కొమురవెల్లిలో భక్తుల రద్దీ
సిద్దిపేట: ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాలు ముగిసినా స్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. సిద్దిపేట, జనగామ, వరంగల్, హైద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాల నుంచి భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయంలోని గంగిరేగు చెట్టు ప్రాంగణం, ఆలయ ముఖమండపం, రాతిగీరలు, రాజగోపురం, కోడెల స్తంభం వద్ద భక్తుల రద్దీ నెలకొంది.
కొందరు భక్తులు స్వామి, బలిజమేడలాదేవి, గొల్లకేతమ్మలకు ఒడి బియ్యం పోయగా మరికొందరు భక్తులు స్వామివారికి అభిషేకాలు, కల్యాణం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలోని గంగిరేగు చెట్టు వద్ద పట్నాలు వేయించుకున్నారు. స్వామి ధర్మదర్శనానికి రెండు నుంచి మూడు గంటల సమయం పట్టింది. ప్రత్యేక దర్శనం గంటలోపు జరిగింది. మల్లన్నకు మొక్కులు అప్పగించిన తర్వాత భక్తులు మల్లన్న గుట్టపై శ్రీ రేణుక ఎల్లమ్మ, నల్ల పోచమ్మలకు బోనాలు అప్పగించి ఒడి బియ్యాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు.