లక్షల్లో వచ్చినా ఇబ్బంది ఉండొద్దు: యాదాద్రిపై సీఎం కేసీఆర్‌ | CM KCR Visited Yadadri Temple Observed Works | Sakshi
Sakshi News home page

లక్షల్లో వచ్చినా ఇబ్బంది ఉండొద్దు: యాదాద్రిపై సీఎం కేసీఆర్‌

Published Tue, Jun 22 2021 3:48 AM | Last Updated on Tue, Jun 22 2021 7:53 AM

CM KCR Visited Yadadri Temple Observed Works - Sakshi

సాక్షి, యాదాద్రి:  ‘‘లక్షల మంది భక్తులు ఒకేసారి వచ్చినా ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు సరిపోవాలి. కరోనా అదుపులోకి వచ్చినందున రెండున్నర నెలల్లో యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను పూర్తి చేయాలి..’’ అని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. వరంగల్‌ పర్యటన అనంతరం సీఎం కేసీఆర్‌ సోమవారం సాయంత్రం 6.20 గంటలకు యాదాద్రికి చేరుకున్నారు. ఆలయంతోపాటు రింగ్‌రోడ్డు పక్కన జరుగుతున్న గండి చెరువు, కల్యాణకట్ట, దీక్షాపరుల మండపం, లక్ష్మి పుష్కరిణి పనులను పరిశీలించారు. యాదగిరిగుట్ట పట్టణంలో చేపట్టిన రింగ్‌రోడ్డుతో ఇళ్లు కోల్పోతున్న బాధితులతో మాట్లాడి, న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. 

పనులను పరిశీలించి.. 
తొలుత గుట్ట కింద పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్‌.. తర్వాత ప్రధాన ఆలయానికి చేరుకున్నారు. ఆలయ క్యూలైన్లలో నడుస్తూ చూశారు. తూర్పు రాజగోపురం, సుదర్శన గోపురాలతోపాటు మేలిమి వర్ణంతో ధగధగలాడుతున్న ప్రధానాలయ గోపురాలను, విద్యుత్‌ దీప కాంతులను ప్రత్యేకంగా పరిశీలించారు. ఆ విద్యుత్‌ దీపాల సాంకేతికతను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ప్రధానాలయం లోపల యాలీ పిల్లర్లు, ఆళ్వార్‌ మండపాలను పరిశీలించారు. గర్భాలయంలో స్వామివారికి మొక్కి హారతి తీసుకుని పడమర రాజగోపురం నుంచి బయటికి వచ్చారు. కొండపై ఉన్న గెస్ట్‌హౌస్‌కు చేరుకుని, సుమారు రెండు గంటల పాటు అధికారులతో సమీక్షించారు. 

రింగ్‌రోడ్డు లోపల ఆలయ నిర్మాణాలే.. 
రింగ్‌ రోడ్‌ పరిధిలో ఉన్న భూములపై వెంటనే డీజీపీఎస్‌ సర్వే నిర్వహించాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. రింగ్‌ రోడ్‌ పరిధి లోపల కేవలం ఆలయానికి సంబంధించిన నిర్మాణాలు మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. పనుల్లో అలసత్వం పనికిరాదని, ఆలయం లోపల, ఆలయానికి అనుబంధంగా జరుగుతున్న ఇతర నిర్మాణ పనులన్నీ వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. క్యూ కాంప్లెక్స్‌ బిల్డింగ్, ఎస్కలేటర్లు, ఆర్నమెంటల్‌ ఎలివేషన్, లాండ్‌ స్కేపింగ్, బీటీ రోడ్, పుష్కరిణి, కల్యాణ కట్ట, పార్కింగ్, ఇతర నిర్మాణాల పనులపై వివరంగా చర్చించారు. మొత్తంగా రెండున్నర నెలల్లో ఆలయ నిర్మాణ పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు. పనులు వేగంగా జరగని చోట వర్కింగ్‌ ఏజెన్సీలను మార్చాలన్నారు. టెంపుల్‌ టౌన్‌లో చేపట్టే కాటేజీల నిర్మాణానికి వైటీడీఏ ఆధ్వర్యంలో టెండర్లు పిలిచి, అద్భుతంగా నిర్మించే వర్కింగ్‌ ఏజెన్సీలకు పనులను అప్పగిస్తామని తెలిపారు. ఒకసారి ఆలయం ప్రారంభమైతే భక్తులు భారీగా వస్తారని.. అందుకు అనుగుణంగా నిర్మాణాలు, ఇతర ఏర్పాట్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బస్‌డిపో, బస్టాండ్‌ నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రభుత్వం నుంచి విడుదల చేస్తామని, వారంలోగా నిర్మాణ పనులను ప్రారంభించాలని ఆర్టీసీ అధికారులను సీఎం ఆదేశించారు. ఈ పర్యటనలో సీఎం వెంట మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్యే గొంగిడి సునీత, జెడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ప్రత్యేక పూజలు.. గిరి ప్రదక్షిణ 
గుట్టపై బాలాలయంలో లక్ష్మీనర్సింహస్వామిని సీఎం కేసీఆర్‌ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సోమవారం స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం, ఏకాదశి కలసి రావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంకు స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. స్వాతి నక్షత్రం సందర్భంగా సీఎం కేసీఆర్‌ గిరి ప్రదక్షిణ మాదిరిగా యాదాద్రి చుట్టూ ప్రత్యేక కాన్వాయ్‌లో రెండుసార్లు తిరిగారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement