సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/మలికిపురం/సఖినేటిపల్లి: తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం శనివారం అర్ధరాత్రి దగ్ధమైంది. రథంపై ఏటా కల్యాణోత్సవాల తరువాత స్వామి, అమ్మవార్ల ఊరేగింపు వైభవోపేతంగా జరుగుతుంది. రథం దగ్ధం కావడంతో ఆదివారం భక్తులు ఆలయం వద్దకు చేరుకుని దోషులను కఠినంగా శిక్షించాలని ఆందోళన చేశారు. 40 అడుగుల ఎత్తు ఉన్న ఈ రథాన్ని ఆలయానికి నైరుతి దిక్కున ఉన్న పెద్ద షెడ్‌లో ఉంచారు. రథం వద్ద శనివారం అర్ధరాత్రి ఒంటిగంట తరువాత మంటలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్ వచ్చేలోపే రథం ఆహుతైంది.
తేనెపట్టు సేకరణ వల్లే..: రథం షెడ్డులో ఉన్న తేనెపట్టును సేకరించేందుకు కొందరు చేసిన యత్నం ఏకంగా రథం దగ్ధానికి కారణమైనట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. రథం ఎత్తుతో సమానంగా షెడ్డును ఇక్కడ నిర్మించారు. ఏటా ఉత్సవాలు పూర్తయ్యాక ఈ షెడ్డులో రథాన్ని ఉంచుతారు. షెడ్డు ఒకవైపు తెరచి, మూడువైపుల మూసి ఉంటుంది. తెరచి ఉంచిన వైపు రథాన్ని తాటాకులతో కప్పి ఉంచుతారు. షెడ్డులో ఇటీవల తేనెపట్టులు పట్టాయి. తేనెను పట్టుకునేందుకు శనివారం రాత్రి కొందరు విఫలయత్నం చేశారు. 20 అడుగులున్న గెడ తెచ్చి, దానికి కాగడా కట్టేందుకు కొక్కెం కట్టారు. కాగడాతో తేనెటీగలను చెదరగొట్టే యత్నం చేశారు. కాగడా ప్రమాదవశాత్తూ ఊడిపోయి, రథానికి ఒకవైపు ఉన్న తాటాకులపై పడింది. దీంతో మంటలు లేచాయి. ఈ మంటలకు రథం దగ్థమైంది. విజయవాడ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులకు దీనిపై ఆధారాలు లభించినట్లు తెలిసింది. మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యే రాపాక, దేవదాయ శాఖ, పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి అంతర్గత విచారణకు ఆదేశించారు.
నిందితులపై కఠిన చర్యలు: మంత్రి వెలంపల్లి
ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఘటనపై దేవదాయ కమిషనర్ అర్జునరావుతో పాటు జిల్లా ఎస్పీతో మాట్లాడి విచారణకు ఆదేశించారు. కొత్త రథం ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టాలంటూ కమిషనర్‌కు సూచించారు.
పూర్తిస్థాయిలో విచారణ: డీజీపీ
ప్రమాదంపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. ఫోరెన్సిక్ డైరెక్టర్ నేతృత్వంలోని బృందం ప్రమాద ప్రదేశంలో ఆధారాలు సేకరిస్తోందని ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు.. దీనిపై పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఏలూరు రేంజి డీఐజీ మోహన్‌రావు తెలిపారు. సఖినేటిపల్లి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశామన్నారు. ఘటనలో కుట్ర కోణంపై ఆధారాలు లభించలేదన్నారు.
అంతర్వేది ఆలయ రథం దగ్ధం
Published Mon, Sep 7 2020 4:55 AM | Last Updated on Mon, Sep 7 2020 9:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment