మళ్లీ ఉచిత బియ్యం | AP has once again stepped in to help poor families with free rice distribution | Sakshi
Sakshi News home page

మళ్లీ ఉచిత బియ్యం

Published Tue, Apr 27 2021 3:08 AM | Last Updated on Tue, Apr 27 2021 8:52 AM

AP has once again stepped in to help poor families with free rice distribution - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా కోరలు చాస్తున్న నేపథ్యంలో పేద కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ముందుకొచ్చింది. దారిద్యరేఖకు దిగువన ఉన్న 1.47 కోట్ల బియ్యం కార్డుదారుల కుటుంబాల్లో ఒక్కో సభ్యుడికి మే, జూన్‌లలో 10 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. అదికూడా వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా తినగలిగేలా సార్టెక్స్‌ చేసి నాణ్యత పెంచిన స్వర్ణ రకం మధ్యస్థ సన్న బియ్యం ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించడం గమనార్హం. కరోనా గడ్డు పరిస్థితుల్లో పేదలు పస్తులుండగా ఆదుకునేందుకు ఉద్దేశించిన ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల్లో దాదాపు రూ.800 కోట్లు వెచ్చించనుంది. 

కేంద్రం ఇస్తామన్న దానికి రెండింతలు
పేదలను ఆదుకునేందుకు ఉచిత బియ్యం పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం చెప్పినదాని కంటే రెండింతలు ప్రయోజనం చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. బియ్యంకార్డులున్న కుటుంబాల్లో ప్రతి సభ్యుడికి నెలకు 5 కిలోల చొప్పున మాత్రమే మే, జూన్‌లో ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 1.47 కోట్ల బియ్యంకార్డులు ఉండగా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 88 లక్షల బియ్యంకార్డులను మాత్రమే గుర్తించింది. ఈ కుటుంబాలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుంది. అయితే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో పేదలు అందరికీ ఉచితంగా బియ్యం పంపిణీ చేయలని నిర్ణయించారు. అంతేకాకుండా ఒక్కో లబ్ధిదారుడికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5 కేజీలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 5 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించడం విశేషం. తద్వారా 88 లక్షల బియ్యం కార్డులకు కేంద్రం ఇస్తున్న ఐదు కిలోలకు అదనంగా రాష్ట్రం మరో 5 కిలోలతో కలిపి మొత్తం పది కిలోలు కార్డుదారుల్లో ఒక్కో సభ్యుడికి ఉచితంగా ఇవ్వనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం గుర్తించని మిగిలిన 59 లక్షల బియ్యంకార్డుదారుల కుటుంబాలకు సంబంధించి ఒక్కో సభ్యుడికి నెలకు 10 కిలోల చొప్పున మే, జూన్‌లో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భారాన్ని భరించి ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు దాదాపు రూ.800 కోట్లు వెచ్చిస్తోంది.

నాణ్యమైన సార్టెక్స్‌ స్వర్ణ బియ్యం
దేశవ్యాప్తంగా పేదలకు సాధారణ బియ్యాన్నే పంపిణీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పేదలకు సార్టెక్స్‌ చేసి నాణ్యత పెంచిన స్వర్ణ రకం మధ్యస్త సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

నెలకు ఒకే విడతలో పంపిణీ...
గత ఏడాది కూడా కరోనా తీవ్రత ఉన్న ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రెండు విడతల్లో ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం తెలిసిందే. ఈసారి ప్రజల సౌకర్యార్థం నెలకు ఒకే విడతలో బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. బియ్యంకార్డుదారుల కుటుంబాల్లో ఒక్కో సభ్యుడికి నెలకు 10 కేజీల చొప్పున బియ్యాన్ని మేలో ఒకసారి, జూన్‌లో మరోసారి ఉచితంగా పంపిణీ చేస్తారు. ఇంటింటికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్న వాహనాల ద్వారానే బియ్యం అందచేస్తారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement