బూజు పట్టి పాడై ముద్దగా మారిన లడ్డూలు
సాక్షి, యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో విక్రయించే 20 రూపాయల చిన్న లడ్డూలకు ఫంగస్ వచ్చింది. దీంతో వాటిని దేవస్థానం అధికారులు ఆదివారం ఉదయం చెత్త తరలించే ట్రాక్టర్‌లో గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్లి పడేశారు. సుమారు 2,500 లడ్డూలకు బూజు రావడంతో వీటిని పెద్దపెద్ద బ్యాగుల్లో నింపి ట్రాక్టర్‌లో ఉంచి కనిపించకుండా పైనుంచి చెత్త వేసి తరలించారు. వీటి విలువ రూ.50 వేల వరకు ఉంటుంది. పది రోజుల క్రితం తయారు చేసిన ఈ లడ్డూలను భక్తులకు విక్రయించేందుకు కౌంటర్‌లోకి తీసుకెళ్లి ఉంచారు.
అక్కడ గాలి, వెలుతురు సరిగా లేకపోవడంతో లడ్డూలకు బూజు రావడంతో రెండు రోజుల క్రితం తిరిగి వాటిని తయారీ కేంద్రానికి తీసుకువచ్చినట్లు తెలిసింది. ఆదివారం ఉదయం వీటిని ఎవరూ చూడకుండా పెద్దపెద్ద సంచుల్లో నింపి చెత్త ట్రాక్టర్‌లో తరలిస్తుండగా గమనించిన స్థానికులు పాతగుట్ట రోడ్డు మధ్యలో అడ్డుకున్నారు. డ్రైవర్‌తో గొడవకు దిగడంతో అక్కడే రోడ్డు పక్కన పారబోసి వెళ్లారు.అయితే వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడం, కౌంటర్‌లో గాలి, వెలుతురు సరిగా లేకపోవడం వల్ల లడ్డూలకు బూజు వచ్చిందని దేవస్థానం అధికారులు తెలిపారు. ఏడాది క్రితం లడ్డూలకు బూజు రావడంతో పడేసిన ఘటనలు ఉన్నాయి. అయినా దేవస్థానం అధికారులు సరైన చర్యలు చేపట్టకపోవడంతో విమర్శలకు తావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment