. ఈ విషయంలో రెండో మాటకు తావు లేదు. ఉండకూడదు కూడా. కానీ దీన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలకు దిగితే..? రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తే..? అది ప్రజాస్వామ్యమా? మతాల్ని అడ్డం పెట్టుకుని దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం... మనుషుల మధ్య చిచ్చు పెట్టడం ఏ మేరకు ధర్మం? అసలు అంతర్వేది ఘటనలో ప్రభుత్వాన్ని, ప్రభుత్వ చర్యలను తప్పుబట్టాల్సిన అవసరమేమైనా ఉందా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాద్ధాంతాలకు దిగాల్సిన అవసరం ఉందా? జరిగిన ఘటనల్ని చూస్తే ఎవరికి వారే ఓ స్థిరాభిప్రాయానికి రావచ్చు కూడా. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లిలోని అంతర్వేది పుణ్యక్షేత్రంలో ఈ నెల 5 అర్ధరాత్రి దాటాక ఆలయ రధం దగ్ధమయింది. కారణాలేంటన్నది ఇంకా ఎవరికీ తెలియదు. విచారణలో బయటపడక మానవు కూడా!!. విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం చర్యలకు దిగింది. దీన్ని దురదృష్టకర, అవాంఛనీయమైన ఘటనగా వర్ణించింది. ఘటనపై విచారణకు ఆదేశించింది. అంతేకాకుండా స్థానికంగా ఆ పుణ్యక్షేత్రంలోని సంఘటనలకు బాధ్యుడైన ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి (ఈవో) చక్రధరరావును విధుల నుంచి తప్పిస్తూ సస్పెండ్ చేసింది. కొత్త రథం తయారీకి, ఇతరత్రా పనులకు రూ.95 లక్షలు మంజూరు చేసింది. అక్కడి పరిస్థితిని సమీక్షించడానికి మంత్రులను పంపింది. స్థానిక అధికారులకూ అక్కడే ఉండి సమీక్షించేట్టుగా తగు ఆదేశాలిచ్చింది. ఇవన్నీ ప్రభుత్వ చిత్తశుద్ధిని స్పష్టంగా చెప్పేచర్యలు. ఎక్కడా తాత్సారానికి తావులేకుండా వెనువెంటనే చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం... విచారణలో దోషులెవరో తేలితే కఠిన చర్యలు తీసుకోవటానికి కూడా సిద్ధమవుతోంది. దాపరికానికి తావే లేదు.. మొదటి నుంచీ వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పారదర్శకతకే పెద్దపీట వేస్తూ వస్తోంది. టెండర్లలో పారదర్శకత కోసం ముందే న్యాయ సమీక్షకు పంపించటమనేది చరిత్రాత్మకం. ఇటీవల టీటీడీ జమా ఖర్చుల్ని కాగ్ ఆడిట్ పరిధిలోకి తేవాలనుకోవటమూ మున్నెన్నడూ చూడనిదే. ఈ చిత్తశుద్ధే కొన్ని రాజకీయ పక్షాలకు మింగుడుపడటం లేదు. ఏ సంఘటన జరిగినా దాన్ని పెద్దది చేస్తూ... ప్రభుత్వానికి పూస్తూ రాజకీయ లబ్ధికి ఆరాటపడుతున్నాయి. తమ కుట్రబుద్ధిని బయటపెట్టుకుంటున్నాయి. సంఘటన స్థలానికి వెళ్లిన మంత్రులను అడ్డుకుని రచ్చకు ప్రయత్నించటం... అదే వ్యక్తులు అక్కడికి కొద్ది దూరంలోని వేరొక మతానికి చెందిన ప్రార్థన మందిరంపై రాళ్లు రువ్వటం, అద్దాలు పగలగొట్టడం ఈ కుట్రను స్పష్టంగా బయటపెట్టేవే. ఈ విషయంలో నిష్పాక్షికంగా ఆలోచించేవారికి కలిగే సందేహమొక్కటే? ఇలాంటి చర్యల ద్వారా వీళ్లు సాధించాలనుకుంటున్నదేంటి? ఏం చేయాలని రాళ్లేశారు? అసలిలా మతాల మధ్య చిచ్చు పెట్టడం ఏ మేరకు ధర్మం? రాజకీయ లబ్ధి కోసం మరీ ఇంతలా దిగజారుతారా? ప్రజాస్వామ్య పాలనలో ఇలాంటివి ధర్మమేనా? ఇది ప్రభుత్వ ధర్మాగ్రహం. విచారణలో బయటపడే దోషులు... మతాల మధ్య చిచ్చుతో రాజకీయ లబ్ధికి ఆరాటపడుతున్న కుట్రదారులు ఈ ఆగ్రహాన్ని చవిచూడక తప్పదనే అనుకోవాలి!. చదవండి: ఈ అలజడి ఎవరి మనోరథం? -
ఈ అలజడి ఎవరి మనోరథం?
సాక్షి, అమరావతి: అంతర్వేది శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయ రథం దగ్ధం ఘటనలో ప్రభుత్వం విచారణను వేగవంతం చేసింది. ఘటనపై తక్షణం స్పందిస్తూ వెనువెంటనే చర్యలకు ఉపక్రమించింది. పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించింది. ఈ ఘటన దురదృష్టకరమని, బాధ్యులు ఎవరైనాసరే విడిచిపెట్టే ప్రసక్తే లేదని ప్రకటించింది. ఇంత చిత్తశుద్ధితో ప్రభుత్వం వ్యవహరిస్తుంటే కొందరు పనిగట్టుకుని దీన్ని రాజకీయం చేస్తూ.. ప్రజల్లో అలజడి సృష్టించాలని పన్నాగం పన్నినట్లు జరుగుతున్న ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి వాటిని ఉపేక్షించే ప్రసక్తే లేదని, ఈ ఘటన ఆధారంగా రాజకీయ ప్రయోజనాల కోసం కుట్రలకు పాల్పడే అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. సత్వరమే స్పందించిన ప్రభుత్వం – జిల్లా మంత్రి వేణుగోపాలకృష్ణ, కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, ఏలూరు రేంజ్ డీఐజీ మోహనరావు, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఇతర అధికారులు ఆదివారం ఉదయమే ఆలయానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంలు ఆధారాలు సేకరించాయి. అన్ని కోణాల్లో విచారణ సాగుతోంది. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి అగ్నిమాపక, దేవాదాయ, రెవెన్యూ అధికారులతో ఓ కమిటీని నియమించారు. – విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న ఆలయ కార్యనిర్వాహణ అధికారి(ఈవో) నల్లం సూర్య చక్రధరరావును ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో యర్రశెట్టి భద్రజీరావును కొత్త ఈవోగా నియమించింది. సీసీ కెమెరాల పర్యవేక్షణ సిబ్బంది, భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకుంది. – రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌తోపాటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మంత్రులు వేణగోపాలకృష్ణ, పినెపి విశ్వరూప్ రెండవసారి మంగళవారం అంతర్వేది వెళ్లి దర్యాప్తు తీరును సమీక్షించారు. – కొత్త రథం నిర్మాణానికి రూ.95 లక్షలు వెంటనే మంజూరు చేసింది. వచ్చే ఫిబ్రవరి నాటికి కొత్త రథం తయారవుతుందని మంత్రి వెలంపల్లి ప్రకటించారు. కుట్రకు యత్నిస్తున్న అసాంఘిక శక్తులు – ఈ ఘటనలో ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం దీన్ని రాజకీయ లబ్ధికి వాడుకోవాలని కుట్రలు పన్నుతుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా బయట నుంచి అసాంఘిక శక్తులను అంతర్వేదిలోకి పంపించి మరీ ఉద్రిక్తతలను సృష్టించడానికి యత్నించడం వారి కుట్రను తేటతెల్లం చేస్తోంది. – ప్రతిపక్ష నేత చంద్రబాబు తమ పార్టీ నేతలు ముగ్గురితో కమిటీ వేశారు. ఆ కమిటీ ఆలయాన్ని పరిశీలించి రాజకీయ విమర్శలు చేయడం ద్వారా ప్రజల మనోభావాలను రెచ్చగొట్టేందుకు యత్నించడం గమనార్హం. – ఆ మర్నాడే కొందరు అసాంఘిక శక్తులు అంతర్వేదిలో ఉద్రిక్తతలు సృష్టించేందుకు రంగంలోకి దిగడం ఆందోళన కలిగిస్తోంది. ముగ్గురు మంత్రుల పర్యటనను అడ్డుకునేందుకు మంగళవారం నానా రభస చేయడమే కాకుండా దాడులకు తెగించడం గమనార్హం. విజయవాడ నుంచి వచ్చిన కొందరు ఈ దాడులకు పాల్పడినట్టు తెలుస్తోంది. – వారు ఏకంగా అంతర్వేదిలో ఓ ప్రార్థనా మందిరంపై రాళ్లు రువ్వడం ఆందోళనకరంగా మారింది. ఉద్దేశ పూర్వకంగా ఉద్రిక్తతలు సృష్టించడానికే ఇంతకు తెగించారన్నది స్పష్టమవుతోంది. ప్రశాంతంగా ఉన్న గోదావరి జిల్లాలో వర్గ ఘర్షణలను రేకెత్తించడానికి రాజకీయ శక్తులు పకడ్బందీగా పన్నాగం పన్నుతున్నాయన్నది తేటతెల్లమవుతోంది. శాంతిభద్రతల పరిరక్షణకు అగ్రప్రాధాన్యం – ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు యత్నించే అసాంఘిక శక్తులపట్ల కఠినంగా ఉండాలని పోలీసు, రెవెన్యూ ఉన్నతాధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అదనపు పోలీసు బలగాలను అంతర్వేదికి పంపింది. – రాళ్లు రువ్వి అంతర్వేదిలో అలజడులు సృష్టించేందుకు యత్నించిన దాదాపు 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ యాక్ట్ 30ని విధించారు. బయట వ్యక్తులు ఎవరూ అంతర్వేదిలోకి ప్రవేశించకుండా నిషేధాజ్ఞలు విధించారు. – అదనపు డీజీ(శాంతిభద్రతలు) రవిశంకర్ అయ్యన్నార్ అంతర్వేదిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఆయన మంగళవారం రాత్రి విజయవాడ వచ్చి డీజీపీ గౌతం సవాంగ్‌కు పరిస్థితిని వివరించారు. – ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్‌రావును అంతర్వేదిలో క్యాంప్ చేయాల్సిందిగా డీజీపీ సవాంగ్ ఆదేశించారు. ప్రస్తుతం అంతర్వేదిలో పరిస్థితి అంతా అదుపులో ఉంది. ఎంతటివారినైనా ఉపేక్షించం అంతర్వేది ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశాం. కేసు దర్యాప్తులో ఇప్పటికే పురోగతి సాధించాం. పూర్తి వాస్తవాలు త్వరలో వెల్లడిస్తాం. దోషులు ఎంతటి వారైనాసరే ఉపేక్షించం. మరోవైపు ఈ సంఘటనను అవకాశంగా చేసుకుని సమాజంలో ఉద్రిక్తతలు సృష్టించాలని యత్నించే అసాంఘిక శక్తులపట్ల కఠినంగా వ్యవహరిస్తాం. పరిస్థితి అంతా అదుపులో ఉంది. ప్రజలు వదంతులను నమ్మొద్దు. ప్రభుత్వానికి పోలీసులకు సహకరించాలని కోరుతున్నాం. – గౌతం సవాంగ్, డీజీపీ -
అంతర్వేదిలో మంత్రుల పర్యటన
-
ఫిబ్రవరిలోగా అంతర్వేది రథ నిర్మాణం
సాక్షి, విజయవాడ: అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటన చాలా బాధాకరమని దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. దేవదాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీతో కలిసి ఆయన సోమవారం మాట్లాడారు. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందన్నారు. మానవ తప్పిదమా....కావాలని ఎవరన్నా చేసిందా అనేదానిపై లోతైన విచారణ జరుగుతుందన్నారు. ఫిబ్రవరిలోగా 95 లక్షల రూపాయలతో అంతర్వేది రథం నిర్మాణం జరిగే విధంగా ఆదేశాలు జారీ చేసిన్నట్లు తెలిపారు. (అంతర్వేది ఆలయ రథం దగ్ధం) హిందువుల దేవాలయాల గురించి టీడీపీకి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. పుష్కరాల వంకతో 40 గుళ్లు కూల్చేసిన చంద్రబాబు... గోదావరి పుష్కరాల్లో 23మందిని పొట్టనపెట్టుకున్న విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతర్వేది ఘటనపై నిజ నిర్దారణ కమిటీ వేసిన చంద్రబాబు.. పుష్కరాల్లో 23 మందిని పొట్టన పెట్టుకున్నపుడు ఎందుకు నిజ నిర్ధారణ వేయలేదని సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్‌లో జరగకుండా ప్రతి దేవాలయంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని ప్రతిపక్షాలు కుట్ర చేశాయనే అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ప్రభుత్వాన్ని ఒక కులానికి అంటగట్టాలని చూస్తున్నారని మంత్రి వెలంపల్లి అన్నారు. శాసనమండలిలో నారా లోకేష్‌కు సవాల్ విసిరితే పారిపోయారని, అలాంటి వ్యక్తి ప్రభుత్వాన్ని విమర్శించడమా అని ఎద్దేవా చేశారు. రథం దగ్ధం ఘటనపై ఆలయ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశామని అలాగే ఈవోని బదిలీ చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే అంతర్వేదిలో సీసీ కెమెరా విభాగం చూసే ఉద్యోగిని సస్పెండ్ చేసినట్లు చెప్పారు. విజయవాడ దుర్గగుడిలో జరిగిన క్షుద్ర పూజలపై విచారణ చేయిస్తున్నామని, హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండ చూస్తామని, రాజకీయ కోణంలో కావాలని కొన్ని పార్టీలు విమర్శలు చేస్తున్నాయన్నారు. సోషల్ మీడియాలో వచ్చే అవాస్తవాలు నమ్మవద్దు అని ప్రతి ఒక్కరికి కోరుతున్నమని మంత్రి విజ్ఞప్తి చేశారు. -
అంతర్వేది ఆలయ రథం దగ్ధం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/మలికిపురం/సఖినేటిపల్లి: తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం శనివారం అర్ధరాత్రి దగ్ధమైంది. రథంపై ఏటా కల్యాణోత్సవాల తరువాత స్వామి, అమ్మవార్ల ఊరేగింపు వైభవోపేతంగా జరుగుతుంది. రథం దగ్ధం కావడంతో ఆదివారం భక్తులు ఆలయం వద్దకు చేరుకుని దోషులను కఠినంగా శిక్షించాలని ఆందోళన చేశారు. 40 అడుగుల ఎత్తు ఉన్న ఈ రథాన్ని ఆలయానికి నైరుతి దిక్కున ఉన్న పెద్ద షెడ్లో ఉంచారు. రథం వద్ద శనివారం అర్ధరాత్రి ఒంటిగంట తరువాత మంటలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్ వచ్చేలోపే రథం ఆహుతైంది. తేనెపట్టు సేకరణ వల్లే..: రథం షెడ్డులో ఉన్న తేనెపట్టును సేకరించేందుకు కొందరు చేసిన యత్నం ఏకంగా రథం దగ్ధానికి కారణమైనట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. రథం ఎత్తుతో సమానంగా షెడ్డును ఇక్కడ నిర్మించారు. ఏటా ఉత్సవాలు పూర్తయ్యాక ఈ షెడ్డులో రథాన్ని ఉంచుతారు. షెడ్డు ఒకవైపు తెరచి, మూడువైపుల మూసి ఉంటుంది. తెరచి ఉంచిన వైపు రథాన్ని తాటాకులతో కప్పి ఉంచుతారు. షెడ్డులో ఇటీవల తేనెపట్టులు పట్టాయి. తేనెను పట్టుకునేందుకు శనివారం రాత్రి కొందరు విఫలయత్నం చేశారు. 20 అడుగులున్న గెడ తెచ్చి, దానికి కాగడా కట్టేందుకు కొక్కెం కట్టారు. కాగడాతో తేనెటీగలను చెదరగొట్టే యత్నం చేశారు. కాగడా ప్రమాదవశాత్తూ ఊడిపోయి, రథానికి ఒకవైపు ఉన్న తాటాకులపై పడింది. దీంతో మంటలు లేచాయి. ఈ మంటలకు రథం దగ్థమైంది. విజయవాడ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులకు దీనిపై ఆధారాలు లభించినట్లు తెలిసింది. మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యే రాపాక, దేవదాయ శాఖ, పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి అంతర్గత విచారణకు ఆదేశించారు. నిందితులపై కఠిన చర్యలు: మంత్రి వెలంపల్లి ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఘటనపై దేవదాయ కమిషనర్ అర్జునరావుతో పాటు జిల్లా ఎస్పీతో మాట్లాడి విచారణకు ఆదేశించారు. కొత్త రథం ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టాలంటూ కమిషనర్‌కు సూచించారు. పూర్తిస్థాయిలో విచారణ: డీజీపీ ప్రమాదంపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. ఫోరెన్సిక్ డైరెక్టర్ నేతృత్వంలోని బృందం ప్రమాద ప్రదేశంలో ఆధారాలు సేకరిస్తోందని ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు.. దీనిపై పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఏలూరు రేంజి డీఐజీ మోహన్‌రావు తెలిపారు. సఖినేటిపల్లి పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. ఘటనలో కుట్ర కోణంపై ఆధారాలు లభించలేదన్నారు. -
నరసన్నకు వైభవంగా మహాజ్యేష్టాభిషేకం
సప్తనదీ జలాలతో అభిషేకం పోటెత్తిన భక్తులు అంతర్వేది (సఖినేటిపల్లి) : అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో శుక్రవారం స్వామివారి మూలవిరాట్‌కు సప్తనదీ జలాలతో మహాజ్యేష్టాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.దేముళ్లు పర్యవేక్షణలో ట్రస్ట్‌బోర్డు సభ్యులు, ప్రధానార్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేదపండితుడు చింతా వెంకటశాస్త్రి ఆధ్వర్యంలో అర్చకులు ఈ అభిషేకాన్ని కనులు పండువుగా నిర్వహించారు. జ్యేష్ట మాసం శుద్ధపౌర్ణమి(జ్యేష్టా నక్షత్ర మహాపర్వదినం)సందర్భంగా ప్రాంతాలన్నీ సుభిక్షంగా ఉండాలని, శ్రీస్వామివారికి దివ్య తేజస్సు నిమిత్తం ఈ సప్త నదీ తీర్థ మహాజ్యేష్టాభిషేకం(సప్త నదీ జలాలతో అభిషేకం)చేశారు. మూలవిరాట్‌కు మహాజ్యేష్టాభిషేకం నిర్వహిస్తున్నంత సమయంలో భక్తులు స్వామిని భక్తి శ్రద్థలతో కొలుస్తూ భక్తి పారవశ్యంలో ఓలలాడారు. విష్వక్సేన పూజతో.... శ్రీవైఖానసాగమానుసారం శ్రీవైష్ణవ సంప్రదాయ ప్రకారం విష్వక్సేన పూజతో అర్చకులు మహాజ్యేష్టాభిషేకానికి శ్రీకారం చుట్టారు. ఈ అభిషేకానికి గంగా, యమున, సరస్వతి, వశిష్ట గోదావరి, నర్మదా, సింధు, కావేరి నదుల పవిత్ర జలాలను వినియోగించారు. స్థానిక భక్తులతో పాటు, వేర్వేరు ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొని, స్వామిని కొలిచారు. అర్చకస్వాములు దీక్షాధారణ.... మహాజ్యేష్టాభిషేకం పురస్కరించుకుని అర్చకులు విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం నిర్వహించి దీక్షాధారణ చేశారు. సప్తనదీ జలాలతో నింపిన కలశలకు, పంచామృతాలతో నింపిన కలశలకు అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అగ్నిమధనం చేసి, ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమగుండంలో అగ్ని ప్రతిష్ఠాపన చేశారు. పవిత్ర జలాల కలశలతో ప్రదక్షిణం... మూలవిరాట్‌కు అభిషేకం చేసే పవిత్ర జలాల కలశలను ఆలయ ప్రధానార్చకుడు కిరణ్, అర్చకస్వాములు శిరస్సులపై ధరించి ఆలయ ప్రదక్షిణం చేసి, స్వామికి మహాజ్యేష్టాభిషేకం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ప్రీతికరమైన తామరపూవులు, ఆవునెయ్యితో కలిపి ప్రధానార్చకుడు కిరణ్ మహాశాంతి హోమం నిర్వహించారు. అనంతరం స్వామివారిని పూవులతో అలంకరించి విశేషార్చన, బాలభోగ నివేదన గావించారు. భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు వీరా మల్లిబాబు, తిరుమాని ఆచార్యులు, యెనుముల శ్రీరామకృష్ణ, గంటా నాయుడు, ఎస్ శ్రీనుబాబు, ఆలయ పర్యవేక్షకుడు డి.రామకృష్ణంరాజు, సీనియర్ అసిస్టెంట్ జె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
నేత్రపర్వం.. నరసన్న తెప్పోత్సవం
హంస వాహనంపై దేవేరులతో స్వామివారి విహారం అంతర్వేది(సఖినేటిపల్లి) : శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా చివరిరోజు శనివారం స్థానిక మంచినీటి చెరువులో హంస వాహనంపై శ్రీస్వామి, అమ్మవార్ల తెప్పోత్సవం నేత్రపర్వంగా సాగింది. అంతకుముందు ఆలయం వద్ద నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్పక వాహనంపై ఊరేగింపుగా చెరువు వద్దకు అర్చకులు, భక్తులు తీసుకువచ్చారు. తెప్పోత్సవానికి ముందు ఆలయ ప్రధాన అర్చకుడు కిరణ్, మాజీ ప్రధాన అర్చకుడు బుచ్చిబాబు చెరువు వద్ద గంగపూజ నిర్వహించారు. పుష్పకవాహనంపై కొలువుదీరిన స్వామిని వేదమంత్రాలతో స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేదపండితుడు చింతా వేంకటశాస్త్రి, అర్చకులు, భక్తుల గోవింద నామస్మరణలతో తెప్పపైకి అధిరోహింపజేశారు. ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు, ఉత్సవ సేవా కమిటీ సభ్యులు కొబ్బరి కాయలు కొట్టి తెప్పోత్సవాన్ని ప్రారంభించారు. దేవస్థానం ఏర్పాటు చేసిన బాణాసంచా కాల్పులు భక్తులను అలరించాయి. వెన్నెల, దీప కాంతుల నడుమ భీమేశ్వరుని తెప్పోత్సవం ద్రాక్షారామ (రామచంద్రపురం): శ్రీమాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ఆలయ ప్రాంగణలో గల సప్తగోదావరి నదిలో స్వామి వారి తెప్పోత్సవం కనుల పండువగా నిర్వహించారు. దివి నుంచి చంద్రుని పున్నమి వెన్నెల... భువి నుంచి రంగు రంగుల విద్యుత్‌దీప కాంతుల నడుమ సప్తగోదావరిలో స్వామివారి తెప్పోత్సవాన్ని తిలకించిన భక్తులు పులకించిపోయారు. ప్రత్యేకంగా అలకరించిన స్వామి, అమ్మవార్లను ఆలయం నుంచి తోడ్కొని వచ్చి విద్యుత్ దీపాలతో ఆలకరించిన హంసవానంలో ఉంచి పూజలు నిర్వహించారు. మూడు సార్లు నదిలో తెప్పోత్సవం జరిపారు. ఈఓ పెండ్యాల వెంకటచలపతిరావు, వేగాయమ్మపేట జమీందారు వాడ్రేవు సుందర రత్నాకర్, పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అక్షింతల కోసం తోపులాట
కర్రలకు.. కాగడాలకు పని చెప్పిన పోలీసులు అమలాపురం / సఖినేటిపల్లి : పదే..పదే..అదే సీను. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం కళ్యాణం పూర్తయిన వెంటనే కళ్యాణ తలంబ్రాల కోసం భక్తులు ఎగబడడం.. తోపులాట చోటు చేసుకోవడం.. నిలువరించలేక పోలీసులు చేతులు ఎత్తివేయడం అనవాయితీగా మారింది. ఈసారీ అంతే.. కాకపోతే భక్తులను అదుపు చేయడానికి కర్రలు, కాగడాలకు పనిచెప్పాల్సి వచ్చింది. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం మంగళవారం తెల్లవారు జామున 1.30 గంటలకు ముగిసింది. తలంబ్రాల అక్షింతల కోసం భక్తుల కళ్యాణ వేదిక వద్దకు చొచ్చుకు వచ్చారు. కళ్యాణ నిర్వాహకులు భక్తుల కోసం పెద్ద ఎత్తున అక్షింతలు సిద్ధం చేయడంతో పాటు భక్తుల కూర్చున్న బాక్సుల వద్దకు వచ్చి పోలీసులు, సిబ్బంది అందిస్తారని పదేపదే చెప్పినా భక్తజనం లెక్కచేయలేదు. ఒక్క ఉదుటన కళ్యాణ వేదిక వద్దకు నెట్టుకుంటూ వచ్చారు. దీంతో తోపులాట చోటు చేసుకుంది. వేదిక మీద ఉన్న పోలీసు అధికారులు, రక్షణగా ఉన్న సిబ్బంది అత్యుత్సాహానికి పోయిన వేదిక వద్దనే అక్షింతల పంపిణీ ఆరంభించారు. వాటిని అందిపుచ్చుకోవాలని భక్తులు ఆతృత చూపడడంతో తోపులాట పెరిగింది. ఒకానొక సమయంలో తొక్కిసలాట జరిగే పరిస్థితి ఏర్పడడంతో భక్తులు భయబ్రాంతులకు లోనయ్యారు. వేదిక వద్ద అక్షింతలు పంపిణీ చేయవద్దని పదేపదే మైకులో నిర్వాహకులు చెప్పినా అక్కడున్న పోలీసులు పట్టించుకోలేదు. కింద ఉన్న పోలీసులు భక్తులను అదుపు చేయలేక బారికేడ్ల కట్టేందుకు ఉపయోగించిన కర్రలను, స్వామివారి పల్లకి కూడా వచ్చే కాగడాల మంటలతో భక్తులు వెనక్కు నెట్టేందుకు ప్రయత్నించారు. కొంత మంది పోలీసులు కర్రలతో భక్తులపై దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి. సుమారు గంటల పాటు కళ్యాణ వేదిక వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అక్షింతలు అవసరం లేదని భక్తులు బయటకు వెళ్లిపోదామన్నా నలువైపులా దారులు మూసుకుపోవడంతో అష్టకష్టాలు పడి బయటకు వచ్చారు. ఆలయంలో స్వామి వారి దర్శనానికి వెళ్లేటప్పుడు అక్షింతలు ఇస్తామనడంతో పరిస్థితి సద్దుమణిగింది. అక్షింతల సమయంలో తోపులాట జరగడం పరిపాటిగా మారిన పోలీసులు ముందస్తు చర్చలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. -
మునిగిన పడవ: తప్పిన ప్రమాదం
కాకినాడ: చేపల వేటకు వెళ్లి తిరిగి వస్తున్న బోటు తూర్పు గోదావరి జిల్లా సాగర సంగమం అంతర్వేది సమీపంలో సముద్రంలో మునిగిపోయింది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. వివరాలు.. కాకినాడకు చెందిన మత్య్సకారులు సముద్రంలో వేటకు వెళ్లి తిరిగి వస్తుండగా.. వారు ప్రయాణిస్తున్న బోటు ప్రమాదవశాత్తు మునిగిపోయింది. అయితే ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న మరో బోటులో ఉన్న మత్స్యకారులు ఈ విషయాన్ని గమనించి మునిగిపోతున్న బోటులో ఉన్న ఏడుగురిని కాపాడారు. కాగా, ఈ ఘటనలో రూ. 20లక్షల విలువ చేసే బోటుతోపాటు, రూ.లక్ష విలువ చేసే చేపలు కూడా మునిగిపోయాయి.