
అంతర్వేది ఆలయంలో హిందూ ధార్మిక సంఘాలతో సమావేశమైన మంత్రులు శ్రీనివాస్, విశ్వరూప్, గోపాలకృష్ణ
సఖినేటిపల్లి/సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం దగ్థమైన çఘటనలో అవసరమైతే సీబీఐ విచారణకు వెనుకాడబోమని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ దుర్ఘటనను రాష్ట్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోందని.. దీనిపై లోతైన విచారణ జరుగుతోందని చెప్పారు. మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దేవదాయ కమిషనర్ అర్జునరావు, ఆర్‌జేసీ భ్రమరాంబ, రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్‌పర్సన్ అమ్మాజీ, ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావులతో కలిసి ఘటనా స్థలాన్ని వెలంపల్లి మంగళవారం సందర్శించారు.
ఈ సమయంలో వీహెచ్‌పీ. భజరంగదళ్, హిందూ ధార్మిక సంఘాలు, హిందూ చైతన్య వేదిక, ధర్మవీర్ ఆధ్యాత్మిక వేదిక, సంఘ్ పరివార్ కార్యకర్తలు అక్కడకు వచ్చి ఆందోళన చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో మంత్రులు ఆందోళనకారుల తరఫున ధార్మిక సంఘ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రవికుమార్‌తో చర్చించారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ.. ఈ ఘటనను కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా చర్యలకు వెనుకాడేది లేదని స్పష్టంచేశారు. శ్రీశైలంలో గత ఐదేళ్లల్లో జరిగిన అవినీతికి సంబంధించి 30 మంది సిబ్బందిని సస్పెండ్ చేసిన విషయాన్ని వెలంపల్లి వారికి గుర్తుచేశారు.
ఆలయ ఈవోపై ప్రభుత్వం వేటు
కాగా, రథం ఉన్న పరిసరాల్లో పర్యవేక్షణ లోపం ఉండడంతో ఈవో ఎన్‌ఎస్ చక్రధరరావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావు ఉత్తర్వులు జారీచేశారు. అలాగే, ఆలయానికి కొత్త రథం తయారీ, రథశాల మరమ్మతుల నిమిత్తం కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నుంచి రూ.95 లక్షలను ఆయన మంజూరు చేశారు.