పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరం కానుకగా తెలంగాణ ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీపై పరిమితులను ఎత్తివేసింది. జనవరి 1 నుంచి రేషన్ కార్డులున్న కుటుంబంలో ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. ఒక్కొక్కరికి నాలుగు కిలోల చొప్పున.. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 20 కిలోల బియ్యం ఇవ్వాలన్న నిబంధనల ప్రస్తు తం అమల్లో ఉందన్నారు. ఇప్పట్నుంచీ కుటుం బంలో ఎంత మంది సభ్యులున్నా.. వారందరికీ ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తామన్నారు.
అంత్యోదయ కార్డులున్న పేద కుటుం బాలకు 35 కిలోల బియ్యం అందుతోందని.. ఆ కుటుంబంలో సభ్యులు ఎక్కువగా ఉంటే తెల్లకార్డుగా మార్చుకొని సరిపడేంత బియ్యం తీసుకునే వీలు కల్పించామన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రి ఈ వివరాలను వెల్లడించారు. దీంతోపాటు జనవరి ఒకటి నుంచి ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలతోపాటు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం సరఫరా చేస్తామన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాలకు పౌష్టికాహార పంపిణీని రాష్ట్రమంతటికి విస్తరిస్తున్నట్లు ఈటెల ప్రకటించారు. రాష్ట్రంలో 35 వేల అంగన్‌వాడీ కేంద్రాలుంటే 19 వేల కేంద్రాలకే గుడ్లు, పాలు, పౌష్టికాహారం పంపిణీ జరుగుతోందన్నారు. ఇకపై అన్ని కేంద్రాలకు పౌష్టికాహారం అందిస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టులకు, పౌష్టికాహారం పంపిణీకి రూ.70 కోట్లు ఖర్చు చేస్తుండగా.. రూ.220 కోట్ల ఖర్చుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధపడిందని మంత్రి తెలిపారు.