రక్షాబంధనం చూపెడుతున్న ప్రధానార్చకులు
సాక్షి, యాదగిరిగుట్ట (ఆలేరు) : అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రధాన ఆలయంలో ఆస్థాన పరంగా పూజలు.. బాలాలయ ఉత్సవ మూర్తులకు నిజాభిషేకం, విశ్వక్సేనారాధన, స్వస్తివాచనం, ఉత్సవ నిర్వాహకులకు కంకణ ధారణ, సాయంత్రం పుట్టమట్టిలో నవధాన్యాలను నాటడంతో అంకురారోపణం.. ఇవి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల తొలినాటి పూజా వైభవాలు. ఆలయ అర్చకులు, యజ్ఞాచార్యులు, అర్చక బృందం, పారాయణీకులు పంచరాత్రాగమ శాస్త్రానుసారంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. తొలిపూజలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, కలెక్టర్ అనితారామచంద్రన్, ఆలయ స్థానాచార్యులు రాఘవాచార్యులు,ఈఓ గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, కారంపూడి నర్సింహచార్యులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రుత్వికులు, పారాయణీకులు, పండితులు, ఆచార్యులకు హైదరాబాద్‌లోని సుప్రజ హోటల్ యాజమాన్యం ఆలయం తరపున దీక్షా వస్త్రాలను అందజేసింది.
విశ్వక్సేనారాధన..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బాలాలయంలో నిత్యారాధనలు పూర్తయిన తరువాత ఉదయం 10గంటలకు విశ్వక్సేన ఆరాధనతో ఉత్సవాలను ఆచార్యులు శాస్త్రోక్తంగా జరిపించారు.
రక్షాబంధనం..
కంకణాలను మంత్రాలతో ఆరాధనలుగావించి నృసింహస్వామికి, లక్ష్మీ దేవికి అలంకరించారు. తొలిపూజలో పాల్గొన్న ఆచార్యులకు, రుత్వికుల బంధాలకు, ప్రముఖులకు ధరింపజేశారు.
నిత్యారాధనల అనంతరం..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిత్యారాధనల అనంతరం సాయంత్రం 6.30గంటలకు మత్స్యంగ్రహణ, అంకురారోపణం వేడుకలను ఆచార్యులు నిర్వహించారు. ఈ వేడుకలను స్థానాచార్యులు, ప్రధాన అర్చకులు, యజ్ఞాచార్యులు, అర్చకబృందం, పారాయణీకులచే నిర్వహించారు. కార్యక్రమంలో స్థానాచార్యులు రాఘవాచార్యులు, ప్రధాన అర్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, కారంపూడి నర్సింహచార్యులు, అర్చకులు, ఆలయ అధికారులు తదితరులున్నారు.
మత్స్యంగ్రహణం..
ఆది వరాహమూర్తిగా అవతరించి భూదేవిని ఉద్ధరించిన భగవానుడిని, భూసూక్తంతో భూదేవిని అర్చించి స్వామిని మత్స్యంగ్రహణముకు ప్రార్థించి ఆ మత్తికపై భగవానుడిని చిత్రిస్తారు. పవిత్రమైన మత్తికను ఆయా మంత్రాలతో సేకరించి పాలికలలో నింపుతారు. అంకురారోపణ మంత్రాలతో, నవ ధాన్యాలతో మంత్రించి పాలికలలో నింపి పవిత్ర జలంతో ఉత్సవానంతరం వరకు ప్రతిరోజు ఆరాధనలు గావించేందుకు ఈ వేడుకను ప్రత్యేకంగా జరిపించారు. అదేవిధంగా అంకురం అంటే భీజం. హృదయంలోని భగవంతుడిని దర్శింపజేసిన తీరును అంకురారోపణ అంటారు.
ఉచిత వైద్య శిబిరం..
యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ సన్నిధిలో హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఉన్న ఎంఎస్‌రెడ్డి లయన్స్ క్లబ్ (ఐ) ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 250 మంది భక్తులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.
స్వస్తి వాచనం..
శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో లోకాలన్నీ శుభపరంపరలు పొందడానికి అష్టదిక్పాలకులను, ఇంద్రాది దేవతలను సమస్త దివ్య సంపద కలి గిన దివ్య పురుషులను ఈ వేడుక ద్వారా ఆహ్వా నించి ఆరాధిస్తారు. ఆయా మంత్రాల ప్రభావం వల్ల దివ్య సంపదలు కలిగిన దేవకోటి అనంతమైన సంపదలను సర్వవిధ శుభాలను సమస్త లోకాలకు స్వస్తివాచన పూర్వక శుభపరంపరల ను అందిస్తారు. సమస్త లోకాలు శాంతిమయం కావాలని ఈ స్వస్తి వాచనం నిర్వహిస్తారు.
ఉత్సవాల్లో నేడు..
శ్రీస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఆలయంలో ఉదయం 11గంటలకు ధ్వజారోహణం, వేద పారాయణం నిర్వహిస్తారు. సాయంత్రం 6గంటలకు భేరి పూజ, దేవతాహ్వానం, హవనం జరిపిస్తారు.
పట్టువస్త్రాలను తీసుకొస్తున్న అర్చకులు
యాదాద్రీశుడికి ప్రభుత్వ విప్ పూజలు
యాదగిరిగుట్ట (ఆలేరు) : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలిపూజలో పాల్గొన్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీత బాలాలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ ఆచార్యులు శ్రీస్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందజేశారు. ఈఓ గీతారెడ్డి లడ్డూ ప్రసాదంతో పాటు పట్టుచీరను ఇచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచనలు చేశారు. ఆమె వెంట కలెక్టర్ అనితారామచంద్రన్, ఈఓ గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధ, వైస్ చైర్మన్ కాటంరాజు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కాటబత్తిని ఆంజనేయులు, మల్లాపురం సర్పంచ్ కర్రె వెంకటయ్య, నాయకులు మిట్ట వెంకటయ్య, గడ్డమీది రవీందర్‌గౌడ్ పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట /భూదాన్‌పోచంపల్లి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా భూదాన్ పోచంపల్లికి చెందిన మహాజన సంఘం ఆధ్వర్యంలో చేనేత ఉత్పత్తిదారుల సంఘం వారు బుధవారం పట్టువస్త్రాలను ఈఓ గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తిలకు అందజేశారు. కార్యక్రమంలో పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మీ శ్రీనివాస్, భారత పురుషోత్తం, రుద్ర శ్రీశైలం, రుద్ర పాండురంగాశాస్త్రి, మంగళపల్లి శ్రీహరి, బల్ల దుర్వాసులు, చిట్టిమల్ల లక్ష్మీనారాయణ, కడవేరు శేఖర్, ఏలే పాండు, రుద్ర చెన్నకేశవులు తదితరులున్నారు.
అమ్మవారికి పసుపు, కుంకుమ రంగు చీరెలు...
ఇద్దరు చేనేత కార్మికులు 25 రోజుల పాటు ఎంతో నియమ నిష్టలతో ఉండి, మగ్గంపై పట్టు పంచె, అమ్మవారికి పసుపు, కుంకుమ రంగులో ఉన్న రెండు చీరెలను తయారు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిఏటా పోచంపల్లి పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించే అవకాశం రావడం పట్ల చేనేత కళాకారులు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment