Yadagirigutta Temple: అదిగదిగో యాదాద్రి | Yadadri Temple Swayambhu Darshan From 28th March | Sakshi
Sakshi News home page

Yadagirigutta Temple: అదిగదిగో యాదాద్రి

Published Sun, Mar 27 2022 2:26 AM | Last Updated on Sun, Mar 27 2022 9:54 AM

Yadadri Temple Swayambhu Darshan From 28th March - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యాదగిరి లక్ష్మీ నారసింహుడు.. తెలంగాణ ఇలవేల్పు.. ఏడాదికోసారైనా ఇంటిల్లిపాదీ ‘గుట్ట’కు వెళ్లి దర్శించుకోవటం ఆనవాయితీ. ఇప్పుడా నారసింహుడి ఆలయం అద్భుతమైన ‘యాదాద్రి’గా మారి వెలుగులు విరజిమ్ముతోంది. పూర్తి కృష్ణశిలల నిర్మాణం, అబ్బురపడే శిల్పాలతో సరికొత్త రూపాన్ని సంతరించుకుని.. భక్తజన కోటిని ఆనంద పారవశ్యంలో ముంచెత్తేందుకు సిద్ధమైంది. ఆరేళ్ల తర్వాత భక్తులకు స్వయంభూ లక్ష్మీనరసింహుడు తనివితీరా దర్శనమివ్వనున్నాడు. సోమవారం (28వ తేదీన) మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ముగిసిన తర్వాత సాధారణ భక్తులకు దర్శనం మొదలుకానుంది. 

మరో తిరుమలగా..! 
ఏపీలోని తిరుమల వెంకన్న సన్నిధి నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ, ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతోంది. సాధారణ రోజుల్లోనే 40 వేల మంది వరకు.. సెలవులు, ప్రత్యేక పర్వదినాల్లో దాదాపు 70– 80 వేల మంది దాకా వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు. ఇప్పుడు యాదాద్రి లక్ష్మీనరసింహుడి సన్నిధి తెలుగు రాష్ట్రాల్లో తిరుమల తర్వాత అంతగా భక్తుల తాకిడి ఉండే ఆలయంగా నిలుస్తుందని అంచనా. గత ఆరేళ్లలో బాలాలయంలో నరసింహస్వామిని.. సాధారణ రోజుల్లో 8 వేల మంది వరకు.. సెలవు రోజులు, ప్రత్యేక సందర్భాల్లో 30, 40 వేల వరకు దర్శించుకున్నారు. ఇప్పుడు ప్రధానాలయం, స్వయంభూ మూర్తి దర్శనం మొదలైతే.. భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు.

సాధారణ రోజుల్లో 20వేల మంది వరకు.. సెలవు రోజులు, ప్రత్యేక సందర్భాల్లో 40, 50వేల మంది వరకు వస్తారని పేర్కొంటున్నారు. ‘‘ఆలయ పునర్నిర్మాణ పనులు మొదలవకముందటితో పోలిస్తే.. పనులు మొదలై బాలాలయంలో స్వామి దర్శనాలు మొదలుపెట్టాక అనూహ్యంగా భక్తుల సంఖ్య పెరిగింది. 5 వేల మంది దర్శించుకునే రోజుల్లో 10 వేల మంది రావడం మొదలైంది. ప్రత్యేక సందర్భాల్లో 30వేల మంది వరకు వచ్చారు. కొత్త ఆలయ నిర్మాణంతో దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. భక్తులు, సందర్శకుల సంఖ్య భారీగా పెరుగుతుందని భావిస్తున్నాం. రోజుకు 50వేల మంది వచ్చినా ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశాం’’ అని యాదాద్రి ప్రాంత అభివృద్ధి సంస్థ వైస్‌చైర్మన్‌ కిషన్‌రావు చెప్పారు. 
 
వెయ్యేళ్లకుపైగా నిలిచేలా.. 
యాదాద్రి ఆలయాన్ని పూర్తిగా కృష్ణశిలలతో నిర్మించారు. నిజానికి 17వ శతాబ్దం తర్వాత రాతి నిర్మాణాలు చాలావరకు నిలిచిపోయాయి. ఇటుకలు, ఆ తర్వాత సిమెంటు వాడకం పెరిగి రాతిని వాడటం ఇబ్బందిగా భావిస్తూ వచ్చారు. జటప్రోలు సంస్థానాధీశులు నిర్మించినవే తెలుగు నేలపై చివరి పూర్తి రాతి మందిరాలు. ఇన్ని వందల ఏళ్ల తర్వాత మళ్లీ తొలిసారి పూర్తి రాతి నిర్మాణానికి యాదాద్రి వేదికైంది. ఆలయం కోసం ఏకంగా రెండున్నర లక్షల టన్నుల కృష్ణ శిలలను వినియోగించారు. 1,200 మంది శిల్పులు రాత్రింబవళ్లు పనిచేసి అద్భుతంగా తీర్చిదిద్దారు. వెయ్యేళ్ల పాటు నిలిచేలా ఇంటర్‌లాకింగ్‌ పరిజ్ఞానం, బరువు సమతూకం అయ్యేలా డిజైన్‌ చేసి ఆలయాన్ని నిర్మించారు. పిడుగుపాటుతో నష్టం కాకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు. 

