brahmosthavalu
-
కాణిపాకం బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం
సాక్షి, గుంటూరు: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆహ్వానం అందింది. గురువారం సాయంత్రం పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు, కాణిపాకం వినాయక స్వామి ఆలయ అధికారులు తాడేపల్లిలోని సీఎం కార్యాలయంలో ఆయన్ని కలిసి ఆహ్వానపత్రిక అందించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్‌ను ఆహ్వానించారు స్థానిక ఎమ్మెల్యే, కాణిపాక దేవస్థానం ప్రతినిధులు. ఆహ్వనపత్రికతో పాటు వినాయక స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదాలు సీఎం జగన్‌కు అందజేశారు. సీఎం జగన్‌ను ఆహ్వానించిన వారిలో ఆలయ దేవస్ధానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ అగరం మోహన్ రెడ్డి, ఈవో ఎ.వెంకటేశ్ ఉన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం పుణ్యక్షేత్రంలో ఈ నెల 18 నుంచి 21 రోజుల పాటు వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. -
మార్చి 4న యాదాద్రికి అఖండ జ్యోతి
యాదగిరిగుట్ట/భువనగిరి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మార్చి 4న స్వామివారి అఖండజ్యోతి యాదగిరిగుట్టకు రానున్నట్లు అఖండ జ్యోతి యాత్ర చైర్మన్ ఎం.ఎస్.నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారి అఖండజ్యోతి ఉత్సవ విగ్రహాలు హైదరాబాద్‌లోని ధూల్‌పేటలో గణేశ్ అనే కళాకారుడు తయారు చేస్తున్నారని చెప్పారు. ఈనెల 28న సాయంత్రం అఖండ జ్యోతి పూజ జరుగుతుందని, అదే రోజు రాత్రి బర్కత్‌పురాలోని యాదగిరి భవన్‌కు యాత్ర చేరుకుంటుందని వెల్లడించారు. మార్చి 1న ఉదయం 10 గంటలకు బర్కత్‌పురా చౌరస్తాలోని యాదగిరి భవన్ నుంచి అఖండజ్యోతి యాత్ర ప్రారంభమై అదే రోజు రాత్రి ఉప్పల్ చౌరస్తాకు చేరుకుంటుందని తెలిపారు. 2న ఉప్పల్ నుంచి బయల్దేరి రాత్రి ఘట్కేసర్ కేఎల్ఆర్ గార్డెన్‌కు, 3న ఉదయం ఘట్కేసర్ నుంచి బయల్దేరి రాత్రి భువనగిరిలోని నల్లగొండ క్రాస్‌రోడ్‌కు వస్తుందన్నారు. అక్కడ రాత్రి బస చేసి 4న ఉదయం భువనగిరి నుంచి బయల్దేరి రాత్రి యాదగిరిగుట్ట చేరుకుంటుందని వివరించారు. యాదాద్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అధికారులకు అఖండ జ్యోతిని అప్పగిస్తామని పేర్కొన్నారు. -
వైభవోపేతంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు
సాక్షి, యాదగిరిగుట్ట (ఆలేరు) : అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రధాన ఆలయంలో ఆస్థాన పరంగా పూజలు.. బాలాలయ ఉత్సవ మూర్తులకు నిజాభిషేకం, విశ్వక్సేనారాధన, స్వస్తివాచనం, ఉత్సవ నిర్వాహకులకు కంకణ ధారణ, సాయంత్రం పుట్టమట్టిలో నవధాన్యాలను నాటడంతో అంకురారోపణం.. ఇవి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల తొలినాటి పూజా వైభవాలు. ఆలయ అర్చకులు, యజ్ఞాచార్యులు, అర్చక బృందం, పారాయణీకులు పంచరాత్రాగమ శాస్త్రానుసారంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. తొలిపూజలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, కలెక్టర్ అనితారామచంద్రన్, ఆలయ స్థానాచార్యులు రాఘవాచార్యులు,ఈఓ గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, కారంపూడి నర్సింహచార్యులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రుత్వికులు, పారాయణీకులు, పండితులు, ఆచార్యులకు హైదరాబాద్‌లోని సుప్రజ హోటల్ యాజమాన్యం ఆలయం తరపున దీక్షా వస్త్రాలను అందజేసింది. విశ్వక్సేనారాధన.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బాలాలయంలో నిత్యారాధనలు పూర్తయిన తరువాత ఉదయం 10గంటలకు విశ్వక్సేన ఆరాధనతో ఉత్సవాలను ఆచార్యులు శాస్త్రోక్తంగా జరిపించారు. రక్షాబంధనం.. కంకణాలను మంత్రాలతో ఆరాధనలుగావించి నృసింహస్వామికి, లక్ష్మీ దేవికి అలంకరించారు. తొలిపూజలో పాల్గొన్న ఆచార్యులకు, రుత్వికుల బంధాలకు, ప్రముఖులకు ధరింపజేశారు. నిత్యారాధనల అనంతరం.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిత్యారాధనల అనంతరం సాయంత్రం 6.30గంటలకు మత్స్యంగ్రహణ, అంకురారోపణం వేడుకలను ఆచార్యులు నిర్వహించారు. ఈ వేడుకలను స్థానాచార్యులు, ప్రధాన అర్చకులు, యజ్ఞాచార్యులు, అర్చకబృందం, పారాయణీకులచే నిర్వహించారు. కార్యక్రమంలో స్థానాచార్యులు రాఘవాచార్యులు, ప్రధాన అర్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, కారంపూడి నర్సింహచార్యులు, అర్చకులు, ఆలయ అధికారులు తదితరులున్నారు. మత్స్యంగ్రహణం.. ఆది వరాహమూర్తిగా అవతరించి భూదేవిని ఉద్ధరించిన భగవానుడిని, భూసూక్తంతో భూదేవిని అర్చించి స్వామిని మత్స్యంగ్రహణముకు ప్రార్థించి ఆ మత్తికపై భగవానుడిని చిత్రిస్తారు. పవిత్రమైన మత్తికను ఆయా మంత్రాలతో సేకరించి పాలికలలో నింపుతారు. అంకురారోపణ మంత్రాలతో, నవ ధాన్యాలతో మంత్రించి పాలికలలో నింపి పవిత్ర జలంతో ఉత్సవానంతరం వరకు ప్రతిరోజు ఆరాధనలు గావించేందుకు ఈ వేడుకను ప్రత్యేకంగా జరిపించారు. అదేవిధంగా అంకురం అంటే భీజం. హృదయంలోని భగవంతుడిని దర్శింపజేసిన తీరును అంకురారోపణ అంటారు. ఉచిత వైద్య శిబిరం.. యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ సన్నిధిలో హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఉన్న ఎంఎస్‌రెడ్డి లయన్స్ క్లబ్ (ఐ) ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 250 మంది భక్తులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. స్వస్తి వాచనం.. శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో లోకాలన్నీ శుభపరంపరలు పొందడానికి అష్టదిక్పాలకులను, ఇంద్రాది దేవతలను సమస్త దివ్య సంపద కలి గిన దివ్య పురుషులను ఈ వేడుక ద్వారా ఆహ్వా నించి ఆరాధిస్తారు. ఆయా మంత్రాల ప్రభావం వల్ల దివ్య సంపదలు కలిగిన దేవకోటి అనంతమైన సంపదలను సర్వవిధ శుభాలను సమస్త లోకాలకు స్వస్తివాచన పూర్వక శుభపరంపరల ను అందిస్తారు. సమస్త లోకాలు శాంతిమయం కావాలని ఈ స్వస్తి వాచనం నిర్వహిస్తారు. ఉత్సవాల్లో నేడు.. శ్రీస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఆలయంలో ఉదయం 11గంటలకు ధ్వజారోహణం, వేద పారాయణం నిర్వహిస్తారు. సాయంత్రం 6గంటలకు భేరి పూజ, దేవతాహ్వానం, హవనం జరిపిస్తారు. పట్టువస్త్రాలను తీసుకొస్తున్న అర్చకులు యాదాద్రీశుడికి ప్రభుత్వ విప్ పూజలు యాదగిరిగుట్ట (ఆలేరు) : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలిపూజలో పాల్గొన్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీత బాలాలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ ఆచార్యులు శ్రీస్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందజేశారు. ఈఓ గీతారెడ్డి లడ్డూ ప్రసాదంతో పాటు పట్టుచీరను ఇచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచనలు చేశారు. ఆమె వెంట కలెక్టర్ అనితారామచంద్రన్, ఈఓ గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధ, వైస్ చైర్మన్ కాటంరాజు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కాటబత్తిని ఆంజనేయులు, మల్లాపురం సర్పంచ్ కర్రె వెంకటయ్య, నాయకులు మిట్ట వెంకటయ్య, గడ్డమీది రవీందర్‌గౌడ్ పాల్గొన్నారు. యాదగిరిగుట్ట /భూదాన్‌పోచంపల్లి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా భూదాన్ పోచంపల్లికి చెందిన మహాజన సంఘం ఆధ్వర్యంలో చేనేత ఉత్పత్తిదారుల సంఘం వారు బుధవారం పట్టువస్త్రాలను ఈఓ గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తిలకు అందజేశారు. కార్యక్రమంలో పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మీ శ్రీనివాస్, భారత పురుషోత్తం, రుద్ర శ్రీశైలం, రుద్ర పాండురంగాశాస్త్రి, మంగళపల్లి శ్రీహరి, బల్ల దుర్వాసులు, చిట్టిమల్ల లక్ష్మీనారాయణ, కడవేరు శేఖర్, ఏలే పాండు, రుద్ర చెన్నకేశవులు తదితరులున్నారు. అమ్మవారికి పసుపు, కుంకుమ రంగు చీరెలు... ఇద్దరు చేనేత కార్మికులు 25 రోజుల పాటు ఎంతో నియమ నిష్టలతో ఉండి, మగ్గంపై పట్టు పంచె, అమ్మవారికి పసుపు, కుంకుమ రంగులో ఉన్న రెండు చీరెలను తయారు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిఏటా పోచంపల్లి పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించే అవకాశం రావడం పట్ల చేనేత కళాకారులు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
వైభవం: శ్రీకాళహస్తి శివరాత్రి బ్రహ్మోత్సవాలు
సాక్షి, శ్రీకాళహస్తి : దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయంలో ఆదివారం సాయంత్రం స్వామివారి భక్తుడైన భక్తకన్నప్ప ధ్వజారోహణంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. తొలుత ఆలయంలో స్వామి, అమ్మవార్లతోపాటు పంచమూర్తులు, భక్తకన్నప్ప ఉత్సవమూర్తులను అలంకార మండపంలో అర్చకులు రాజేష్ గురుకుల్ ఆధ్వర్యంలో పట్టుపీతాంబరాలు, గజమాలలు, విశేషాభరణాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తకన్నప్ప ఉత్సవమూర్తిని పల్లకిపై ఆశీనులు చేశారు. తదుపరి కైలాసగిరి పర్వతశ్రేణుల్లోని భక్తకన్నప్ప ఆలయం వరకు మేళతాళాల నడుమ పల్లకిలో ఊరేగింపుగా తీసుకు వెళ్లారు. అక్కడ ధ్వజస్తంభం వద్ద కొలువుదీర్చి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అర్చకులు అర్ధగిరి, సంబంధం, వరదా గురుకుల్ ఆధ్వర్యంలో ధ్వజస్తంభానికి అభిషేక పూజలు నిర్వహించారు. తదుపరి ముక్కోటి దేవతలను మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ఆహ్వానిస్తూ అర్చకులు ధ్వజస్తంభానికి ధ్వజపటాన్ని ఆరోహింపజేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. దేవస్థానం ఈఓ చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే సతీమణి శ్రీవాణిరెడ్డి, కుమార్తె పవిత్రారెడ్డి, భక్తులు పాల్గొన్నారు. భక్తులకు బోయ కుల సంఘం నాయకులు ప్రసాదాలను పంపిణీ చేశారు. అనంతరం శ్రీస్వామి,అమ్మవార్లు పురవీధుల్లో ఊరేగారు. భక్త కన్నప్ప కొండపైకి ఉత్సవమూర్తి ఊరేగింపు నేడు భవుడి ధ్వజారోహణం శ్రీకాళహస్తి: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం మాఘ బహుళ నవమిని పురస్కరించుకుని స్వామి వారి ధ్వజారోహణం చేపట్టనున్నట్లు దేవస్థానం ఈఓ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 12గంటలకు పూజలు ప్రారంభమవుతాయన్నారు. ఉదయం అర్చకులు అలంకార మండపంలో స్వామి,అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. తదుపరి ఉత్సవమూర్తులను స్వామివారి సన్నిధికి ఎదురుగా ఉన్న స్వర్ణ ధ్వజస్తంభం వద్దకు వేంచేపు చేస్తారు. స్వర్ణ ధ్వజస్తంభానికి అభిషేక పూజలు నిర్వహిస్తారు. దర్బలతో చేసిన తాడును శాస్త్రోక్తంగా ధ్వజస్తంభానికి ఆరోహింపజేస్తారు. భక్తులు సమర్పించే చీరలతో కొడి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. కన్నప్ప ధ్వజారోహణ ఊరేగింపులో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి స్వర్ణమ్మ, చిత్రంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి సతీమణి శ్రీవాణి, కుమార్తె పవిత్ర తదితరులు -
గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి
సాక్షి, తిరుపతి : గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. సింహావాహన సేవలో ఊరేగింపు జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. కరెంట్ వైర్లు తగులుకోవడంతో రథంపై ఉన్న గొడుగులు పక్కకు వాలాయి. దీంతో భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు సాయంత్రం పందిరి వాహనంపై గోవిందస్వామి దర్శనమివ్వనున్నాడు. -
కొమురవెల్లిలో భక్తుల రద్దీ
సిద్దిపేట: ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాలు ముగిసినా స్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. సిద్దిపేట, జనగామ, వరంగల్, హైద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాల నుంచి భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయంలోని గంగిరేగు చెట్టు ప్రాంగణం, ఆలయ ముఖమండపం, రాతిగీరలు, రాజగోపురం, కోడెల స్తంభం వద్ద భక్తుల రద్దీ నెలకొంది. కొందరు భక్తులు స్వామి, బలిజమేడలాదేవి, గొల్లకేతమ్మలకు ఒడి బియ్యం పోయగా మరికొందరు భక్తులు స్వామివారికి అభిషేకాలు, కల్యాణం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలోని గంగిరేగు చెట్టు వద్ద పట్నాలు వేయించుకున్నారు. స్వామి ధర్మదర్శనానికి రెండు నుంచి మూడు గంటల సమయం పట్టింది. ప్రత్యేక దర్శనం గంటలోపు జరిగింది. మల్లన్నకు మొక్కులు అప్పగించిన తర్వాత భక్తులు మల్లన్న గుట్టపై శ్రీ రేణుక ఎల్లమ్మ, నల్ల పోచమ్మలకు బోనాలు అప్పగించి ఒడి బియ్యాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు.