అక్షింతల కోసం తోపులాట
అక్షింతల కోసం తోపులాట
Published Tue, Feb 7 2017 11:29 PM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM
కర్రలకు.. కాగడాలకు పని చెప్పిన పోలీసులు
అమలాపురం / సఖినేటిపల్లి : పదే..పదే..అదే సీను. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం కళ్యాణం పూర్తయిన వెంటనే కళ్యాణ తలంబ్రాల కోసం భక్తులు ఎగబడడం.. తోపులాట చోటు చేసుకోవడం.. నిలువరించలేక పోలీసులు చేతులు ఎత్తివేయడం అనవాయితీగా మారింది. ఈసారీ అంతే.. కాకపోతే భక్తులను అదుపు చేయడానికి కర్రలు, కాగడాలకు పనిచెప్పాల్సి వచ్చింది. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం మంగళవారం తెల్లవారు జామున 1.30 గంటలకు ముగిసింది. తలంబ్రాల అక్షింతల కోసం భక్తుల కళ్యాణ వేదిక వద్దకు చొచ్చుకు వచ్చారు. కళ్యాణ నిర్వాహకులు భక్తుల కోసం పెద్ద ఎత్తున అక్షింతలు సిద్ధం చేయడంతో పాటు భక్తుల కూర్చున్న బాక్సుల వద్దకు వచ్చి పోలీసులు, సిబ్బంది అందిస్తారని పదేపదే చెప్పినా భక్తజనం లెక్కచేయలేదు. ఒక్క ఉదుటన కళ్యాణ వేదిక వద్దకు నెట్టుకుంటూ వచ్చారు. దీంతో తోపులాట చోటు చేసుకుంది. వేదిక మీద ఉన్న పోలీసు అధికారులు, రక్షణగా ఉన్న సిబ్బంది అత్యుత్సాహానికి పోయిన వేదిక వద్దనే అక్షింతల పంపిణీ ఆరంభించారు. వాటిని అందిపుచ్చుకోవాలని భక్తులు ఆతృత చూపడడంతో తోపులాట పెరిగింది. ఒకానొక సమయంలో తొక్కిసలాట జరిగే పరిస్థితి ఏర్పడడంతో భక్తులు భయబ్రాంతులకు లోనయ్యారు. వేదిక వద్ద అక్షింతలు పంపిణీ చేయవద్దని పదేపదే మైకులో నిర్వాహకులు చెప్పినా అక్కడున్న పోలీసులు పట్టించుకోలేదు. కింద ఉన్న పోలీసులు భక్తులను అదుపు చేయలేక బారికేడ్ల కట్టేందుకు ఉపయోగించిన కర్రలను, స్వామివారి పల్లకి కూడా వచ్చే కాగడాల మంటలతో భక్తులు వెనక్కు నెట్టేందుకు ప్రయత్నించారు. కొంత మంది పోలీసులు కర్రలతో భక్తులపై దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి. సుమారు గంటల పాటు కళ్యాణ వేదిక వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అక్షింతలు అవసరం లేదని భక్తులు బయటకు వెళ్లిపోదామన్నా నలువైపులా దారులు మూసుకుపోవడంతో అష్టకష్టాలు పడి బయటకు వచ్చారు. ఆలయంలో స్వామి వారి దర్శనానికి వెళ్లేటప్పుడు అక్షింతలు ఇస్తామనడంతో పరిస్థితి సద్దుమణిగింది. అక్షింతల సమయంలో తోపులాట జరగడం పరిపాటిగా మారిన పోలీసులు ముందస్తు చర్చలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు.
Advertisement