ప్రధానాలయ విమానగోపురంపై సీఎం కేసీఆర్‌ సంప్రోక్షణ చేయనున్న నేపథ్యంలో ప్రత్యేకాలంకరణలో ఏర్పాటు చేసిన రంగురంగుల ధ్వజాలు 
 
అద్భుత శైలి.. ఆకట్టుకునే విగ్రహాలతో.. 
సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో దాదాపు రూ.1,200 కోట్ల భారీ వ్యయంతో యాదాద్రి పునర్నిర్మాణాన్ని చేపట్టారు. 2015లో మొదలైన నిర్మాణం ఇటీవలే పూర్తయింది. అబ్బురపడే రీతిలో ఈ ఆలయం రూపుదిద్దుకుంది. ఓ రకంగా చెప్పాలంటే గుడి కాదు ఏకంగా గుట్టనే మారిపోయింది. 
► యాదాద్రి ఆలయ నిర్మాణంలో కాకతీయ, చోళ, చాళుక్య, పల్లవ.. ఇలా ఎన్నో అద్భుత నిర్మాణ శైలులను వినియోగించారు. 
► వైష్ణవ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యం ఉన్న ఆళ్వార్లు ఇక్కడ రాతి స్తంభాల రూపంలో ముఖ మండపంలో కొలువుదీరారు. 12 మంది ఆళ్వార్లు 11 అడుగుల ఎత్తుతో 38 అడుగుల ఎత్తున్న ముఖ మండపానికి ఆధారభూతంగా నిలిచారు. 
► మరెక్కడా లేనట్టుగా 1,700 అడుగుల పొడవునా.. దాదాపు 80 నుంచి 100 అడుగుల ఎత్తుతో ప్రాకారాలను నిర్మించారు. 
► 84 అడుగుల ఎత్తుతో ఏడు అంతస్తుల మహారాజగోపురం.. ఐదు, నాలుగు, మూడు, రెండు అంతస్తులతో మరో ఐదు గోపురాలు, విమాన గోపురం ఇక్కడి మరో ప్రత్యేకత. 
► మహారాజగోపురం ఒక్కదానికే ఏకంగా 13 వేల టన్నుల రాయిని వాడారు. ఇది పూర్తవటానికి రెండేళ్లు పట్టింది. 
► ఏ దేవాలయంలోనూ లేనట్టు ప్రాకారానికి వెలుపల అష్టభుజి మండపాలను ఏర్పాటు చేశారు. రథయాత్ర సాగినా భక్తులు హాయిగా ఆ మండపాల్లో కూర్చుని చూడొచ్చు. 
► సింహం తల, గుర్రం తరహా శరీరం, దిగువ ఏనుగు.. వెరసి యాలీ జంతు రూపం. ఇలాంటి భారీ రాతి శిల్పాలు ఏకంగా 58 కొలువుదీరాయి. నోరు తెరిచి ఉన్నట్టుగా ఉండే ఆ విగ్రహాల నోటిలో అతిపెద్ద రాతి బంతులు ఉండటం విశేషం. 
► ఏడు చోట్ల ఐరావతాలు, ప్రవేశం నుంచి ఆలయంలోకి వెళ్లేప్పుడు స్తంభాల రూపంలో ఆంజనేయుడు, ప్రహ్లాదుడు, యాద మహర్షి, రామానుజుల రూపాలు, గర్భాలయ ద్వారంపైన రాతి ప్యానెల్‌పై గర్భాలయ ఉత్సవ మూర్తి రూపం, ప్రహ్లాదచరిత్ర, పంచ నారసింహుల రూపాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. 
► సాయంత్రం సంధ్యా సమయంలో దీపాలు వెలిగించినట్టుగా అదేతరహా కాంతితో ప్రత్యేక లైటింగ్‌ వ్యవస్థ ఆకట్టుకుంటోంది. 
 
ఇది ఓ తంజావూరు.. ఓ శ్రీరంగం 

గొప్ప రాతినిర్మాణ దేవాలయం అనగానే మనకు తంజావూరు గోపురం గుర్తుకొస్తుంది. శ్రీరంగం మదిలో మెదులుతుంది. ఇప్పుడా రెండు దేవాలయాలు మనకు యాదాద్రిలో కనిపిస్తాయి. ఇది అసాధారణ నిర్మాణం. సీఎం కేసీఆర్‌ శ్రీకృష్ణదేవరాయలులాగా నిలిచి, ఆలోచనలు పంచి, ఆర్థిక వనరులు కల్పించి కట్టించారు. రాతి దేవాలయాల నిర్మాణ చరిత్రలో యాదాద్రి చిరకాలం నిలిచిపోతుంది. భక్తులకు ఆధ్యాత్మిక పరిమళాలతోపాటు గొప్ప నిర్మాణంలో గడిపిన అనుభూతిని పంచుతుంది. 
– ఆనంద సాయి, ఆలయ ఆర్కిటెక్ట్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement