ధ్వజారోహణ పూజలు చేస్తున్న అర్చకులు, వేదపండితులు
సాక్షి, శ్రీకాళహస్తి : దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయంలో ఆదివారం సాయంత్రం స్వామివారి భక్తుడైన భక్తకన్నప్ప ధ్వజారోహణంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. తొలుత ఆలయంలో స్వామి, అమ్మవార్లతోపాటు పంచమూర్తులు, భక్తకన్నప్ప ఉత్సవమూర్తులను అలంకార మండపంలో అర్చకులు రాజేష్ గురుకుల్ ఆధ్వర్యంలో పట్టుపీతాంబరాలు, గజమాలలు, విశేషాభరణాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తకన్నప్ప ఉత్సవమూర్తిని పల్లకిపై ఆశీనులు చేశారు. తదుపరి కైలాసగిరి పర్వతశ్రేణుల్లోని భక్తకన్నప్ప ఆలయం వరకు మేళతాళాల నడుమ పల్లకిలో ఊరేగింపుగా తీసుకు వెళ్లారు.
అక్కడ ధ్వజస్తంభం వద్ద కొలువుదీర్చి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అర్చకులు అర్ధగిరి, సంబంధం, వరదా గురుకుల్ ఆధ్వర్యంలో ధ్వజస్తంభానికి అభిషేక పూజలు నిర్వహించారు. తదుపరి ముక్కోటి దేవతలను మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ఆహ్వానిస్తూ అర్చకులు ధ్వజస్తంభానికి ధ్వజపటాన్ని ఆరోహింపజేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. దేవస్థానం ఈఓ చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే సతీమణి శ్రీవాణిరెడ్డి, కుమార్తె పవిత్రారెడ్డి, భక్తులు పాల్గొన్నారు. భక్తులకు బోయ కుల సంఘం నాయకులు ప్రసాదాలను పంపిణీ చేశారు. అనంతరం శ్రీస్వామి,అమ్మవార్లు పురవీధుల్లో ఊరేగారు.
భక్త కన్నప్ప కొండపైకి ఉత్సవమూర్తి ఊరేగింపు
నేడు భవుడి ధ్వజారోహణం
శ్రీకాళహస్తి: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం మాఘ బహుళ నవమిని పురస్కరించుకుని స్వామి వారి ధ్వజారోహణం చేపట్టనున్నట్లు దేవస్థానం ఈఓ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 12గంటలకు పూజలు ప్రారంభమవుతాయన్నారు. ఉదయం అర్చకులు అలంకార మండపంలో స్వామి,అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. తదుపరి ఉత్సవమూర్తులను స్వామివారి సన్నిధికి ఎదురుగా ఉన్న స్వర్ణ ధ్వజస్తంభం వద్దకు వేంచేపు చేస్తారు. స్వర్ణ ధ్వజస్తంభానికి అభిషేక పూజలు నిర్వహిస్తారు. దర్బలతో చేసిన తాడును శాస్త్రోక్తంగా ధ్వజస్తంభానికి ఆరోహింపజేస్తారు. భక్తులు సమర్పించే చీరలతో కొడి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు.
కన్నప్ప ధ్వజారోహణ ఊరేగింపులో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి స్వర్ణమ్మ, చిత్రంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి సతీమణి శ్రీవాణి, కుమార్తె పవిత్ర తదితరులు
Comments
Please login to add a commentAdd a comment